కొనలేం..తినలేం!

https://epaper.netidhatri.com/view/298/netidhathri-e-paper-20th-june-2024%09

-ఉల్లి ఘాటు..వెల్లుల్లి కాటు.

-కారం మండిపోతోంది.

-ఎండు మిర్చి ఏడిపిస్తోంది.

-పచ్చి మిర్చి నూరు దాటేసింది.

-టమాట…నోట మాట రానివ్వడం లేదు.

-సబ్బులు…అబ్బో ధరలు.

-నూనెలు కాగుతున్నాయి.

-పప్పులు ఉడకనంటున్నాయి.

-ఆలు అటు వైపు చూడకంటున్నాయి.

-పిండి పిరమైంది…

-పసుపు బంగారమైంది.

-కాకరకాయలు కరకరలాడనంటున్నాయి.

-వంకాయ వగలు పోతోంది.

-అంత ధరలు పెట్టినా వాడిపోయి వుంటున్నారు.

-కొంటే కొనండి లేకుంటే ఎండి సావండంటున్నాయి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సామాన్యుడు బతికెదెల్లా…ఎంత సేపు రాజకీయాలు..ఆదిపత్య పోకడలు..వ్యాపారాలు, సంపదలు ఇలా ప్రతి విషయాన్ని అటు నేతలు, ఇటు మీడియా మాట్లాతున్నాయే గాని పెరుగుతున్న ధరల గురించి ఎవరూ మాట్లాడం లేదు. ప్రతి ఏడు తప్పకుండా కొన్ని నెలల పాటు అయితే కూరగాయల ధరలు, లేకుంటే ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతుంటాయి. కారణం ఎవరూ ఆలోచించరు. ప్రతి ఏటా ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమౌతుందన్న దానిని గుర్తించరు. ఏఏ సమయయాల్లో ధరల్లో మార్పులు వస్తున్నాయో పసిగట్టరు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోరు. ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించరు. గత దశాబ్ధ కాలంగా పెరుగుతున్న ధరల మీద మాట్లాడే తీరిక ఎవరికీ లేకుండాపోయింది. పెరుగుతున్న ధరలకు అలవాటు పడిపోవడం తప్ప, ప్రశ్నించేవారు లేకుండా పోతున్నారు. పాలకులు ఎవరైనా సరే వాటిని పట్టించుకోవడం మానేశారు. చాలా వస్తువుల విషయాల్లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. ఓ వైపులకు పాలకులు వేసే జిఎస్టీకి ధరలు ఎలా పెరుగుతంటే వాటి విలువ అలా పెరుగుతూ ప్రభుత్వాలకు ఆదాయాలు సమకూర్చుతున్నాయి. దాంతో ధరలను అదుపుల చేయాలన్న ఆలోచన పాలకులు రావడం లేదు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నంటున్నారన్న సోయి వారిలో కనిపించడం లేదు. ప్రజలు కూడా తమకు ఇబ్బందిగా వుందన్న విషయాన్ని చెప్పడానికి కూడా మొహమాటపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కాంగ్రెస్‌కు నోరులేదు. వారి మాట ప్రజలు వినడం లేదు. వారి వెంట నడిచేందుకు సిద్దంగా లేరు. ప్రజలను చైతన్యం చేయాలన్న ఆలోచన కాంగ్రెస్‌లో లేదు. ఎందుకంటే యూపిఏ2 కాలంలో ఇవే నిత్యావసర వస్తువుల ధరలే కాంగ్రెస్‌ పతనానికి కారణమయ్యాయి. కాని ఈ పదేళ్లలో కాంగ్రెస్‌ పార్టీ నిత్యావసర వస్తువుల పెరుగుదల మీద మాట్లాడడం లేదు. సామాన్యుల ఇబ్బందుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దేశం కోసం, ధర్మం కోసం మేమున్నామంటూ ఎలాంటి సమస్యలెదురైనా ఒకటే నినాదం. విదానం అంటూ ముందుకు వెళ్లడం ప్రజలను ఆ మూడ్‌లోకి తీసుకెళ్లడంతో బిజేపి నిరసనలు తప్పించుకుంటోంది. అందుకు బిజేపి నాయకులను సిద్దంచేసి, పెట్రో ధరలు పెరిగినా అవి దేశం, కోసం ధర్మం కోసం అనేంతగా మాట్లాడేలా తర్పీదు ఇచ్చారు. వాళ్లు ఎంత సేపు అదే మాట మాట్లాడుతుంటారు.

ఇంట్లో ఈగల మోత, బైట పల్లకీల మోత అన్నట్లు బిజేపి నాయకులకు, కార్యకర్తలకు ఇబ్బందులు ఎదురుకావడం లేదా?

అంటే అవుతున్నాయి. కేవలం రాజకీయాల కోసం వారు ఆకలిని ఆపుకుంటున్నారు. కడుపు మంటను రాజకీయం కోసం చల్లార్చుకుంటున్నారు. పార్టీ జెండా జపం చేస్తున్నారు. కుటుంబాలను పస్తులుంచుతున్నారు. అయినా బిజేపి నాయకులు ధరలు తగ్గించాలని సొంత పార్టీని కోరరు. సూచనలు అసలే చేయరు. మోడీ చెప్పిందే వింటారు. ప్రధాని మోడీ చేస్తున్నదానికి జేజేలు కొడుతుంటారు. కాంగ్రెస్‌ పార్టీ తన రాజకీయ ప్రాబల్యం కోసం పాకులాడడంతప్ప, పదేళ్లలో చేసిన ఉద్యమాలు లేవు. ఇటీవల రాజ్యాంగం చేతుల్లో పట్టుకొని రాజకీయం చేయడం తప్ప, పతనమౌతున్న ప్రజల జీవితాలను గురించి పట్టించుకోవడం లేదు. ప్రశ్నించడం లేదు. ప్రజల తరుపును ఉద్యమాలు చేయడం లేదు. ధరలపై యుద్దం చేయడం లేదు. సామాన్యుడు కడుపు మార్చుకుంటున్న సంగతిని చెప్పలేరు. దాంతో ధరల మోతలో సామాన్యుడు నలిగిపోతున్నారు. చాలీ చాలని సంపాదనలతో సామాన్యుడు బతకలేకపోతున్నాడు. పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. ధరలకు రెక్కలొచ్చాయి. ఇలా ధరలు పెరుగుతుంటే పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించే తీరిక ప్రతిపక్షాలకు లేదు. సామాన్యుడికి అసలే లేదు. ఎందుకంటే ఏ పూట పని చేయకపోయినా ఆ పూట పస్తులుండాల్సిన పరిస్దితులొచ్చాయి. ఈ రోజు సంపాదన ఆరోజుకే సరిపోవడంలేదు. ఇక మాకు కష్టాలున్నాయి బాబూ అని చెప్పుకునే పరిస్ధితి లేదు. మొన్నటి వరకు మార్కెట్‌లో ఉల్లి ధరలు కిలోకు రూ.25 వరకు వుండేవి. ఇప్పుడు కిలో ఉల్లి ధర విపరీతంగా పెరిగింది. కిలో తెచ్చినా తరుగు సగం పోతోంది. పైగా మార్కెట్‌కు సరిపోయేంత ఉల్లి రావడం లేదంటున్నారు. ఆ సంగతి వ్యాపార వర్గాలు చూసుకోవాలి. పాలకులు పర్యవేక్షించాలి. బ్లాక్‌ మార్కెట్‌ చేస్తే చరర్యలు తీసుకుంటామంటారు. చేతులు దులుపుకుంటారు. వర్షాలు బాగా పడినప్పుడు మురిగిపోయాయని అంటారు. ఎండలు బాగా కాసినప్పుడు నీరులేక పంటలు ఎండిపోయాయంటారు. కాని రైతు నుంచి తక్కువ ధరకు సేకరించే వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ,జనాలను ఇబ్బందులు పెడుతుంటారు. పండిరచిన రైతు బాగు పడడం లేదు. కొనుక్కునే వినియోగదారుడు సంతోషంగా లేదు. కృత్రిక కొరత సృష్టించి, ఇష్టమొచ్చిన ధరలకు వ్యాపారులు అమ్ముతున్నారు. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు అనేకం వచ్చాయి. అయినా పాలకులు కళ్లు తెరవరు. కృత్రిమ కొరత సృష్టించేవారి మీద చర్యలు తీసుకోరు. ప్రభుత్వమే ప్రత్యేకంగా గతంలో కొన్ని సార్లు అమ్మకం కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. ప్రభుత్వం మార్కెట్‌కు ఉల్లి సరఫరా చేసేది. ఇప్పుడు మళ్లీ ఉల్లి ధరలు సెంచరీకి చేరువయ్యే పరిస్ధితి కనిపిస్తోంది.

ఉల్లి లేకుండా సహజంగా ఏ ఇంట్లో కూరలుండవు.

ఆ ఉల్లి ధరలను అదుపు చేస్తామని ఇప్పటి వరకు ఏవరూ ప్రకటించడం లేదు. ఇక టమాటా పరిస్ధితి అలాగే వుంది. అసలు టమాటాకొరత ఎందుకు వస్తుందన్నదానిపై ఎవరికీ క్లారిటీ వుండదు. ధర రావడం లేదని రైతులు టమాటాలు రోడ్డు మీద పారబోసిన సందర్భాలు అనేకం వున్నాయి. ఎప్పుడూ అటు రైతులు బగు పడిరది లేదు. ఇటు వినియోగదారుడి తక్కువ ధరకు అందింది లేదు. నిజానికి దేశ వాలీ టమాటాల కాలం పోయింది. ఇప్పుడు నిలువ వుండే టమాటాల కాపు మొదలైంది. ఇది వ్యాపారులకు వరంగా మారింది. రైతులకు శాపంగా మారింది. ప్రజలకు మోయ లేని బారంగా తయారైంది. టమాట లేకుండా ఏ కూర వండుకునే పరిస్ధితి లేదు. పైగా పేదలు తక్కువ ధరలో కూర కావాలంటే, తక్కువ సమయంలో ఏదైనా కూర వండుకోవాలంటే టమాట వైపు చూస్తారు. ఆ టమాట కూడా సెంచరీకి చేరువైంది. ఇరవై రూపాయలకు కిలో అందుబాటులో వున్న టమాటా ఒక్కసారిగా సెంచరీకి చేరువౌతోంది. కాని ఏ ప్రభుత్వం దానిపై దృష్టిపెట్టడంలేదు. కిలో కంది పప్పు ధర రూ.180 దాకా చేరింది. కనీసం పప్పు కూడ తినలేని పరిస్దితులు వచ్చాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం కిలో కందిపప్పు వందలోపే వుండేది. ఏడాది కాలంలో ఇంత రేటు పెరిగింది. ఇక వెల్లుల్లి ధర చెబితే ప్రజలు భయపడిపోతున్నారు. కిలో వెల్లుల్లి రూ.300 వరకు చేరింది. ఇంకా ఆపై కూడా అమ్ముతున్నారు. పచ్చి మర్చి కూడా వందకు చేరువైంది. ఇక ఎండు మర్చి ధర కిలో రూ.400 వరకు చేరింది. కారం పొడి ప్యాకెట్‌ 250గ్రామలు రూ.150 వరకు అమ్ముతున్నారు. పసుపు ప్యాకెట్‌ 50 గ్రాముల ధర రూ.64 వుంది. ఇలా ధరల గురించి రాస్తూ పోతే చాంతాడంత లిస్టు తయారౌతోంది. కరోనాకు ముందు ఏ సబ్బు ధర చూసుకున్నా రూ.30లోపే వుండేవి. కాని ఇప్పుడు ముప్పై రూపాయలల్లో సబ్బులు రావడం లేదు. సంతూర్‌ లాంటి సబ్బులు రెండు కొంటే ఒక పెన్ను ప్రీ అని అమ్ముతుండేవారు. ఇప్పుడు అప్పుడు రెండు సబ్బుల ధరలు ఇప్పుడు ఒక్క సబ్బుకే సరిపోతోంది. ఇక కరోనా తర్వాత హ్యండ్‌వాష్‌ల యుగం వచ్చింది. ఇక హ్యాండ్‌ వాష్‌ల ప్యాకెట్ల ధరలు రూ.300పైనే వుంటున్నాయి. ఇక టూత్‌ పేస్టులు కరోనాకు ముందు రూ.50 వుండేది. ఇప్పుడు అదే పేస్టు ధర రూ.150 పైగా వుంది. టూత్‌ పేస్టుల ధరలు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయంటే అడిగే వారు లేరు. అదుపు చేసేవారు పట్టించుకోరు. బియ్యం ధరలు ఎలా పెరగుతున్నాయో చూస్తూనే వున్నాం. వంట నూనెల ధరలో ఆ మధ్య ఆకాశాన్నంటాయి. వాటి మీద పెద్దఎత్తున జనం నుంచి నిరసనలు ఎదురయ్యాయి. దాంతో కేంద్రం కలుగుజేసుకున్నది. కాని మిగతా వాటిని గురించి వదిలేసినట్లున్నారు. అందుకే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. యూపీయే 2లో సిలిండర్‌ ధర రూ.400 వుండేది. కాని ఇప్పుడు రూ.1200కు చేరింది. బిజేపి అధికారంలోకి వచ్చినప్పుడు సబ్బిడీ బ్యాంకులోవేస్తామన్నారు. తర్వాత దేశం కోసం, ధర్మం కోసమంటూ సబ్సిడీ వదులకోవాలని సూచించడం మొదలు పెట్టారు. ఆఖరుకు ఆ సబ్సిడీని ఎత్తేశారు. ఇలా పెట్రోల్‌ డీజిల్‌ ధరలు గతంలో ఎప్పుడో ఆరు నెలలో, ఏడాదికో రూపాయి పెరిగితే పెద్దఎత్తున ఉద్యమాలు చేసేవారు. ఒక రకంగాచెప్పాలంటే 2014కు ముందు సిలిండర్‌ ధరల పేరు చెప్పే బిజేపి అదికారంలోకి వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ లాంటి వారు సిలిండర్‌లతో అనేక సార్లు ఉద్యమాలు చేశారు. ఉల్లి దండలతో పోరాటాలు చేశారు. ఇప్పుడు ఆ ధరలను మర్చిపోయారు. ఇలా పెట్రోల్‌ డీజెల్‌ ధరల మూలంగా నిత్యావసర వస్తువుల ధరలు పెద్దఎత్తున పెరుగుతున్నాయి. పల్లెల్లో కూరగాయలు పండడం లేదా? అంటే రైతులు పండిస్తున్నారు. కాని వాటిని వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి, సొమ్ముచేసుకుంటున్నారు. వీటిపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్ప సామాన్యుడు బతకలేడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *