జలపాతం కాదు.. జలధార..!
• భూమికి సమాంతరంగా గంగమ్మ!
• గుండాల చుట్టూ బండ నేలలు
• రామేశ్వరాలయాల వద్ద జలవింత
• అదే నీటితో శివుడికి భక్తుల పూజలు
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరాసంగం: ఎటు చూసినా బండ నేల రాళ్లు, దట్టమైన గట్టు ప్రాంతం గట్టుపైన జల ధార నీటి (గుండం) ఎండాకాలంలో సైతం ఎండిపోని నీరు. ఏళ్ల తరబడి ఇదే తంతు జలధార ఎటు నుంచి వస్తుందో అంతుచి క్కని రహస్యం. చుట్టూ బండ నేల ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో మాత్రం నేటికీ నీరు భూమికి సమాంతరంగా ఉంటుంది.
సంగారెడ్డి జిల్లా కొల్లూరు రామేశ్వర దేవాలయం వద్ద గల జలగుండం స్థితి ఇది. ఝరా సంగం మండలంలోని కొల్లూర్ గ్రామ శివారులోని ప్రఖ్యాత రామేశ్వర దేవాలయం సమీపంలో ఒక వింతైన జలగుండం ఎల్లప్పుడూ ప్రత్యేక ఆకర్ష ణగా నిలుస్తోంది. చుట్టూ బండరాళ్లు, ఎత్తైన గట్టు ప్రాంతంతో నిండి ఉన్నప్పటికీ, ఈ నీటి గుండం మాత్రం ఎండాకాలంలో సైతం ఎండిపోకుండా నీటితో కళకళలాడుతూ ఉండటం విశేషం. ఎటు చూసినా రాతి నేల ఉండగా, ఈ ప్రాంతంలో మాత్రం నేలకు సమాంతరంగా నీటితో నిండి ఉంటుంది. సంవత్సరాలు గడుస్తున్నా ఈ జలధార తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది. అయితే ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనే విషయం మాత్రం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది. సాధార ణంగా ఎండాకాలంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఎండిపోతుంటాయి.భూగర్భ జలాలు అడుగం టుతాయి. కానీ కొల్లూరు రామేశ్వర దేవాలయం వద్ద గల ఈ జలగుండం లోని నీరు ఏ మాత్రం తగ్గకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిత్యము ఆ నీటిని పశువుల కాపరులు, వ్యవసాయదారులు, కూలీలు,నీటిని సేవిస్తారు.
ఎండకాలం కూడా బావిలో నీరు..

ఝరాసంగం మండలంలోని మాచునూర్ గ్రామ శివారులోని శ్రీ రామేశ్వర ఆలయం వద్దగల బావి నీరు ఎప్పుడూ తగ్గకుండా ఉండడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎండాకాలంలో సైతం ఈ బావిలో నీరు భూమికి సమాంతరంగా ఉండడం. విశేషం. చుట్టూ బండ నేల ఉన్నప్పటికీ, ఆయా బావిలోని నీరు ఎప్పుడూ తగ్గకపోవడం అంతుచి క్కని రహస్యంగా మారింది. బావిని సత్పురుషులైన రాందాస్ మహారాజ్, హనుమాన్ దాస్ మహారాజ్ కొన్ని ఏళ్ల క్రితం నిర్మించారని స్థానికులు కథనం. కొంతమంది భక్తులు బావి చుట్టూ సిమెంట్ గోడను నిర్మించారు. ప్రస్తుతం పూర్వపు బొక్కెన తాడు సహాయంతో భక్తులు, గ్రామస్తులు చేదుకొని స్నానాలు చేసి అక్కడే ఉన్న రామేశ్వర శివలింగానికి పూజలు నిర్వహిస్తారు. ఎండాకాలంలో సైతం నీరు తగ్గకుండా భూమికి సమాంతరంగానే ఉంటుంది. ఈ బావి లోతు సుమారుగా 20 ఫీట్లు ఉంటుందని గ్రామస్తుల కథనం. ఈ దేవాలయాల వద్ద మహాశివ రాత్రి. కార్తీక మాసం, పౌర్ణమి, అమావాస్య, శ్రావణ మాసం పండుగ సమయాలో జహీరాబాద్ ప్రాంతం నుంచి కర్ణాటకలోని బీదర్, చించోల్లు, కుంచారం, మన్నె కెళ్లి, తదితర ప్రాంతాల భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకుంటారు.