సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. శుక్రవారం చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలోఉపాధి హామీ కూలీలతో కలిసి మాట్లాడుతూ, రైతుల కార్మికుల కూలీల పక్షాన పోరాడే సీపీ(ఐ)ఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మద్దతు ధర అందించలేకపోయారని, మరొకవైపు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించి రైతులను కూలీలుగా కార్మికులుగా మార్చారన్నారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కార్పొరేట్ వాళ్లకు అప్పజెప్పి కార్మికులకు వారి సమస్యలపై పోరాడే హక్కును తొలగించారని విమర్శించారు. మరొకవైపు వామపక్షాల పోరాట ఫలితంగా 2006లో ఏర్పడిన ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిస్థాయిలో తొలగించి వ్యవసాయ కూలీలకు పని దొరక్కుండా చేసే ప్రయత్నం బీజేపీ పాలనలో జరుగుతుందని అందుకే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్నారు. నిరంతరం కార్మికులు రైతులు కూలీల పక్షాన పోరాడుతూ పదవులతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల్లో ఉండే సీపీ(ఐ)ఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ ను గెలిపించడం ద్వారా పార్లమెంట్ వేదికగా కార్మికులు, రైతులు కూలీల పక్షాన పోరాటం నిర్వహిస్తాడని తెలిపారు. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఎంపీలుగా గెలిచిన ప్రజాప్రతినిధులు ఏమాత్రం ప్రజలకు అందుబాటులో లేరని వారి వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని, ప్రజలకు అందుబాటులో ఉండే సీపీ(ఐ)ఎం అభ్యర్థిని ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈరటి వెంకన్న,స్వామి, కొత్తపల్లి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.