మేమేం పాపం చేశాం.. మాకు ఇంత తక్కువ ధరెందుకు.
జహీరాబాద్. నేటి ధాత్రి:
మేమేం పాపం చేశామ్..మా చుట్టుపక్కల నిమ్జ్ ప్రాజెక్టులో ఎకరా భూమి ధర రూ.40 నుంచి రూ.60 లక్షల ఉంది. నిమ్జ్ ప్రాజెక్టుకు భూములిస్తే తమకు వచ్చే ప్రయోజనం ఏమిటని రైతులు మూకుమ్మడిగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆవేదనను వ్యక్తం చేశారు. నిమ్జ్ భూసేకరణలో భాగంగా బుధవారం న్యాల్కల్ మండలంలోని మామడ్గిలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. 2013 చట్టం గురించి రైతులకు వివరించారు. అనంతరం రైతులు తమ అభిప్రాయాలు చెప్పేందుకు అవకాశం ఇచ్చారు. గ్రామస్తులను ఒక్కొక్కరు వేదికపై పిలిచి వారితో మాట్లాడించారు. ఈ సందర్భంగా రైతు రాజిరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2013 చట్టాన్ని సెక్షన్ రెండు, మూడుని మీనాయించి రైతులకు అన్యాయం చేసిందన్నారు.
మా గ్రామానికి సంబంధించిన భూములు సారవంతమైన భూములని, సంవత్సరానికి మూడు పంటలు పండుతాయన్నారు. అయిన ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారానికి భూములు ఇవ్వమని స్పష్టం చేశారు. మరో రైతు కూరన్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామంలో అల్లం, పసుపు, ఆలుగడ్డ, అన్ని రకాల వాణిజ్య పంటలు పండే సారవంతమైన భూములన్నారు. పర్యావరణ శాఖ వారు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్లకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసిన సమగ్ర విచారణ నిర్వహించకుండా తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన చెందారు.ఇకనైనా మా విన్నపాన్ని మన్నించి సమస్య పరిష్కరించాలన్నారు. దాబేవాలె మహబూబ్ మాట్లాడుతూ… మీరిచ్చే ఒక ఎకరానికి నష్టపరిహారం రూ.15 లక్షలకు జహీరాబాద్ లో ఒక ప్లాటు రాదన్నారు. దీంతో తమ జీవనాధారం కోల్పోయి తమ కుటుంబాలు వీధిన పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు నాగప్ప మాట్లాడుతూ.. నాకు పది ఎకరాల పొలం నలుగురు కుమారులు పది ఎకరాలు తీసుకొని 8 ఎకరాలు ఇచ్చిన పర్వాలేదని విన్నవించారు. నా నలుగురు కుమారులకు 2013 చట్టం ప్రకారం ఉపాధి హామీ కల్పించిన పర్వాలేదన్నారు. ప్రభుత్వం స్పందిస్తే భూమి ఇవ్వటానికి ఆలోచిస్తామన్నారు. లేకుంటే మూడు పంటలు పండే భూమి ఇవ్వనని తేల్చి చెప్పారు. మరో రైతు చింతల్ జగన్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు 2013 చట్టం గురించి అవగాహన కల్పిస్తే తెలుస్తుందని, మార్కెట్ వ్యాలు ప్రకారం రూ.45 నుంచి 60 లక్షలు భూమి పలుకుతుందని రూ. 15 లక్షలు ఇస్తే ఒక ఫ్లాట్ కూడా రాదన్నారు. ప్రభుత్వానికి భూములిచ్చి తమ కుటుంబాలు అడుక్కుతినాలా అని ప్రశ్నించారు.
పట్టా భూమి, అసైన్మెంట్ భూముల రైతుల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో సమాధానం చెప్పలేని అధికారులు గ్రామ సభ వాయిదా వేశారు. అసైన్మెంట్ భూమికి సంబంధించిన ఓ భూ నిర్వాసితుడు మాట్లాడుతూ..” మీ భూములు మూడు పంటలు పండితే, మా భూములు నాలుగు పంటలు పండుతాయి” అంటూ సభలో వెటకారంగా భూసేకరణకు అనుకూలంగా మాట్లాడటంతో కొద్దిసేపు రైతుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రైతుల మధ్య సమన్వయం లోపించి ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకా అధికారులు గ్రామ సభ వాయిదా వేసి అక్కడి నుంచి జారుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ భూపాల్, నాయబ్ తహసిల్దార్ రాజిరెడ్డి, నిమ్జ్ ప్రాజెక్ట్ ఆర్ఐ సిద్ధారెడ్డి, డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, జహీరాబాద్ రూరల్ సీఐ.జక్కుల హనుమంతు, జహీరాబాద్ సీఐ శివలింగం, హద్నూర్ ఎస్ఐ. చల్ల రాజశేఖర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్న గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.