చిత్రపురిలో చిత్రవిచిత్ర దోపిడి విన్యాసాలు ఎపిసొడ్‌`3 చిత్రపురిలో నక్షత్రకులు!

https://epaper.netidhatri.com/view/238/netidhathri-e-paper-17th-april-2024%09/3

`దారి దోపిడీదారులను మించిన నయవంచకులు.

`కార్మికుల బతుకులతో ఆటలాడుకుంటున్నారు.

`కార్మికుల జీవితాలను బలిపెడుతున్నారు.

`ఎప్పటికప్పుడు వారిని దోచుకుతింటున్నారు.

`ముప్పై ఏళ్లుగా మభ్యపెడుతూ మోసం చేస్తున్నారు.

`కొత్త సభ్యత్వాలు ఇవ్వలేదని అబద్ధాలు చెబుతున్నారు?

`అనర్హులకు ప్లాట్లు కట్టబెడుతున్నారు.

`కోట్లకు కోట్లు దండుకుంటున్నారు.

`ఎవరూ సుద్దపూసలు కాదు.

`పెద్దల ముసుగులో కార్మికుల ఎంగిలి తింటున్నారు.

`సినీ లోకం..ఛీ..ఛీ అంటున్నా తుడుచుకుపోతున్నారు.

`ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో వ్యాపారం చేస్తున్నారు.

`పేద కార్మికుల ఉసురుపోసుకుంటున్నారు.

`వాళ్లు మారరు…ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే దారికి రారు.

`కార్మికుల కష్టాలు తీరవు…సొంతింటి కల నెరవేరదు.

`ఆ కల తీరకుండానే ఎంతో మంది చనిపోయారు.

`వారి ఆత్మల మీద కూడా పేలాలేరుకొని తింటున్నారు.

`చిత్రపురి పెద్దలు రాబంధులను మించిపోయారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
చిత్ర పురిలో పెద్దలుగా చెలామణి అవుతున్న వారు నక్షత్రులను మించిపోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందులో సుద్దపూసలు ఎవరూ లేరు. ఎవరి స్వార్ధం కోసం వారు చిత్రపురిని వాడుకుంటూ, తమ పబ్బం గడుపుకుంటున్నారు. విధిలేని పరిస్దితుల్లో అప్పు చేసిన పాపానికి సత్య హరిశ్చంద్రుడు, అప్పు తీర్చలేక ఎన్ని అవస్థలు పడ్డాడో..చిత్రపురి కార్మికులు కూడా అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంఘాలుగా మారితే సభ్యత్వాలు దక్కితే, వుండడానికి గూడు దొరుకుందన్న ఆశతో మొదలైన చిత్రపురి కార్మికుల ప్రయాణం సొసైటీ కమిటీ దోపిడికి మార్గమైంది. వారికి ఆస్దులు కూడబెట్టే బ్యాంకుగా మారిరంది. పెద్దలు దోచుకుంటూ తింటున్నా ప్రశ్నించలేని స్దితికి చేరింది. ఎప్పుడు ఏ లెక్క చెబుతారో? అర్ధం కాని అయోమయంలో కార్మికులు వున్నారు. హరిశ్చంద్రుడు తనను తాను అమ్ముకున్నా అప్పు తీరనట్లే, నలభై ఏండ్లుగా ఎదురుచూస్తున్నా అసలైన సినీ కార్మికులకు ఇండ్లు అందింది లేదు. వారికి నీడకల్పించింది లేదు. పేరుకు మాత్రం చిత్రపురి. అందులో ఇండ్లు ఎవరికున్నాయి? ఎంత మంది ఇతరులకున్నాయి? ఎంత మంది చేత లక్షలకు లక్షలు కిస్తిలు కట్టించుకొని ఏగవేశారు? ఒక్కొక్క ప్లాటు ఎంత మందికి అమ్ముకున్నారు? ఇలా లెక్కలు తీస్తే చిత్రగుప్తుడి మాయకన్నా పెద్ద మాయా ప్రపంచమే చిత్రపురిలో కనిపిస్తుంది. ఈ విషయంపై గత కొంత కాలంగా నేటిధాత్రి వరుస కధనాలు రాస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ కార్మికలోకంలో కదలిక వచ్చింది. గతంలో గొంత సవరించలేని వాళ్లుంతా ఇప్పుడు మాట్లాడుతున్నారు. కొట్లాడి కొట్లాడి అలసిపోయిన వారిలో కూడా నేటిధాత్రి చెబుతున్న నిజాలతో మళ్లీ వారికి ఆశలు చిగిరిస్తున్నాయి. అయితే ఇది కూడా కొంత మంది పెద్దలు తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలిసింది.
కార్మికుల కోసం నేటిధాత్రి ప్రయత్నం చేస్తుంటే, కార్మిక లోకం కదులుతుంటే కొత్త నిర్మాణాల కోసం నిధుల సేకరణకు మార్గం ఏర్పడుతుందని చిత్రపురి గద్దలు చంకలు గుద్దుకుంటున్నారట.
అందుకే కార్మికులు మళ్లీ తొందరపడి మోసపోవద్దు. ఎవరినీ నమ్మొద్దు. పెద్దలున్నదే మిమ్మల్ని నమ్మించి, నయ వంచన చేసేందుకు..అది మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. నక్షత్రులకు కన్నా, ఘోరంగా తయారయ్యారు సొసైటీ కమిటీ పెద్దలు. చిత్ర పురిలో పెద్దలుగా చెలామణి అవుతున్నవారు మళ్లీ తమ పబ్బం గడుపుకునే కొత్త వేషం కడుతున్నారు. అందమైన బ్రోచర్లు సృష్టించి, భూతల స్వర్గంగా చిత్రపురిని మార్చుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అదింతా మోసం. .అంతా అబద్దం. నిజానికి ప్రస్తుతం చిత్రపురి సొసైటీ చెబుతున్న వాటిలో ఒక్కటి కూడా నిజం కాదు. అందులో ఏ మాత్రం వాస్తవం లేదు. మళ్లీ మీ కళ్లకు గంతలు కట్టాలని చూస్తున్నారు. మీ ఆశలను సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. ముందు సినీ కార్మికులంతా సంఘటితం కండి? అసలు వాస్తవాలు తెలుసుకోండి. అసలు చిత్రపురి కోసం ప్రభుత్వం ఇచ్చిన స్ధలమెంత? ప్రభుత్వానికి నటుడు ప్రభాకర్‌రెడ్డి ఇచ్చింది ఎంత? ఆ స్ధలాలు ఏమయ్యాయి? ఇప్పుడు చెరువు బఫర్‌ జోన్‌ మాత్రమే ఎందుకు మిగిలింది? ఇలాంటి విషయలపై కార్మికులకు పూర్తి అవగాహన ఎంతైనా అవసరం. ఇలాంటి విషయాలు ఏమీ చెప్పకుండా గత నలభై ఏళ్లుగా కార్మికులను మోసం చేస్తున్నారు. ఒకప్పుడు కార్మికులను నమ్మించేందుకు, ఆ భూముల్లో వ్యాపారం చేసుకునేందుకు, వారు రాజకీయంగా ఎదిగేందుకు చిరంజీవి చేత కొందరికి పట్టాలు ఇప్పించినట్లు నటించారు. దాంతో ఎంతో మంది మోసపోయారు. చిరంజీవి చేతుల మీదుగా అందుకునే అవకాశం కొంతమందికే దక్కింది. అది కూడా చిత్రపురి పెద్దల ఆశీస్సులున్నవారికి ఇవ్వడం జరిగింది. వాటిని చూసి మోస పోకండి. చిత్రపురిలో పెద్ద మాయా ప్రపంచమే వుంది. అది తెలుసుకోలేక, సమయం లేక, సినీ కష్టాలు పడుతూ, దాచుకున్న సొమ్మును దోచుకునేందుకు చిత్ర పురి పెద్దలు కాచుకొని వున్నారు. మీ కష్టం కాజేయాలని చూస్తున్నారు.
ప్రస్తుతం చిత్రపురి సొసైటీ అధ్యక్షుడుగా వున్న వ్యక్తి నిమయాలను ఉల్లంఘించి అధ్యక్షుడయ్యాన్నది అందరూ చెబుతున్న మాటే.
అయినా ఎందుకు కార్మికులు స్పందించడం లేదు. ప్రశ్నించిన వారిని కొంత మందిని సొసైటీ కార్యాలయంలోకి పిలిపించుకొని కూడా కొట్టారని అందుకే కార్మికులు , సొసైటీ పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు జంకుతున్నారన్న ప్రచారం కూడా వుంది. సాక్ష్యాత్తు ఓ మహిళను కూడా సొసైటీ పెద్దలు కొట్టి, చిక్కుల్లో పడ్డారు. ఆమె వారిపై న్యాయపోరాటం చేస్తోంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇలాంటి వాటిని బైటకు రానివ్వరు. అంతే కాకుండా ఆ మధ్య చాలా ప్లాట్‌లను ముగ్గురు, నలుగురికి రిజిస్ట్రేషన్‌ చేసినట్లు కూడా వార్తలున్నాయి. తాము పూర్తి సొమ్ము చెల్లించినా, ఒకటో, రెండో కిస్తీల చెల్లింపుల్లో జాప్యం చేశామని చెప్పి, ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ ఇతరులకు చేయించిన సంఘటనలు కూడా వున్నాయి. వాటిపై ఇప్పటీకీ న్యాయపోరాటం చేస్తున్నవారున్నారు. ఇవన్నీ కార్మిక లోకాని తెలియాల్సిన అవసరం వుంది. లేకుంటే వాళ్లు కూడా మోసపోయే అవకాశం వుంది. సొసైటీ కార్యాలయానికి పిలిపించుకొని, కొట్టిన అమ్మాయి చేస్తున్న న్యాయ పోరాటం ఆపాలని, ఇప్పుడు ఆమెను ప్రాదేయపడుతున్నారు. ఇలా అనేక సంఘటనలున్నాయి. దాదాపు పదుల సంఖ్యలో ప్లాట్స్‌ ఒకరికే కాకుండా ఇద్దరు ముగ్గురికి కూడా రిజిస్ట్రేషన్‌ చేసిన సంఘటలను వెలుగు చూశాయి. ఇప్పుడు మీ పరిస్ధితి కూడా అదే అవుతుంది. తస్మాత్‌ జాగ్రత్త. ముందుగా అందమైన మాటలు చెబుతారు. నమ్మిస్తారు. ముందు 30 శాతం అడ్వాన్సు తీసుకుంటారు. నెల నెల కట్టే వాయిదాలలో ఏ మాత్రం తేడా వచ్చినా మిమ్మల్ని పక్కన పెడతారు. అయాకులుగా మీ చేత వాయిదాలు చెల్లించుకుంటారు. ఆఖరుకు ఏదో వాయిదా ఆలస్యమైందని చెప్పి మీకు ప్లాట్‌ లేదంటారు. గతంలో ఇలాంటివి అనేకం జరిగాయి. ఈ విషయం కార్మికులు తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం. ఈ విషయాన్ని మేం ముందే చెప్పామని, బైలాలో పొందు పర్చామని అప్పుడు నిబంధల గురించి చెప్పి , మిమ్మల్ని మోసం చేస్తారు. చిన్న చిన్న అక్షరాలతో పేజీలకు పేజీలు రాసి వుండే నిబంధనలు ఎవరూ చదువుకోరు. చాలా మందికి ఇంగ్లీషు కూడా రాదు. దాంతో చిత్రపురి సొసైటీ పెద్దలు చెప్పే తియ్యటి మాటలు నమ్మి పెట్టుబడి పెడతారు.
సంపాదనంతా వారి చేతుల్లో పెట్టేస్తారు. ఆఖరుకు మీకు ప్లాట్‌ రాదు.
పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాదు. తిరుపతి హుండీలో వేస్తే పుణ్యమైనా వస్తుంది. చిత్రపురి సొసైటీకి చేరిన పైస తిరిగి అసలే రాదు. దాని కోసమ మళ్లీ కోర్టు ఖర్చులు అదనం. అయినా మీ కేసు తేలేదెప్పుడో… కేసు గెలిచేదెప్పుడో… కేసు గెలిచినా మీకు సొమ్ము వస్తుందన్న నమ్మకం అప్పుడు కూడా వుండదు. సినీ కార్మికులు సొసైటీ పెద్దలు చెప్పే మాటలు నమ్మకండి. అంతే కాదు, మీరు కొనుగోలుకు రావడం లేదని, ఆ ప్లాట్స్‌ను ఇతరులకు అమ్ముకునే ప్రయత్నం కూడా చేస్తారు. అందుకే ఆ స్ధలాలు కూడా కాపాడుకునే బాధ్యత మీదే…ఎందుకంటే ఆ స్ధలాలు కొనుగోలు చేసింది కార్మికుల సొమ్ముతోనే…నిజానికి 2015 నాటికే కార్మికులు ఎవరు? ఎంత మంది అన్నది ఖరారు చేశారు. ఆ తర్వాత సభ్యత్వాలు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నారు. దానిని సొసైటీ పెద్దలు ఎప్పుడో అతిక్రమించారు. 1994 నుంచి జీడి పాకంలా సాగుతున్న నిర్మాణాలలో మొత్తం 4213 ప్లాట్లకు డిజైన్‌ చేశారు. 2010 నుంచి 2015 వరకు దశలవారిగా ప్లాట్లను అందిస్తూ వచ్చారు. ఇంత వరకు పూర్తయిన కేవలం 2632. ఇంకా పూర్తి దశలో వున్నవి 1581. అవి కూడా పూర్తిదశలో వున్నాయి. అవి కూడ ఎప్పుడో మంగళం పాడేశారు. అనుయాయులకు చాలా వరకు అందించారు. గతంలో వున్న సొసైటీ కమిటీ చైర్మన్‌ సినీ కార్మికులకు కొంత వరకు మేలు చేశాడన్న పేరుంది..కాని ఇప్పుడున్న సొసైటీ చైర్మన్‌ కార్మికులను దోచుకుంటున్నాడన్న ఆరోపణలు అనేకం వున్నాయి. ప్రస్తుతం మళ్లీ కొత్త దుకాణం తెరిచాడు. ట్విన్‌ టవర్లు నిర్మాణం చేస్తున్నట్లు కార్మికులను మరోసారి మోసం చేసేందుకు చూస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. నిజానికి ఆ స్ధలాలో ఎలాంటి అనుమతులు లేవు. వాటిపై గత ఎపిసోడ్‌లో నేటిధాత్రి పూర్తి స్ధాయి విశ్లేషణ అందించింది. కార్మికుల పక్షాన నేటి ధాత్రి అక్షర పోరాటం చేస్తోంది. మీరు మోస పోవొద్దని మరీ మరీ చెబుతోంది. కార్మికులంతా కలిసి కొత్త సొసైటీ కమిటీ ఎన్నుకుంటే తప్ప చిత్ర పురికి పట్టిన శని పోదని అందరూ అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *