nagaramlo ci posting yama costly guru…, నగరంలో సీఐ పోస్టింగ్‌ యమ కాస్ట్లీ గురూ…!

నగరంలో సీఐ పోస్టింగ్‌ యమ కాస్ట్లీ గురూ…!

గ్రేటర్‌ వరంగల్‌ నగర పరిధిలో ఉన్న పలు పోలీస్‌స్టేషన్ల సీఐ పోస్టింగ్‌లు యమ హాట్‌గా తయారయ్యాయి. హాట్‌ మాత్రమే కాదు అంతకుమించి యమ కాస్ట్లీగా కూడా మారాయని గుసగుసలు వినబడుతున్నాయి. గ్రేటర్‌ పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో అక్కడి సీఐలు బదిలీ అయితే చాలు ఆ ఖాళీ స్థానంలో దూరిపోవడానికి కొంతమంది పోలీసు అధికారులు తమ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడరట. ఎవరితో చెపితే పోస్టు దక్కుతుంది. ఎంత సమర్పిస్తే ఆ స్థానంలోకి పోస్టింగ్‌ చేస్తారు. అక్కడికివెళ్తే వచ్చేదెంతా…?, పోయేదెంతా…? పలు రకాల లెక్కలు వేసుకుని మరి కొంతమంది పోలీసు అధికారులు పైరవీ పనులు మొదలుపెడుతున్నారట. పోస్టు ఎక్కడైనా ఖాళీ అయ్యే వరకు ఓపిక పడుతున్న వీరు పోస్టు ఖాళీ కాగానే తమ పైరవీ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారట.

కేయూ పోస్టింగ్‌ కోసం భారీ పోటీ…

భూతగాదాల నేపథ్యంలో ఇటీవల కాకతీయ యూనివర్సిటీకి చెందిన సీఐ రాఘవేందర్‌రావు సస్పెండ్‌ కావడంతో ఇక్కడి స్థానం ఖాళీ ఏర్పడింది. అయితే ఈ పోస్టింగ్‌ కోసం కొంతమంది సీఐలు ఊవ్విళ్లూరుతున్నట్లు తెలిసింది. గ్రేటర్‌ పరిధిలో అత్యంత ఆదాయం ఉన్న పోలీస్‌స్టేషన్‌గా కొంతమంది అధికారులు భావిస్తుండగా ఇక్కడ సీఐగా పనిచేసేందుకు మెజార్టీ స్థాయిలోనే అధికారులు పోటీ పడుతున్నారట. ఇక్కడ పోస్టింగ్‌ దొరికితే తమ పంట పండినట్లేనని భావించే కొంతమంది సీఐలు తమ శాయశక్తుల పోస్టింగ్‌ కోసం శ్రమిస్తున్నారట.

14లక్షలు…ఎమ్మెల్యే లెటర్‌…?

కేయూ పోలీస్‌స్టేషన్‌లో సీఐ పోస్టింగ్‌ కోసం కొంతమంది పైరవీలతో ప్రయత్నిస్తుండగా ఇక్కడ పోస్టింగ్‌ కావాలంటే 14లక్షలు సమర్పించాలని ఓ ప్రచారం జరుగుతోంది. పోస్టింగ్‌ అంతా ప్రజాప్రతినిధి కనుసన్నల్లో జరుగుతుందని తెలుస్తోంది. కేయూ పోలీస్‌స్టేషన్‌లో సీఐ స్థానం ఖాళీకాగానే అడుగు ముందుకేసిన ఓ సీఐ స్థానిక ఎమ్మెల్యే లెటర్‌తో పోలీస్‌ కమీషనర్‌ను కలిసినట్లు సమాచారం. అయితే పోస్టింగ్‌ కోసం ఎమ్మెల్యే పైరవీ లెటర్‌ ఏంటని…పోలీస్‌ కమీషనర్‌ ఆ సీఐని మందలించినట్లు తెలిసింది. ఇలాంటి విషయాల్లో సీపీ సీరియస్‌గానే ఉన్న గ్రేటర్‌ పరిధిలో మాత్రం రాజకీయ జోక్యంతోనే అధికారులను నియమిస్తున్నారని, లక్షల్లో పైసలు సమర్పిస్తేనే పోస్టింగ్‌ దక్కుతుందని కొంతమంది అధికారులు అంటున్నారు. పైసలు సమర్పించని వారిని, రికమండేషన్‌ లెటర్‌ లేని వారిని ఆ ప్రధాన పోస్టుల్లోనే ఉంచుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బదిలీలు, నియమాకాల విషయంలో మార్గదర్శకాలను పాటించి అధికారులను నియమిస్తే బాగుంటుందని అలా కాకుండా పైరవీలు, పైసలకే పెద్ద పీట వేస్తే అవి చేయని అధికారుల పరిస్థితేంటని వారు ప్రశ్నిస్తున్నారు. పోలీసు ఉద్యోగం చేయాలన్న, పోస్టింగ్‌ కావాలన్న రాజకీయ అంట కాగాల్సిన పరిస్థితిని కల్పించడం దారుణమంటున్నారు.

పోస్టింగ్‌ కొని ఏం చేస్తారు

గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని కొన్ని పోలీస్‌స్టేషన్లలో కొంతమంది అధికారులు పైరవీలు, పైసలతో పోస్టింగ్‌ చేయించుకుంటున్న పోస్టింగ్‌ తరువాత వీరు చేసేది ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. లక్షలు పోసి పోస్టింగ్‌ వేయించుకుని ఆ తరువాత అవి సంపాదించడానికి వక్రమార్గాలు అవలంభిస్తారు కదా…? అంటున్నారు. పెట్టిన సొమ్ము రాబట్టుకోవడం కోసం వీరు ప్రజల నెత్తిన గుదిబండలా తయారవుతారని, అందుకే సివిల్‌ కేసులు మొదలుకుని, ప్రతి కేసుల్లో వీరు జోక్యం చేసుకుని డబ్బులతో సెటిల్‌మెంట్లు చేయడానికి సైతం వెనకాడడం లేదని అంటున్నారు. రాజకీయ జోక్యంతో, వారి రికమండేషన్‌ లెటర్‌లతో పోస్టింగ్‌ దక్కించుకునే అధికారులు ఎవరికి అనుకూలంగా ప్రవర్తిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ జోక్యంతో అధికారులుగా చెలామణి అవుతున్న వారు కొన్ని సందర్భాల్లో పైఅధికారుల మాట సైతం వినడం లేదని తమకు రాజకీయ అండ ఉందనే ధీమాతో తమ ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మొత్తానికి గ్రేటర్‌ పరిధిలోని సీఐ పోస్టింగ్‌ కోసం పోలీస్‌ అధికారులు లక్షలు పోయడానికి సిద్ధం కావడం పోలీసుల్లో చర్చ నియాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!