సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వివేకవర్ధిని హై స్కూల్లో శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ యాకాంతం గౌడ్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలని పేర్కొన్నారు. మహిళలకు విద్య లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యం కాదన్న ఆలోచనతో ఆమె చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.
మహిళలు విద్య, ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ముందుకు సాగాలని, ప్రతి విద్యార్థిని సావిత్రిబాయి పూలే ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని సావిత్రిబాయి పూలే సేవలను స్మరించుకున్నారు.
