మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే.
వంటగదిలో ఆహార పదార్థాలను రుచి చూసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం భూపాలపల్లి మంజూరునగర్ లోని ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వంట గదిలో విద్యార్థులకు పెట్టే ఆహార పదార్థాలను మీడియా మిత్రులతో కలిసి టేస్ట్ చూశారు. అనంతరం ఎమ్మెల్యే అన్ని తరగతి గదులను కలియ తిరుగుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. తరగతి గదుల్లో కూర్చోడానికి బెంచీలు కావాలని పలువురు విద్యార్థులు అడిగారు. అదేవిధంగా, తరగతి గదులకు కిటికీలు లేకపోవడంతో వర్షం వచ్చినప్పుడు వర్షం నీరు తరగతి గదుల్లోకి వస్తుందని పలువురు విద్యార్థులు తెలిపారు. సీసీ రోడ్లు, బాత్రూమ్స్, డార్మెటరీ, డ్రైనేజీ, తరగతి గదిలోకి పాములు రావడం తదితర సమస్యలను విద్యార్థులు వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను అట్టి సమస్యలను త్వరితగతిగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంద న్నారు. అన్ని వసతి గృహాల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భోజనాన్ని అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే విద్యార్థులకు మెస్ చార్జీలతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను కూడా పెంచినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బిరు శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు దేవాన్ పిసిసి మెంబర్ చల్లూరు మధు ముంజాల రవీందర్ దాట్ల శ్రీనివాస్ భౌత్ విజయ్ ప్రజా ప్రతినిధులు, పట్టణ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు