mayor pitampai jhansi, మేయర్‌ పీఠంపై ఝాన్సీ…?

మేయర్‌ పీఠంపై ఝాన్సీ…?

గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా కొనసాగి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్నపునేని నరేందర్‌ ఎన్నిక కావడంతో వరంగల్‌ మేయర్‌ స్థానం ఖాళీ అయింది. దీంతో నూతన మేయర్‌ను ఎన్నుకునేందుకుగాను ఈనెల 23న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 27న నూతన మేయర్‌ను ఎన్నుకోనున్నారు. మేయర్‌ పీఠం కోసం వరంగల్‌లో ప్రస్తుతం నాలుగుస్తంభాలాట కొనసాగుతోంది. ఈ పదవి కోసం 26వ డివిజన్‌ కార్పొరేటర్‌ గుండా ప్రకాష్‌, 27వ డివిజన్‌ కార్పొరేటర్‌ వద్దిరాజు గణేష్‌, 56వ డివిజన్‌ కార్పొరేటర్‌ నాగమల్ల ఝాన్సీలక్ష్మి, 28వ డివిజన్‌ కార్పొరేటర్‌ యెలగం లీలావతి పోటీపడుతున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్‌లో టిఆర్‌ఎస్‌కు పూర్తి మెజార్టీ ఉండగా ఎన్నిక లాంఛనమే కానుంది. అయితే మేయర్‌ పీఠాన్ని ఎవరూ దక్కించుకోనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మేయర్‌ పీఠం కోసం నలుగురు కార్పొరేటర్లు పోటీ పడుతున్నా మేయర్‌ పీఠం మాత్రం 56వ డివిజన్‌ కార్పొరేటర్‌ నాగమల్ల ఝాన్సీకి ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు అధిష్టానం సైతం సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఝాన్సీకే మద్దతు పలుకుతున్నట్లు తెలిసింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ సైతం ఝాన్సీకి మేయర్‌ పదవి పొందేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పోటీలో ఎంతమంది ఉన్నా చివరకు పదవి మాత్రం ఝాన్సీనే వరిస్తుందని గులాబీ వర్గాల్లో చర్చ జోరుగా కొనసాగుతోంది. అయితే ఈ పదవిని దక్కించుకునేందుకు మిగతా కార్పొరేటర్లు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఎవరెన్నీ ప్రయత్నాలు చేసినా మేయర్‌గా ఝాన్సీని టిఆర్‌ఎస్‌ అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *