కొమ్మాల జాతరలో ఏరులై పారుతున్న మద్యం.
పవిత్ర దేవాలయం వద్ద మద్యం అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అధికారుల అనుమతులు.?
అడుగడుగునా మద్యం బెల్టు దుకాణాలే జాతరలో దర్శనం.
దేవాలయం అధికారుల పర్మిషన్ లెటర్ ద్వారానే అనుమతులు ఇచ్చమంటూ వివరణ?
ఈ నెల 16 తో ముగిసిన మద్యం అమ్మకాల గడువు..
మద్యం బెల్టు షాపులకు అనుమతులు ఇవ్వలేదు..
దేవాలయ ఈ.ఓ నాగేశ్వర్ రావు..
బెల్టు షాపుల నిర్వహికులపై చర్యలు తీసుకుంటాం.
ఎక్సైజ్ శాఖ సీఐ తాతాజీ.
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

పవిత్రమైన దేవాలయం వద్ద మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.భక్తి శ్రద్ధలతో కొమ్మాల జాతరకు వెళ్లిన భక్తులకు ముందుగా మద్యం దుకాణాలు,బెల్టుషాపులే దర్శనం ఇస్తాయి.ఈ నేపథ్యంలో కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరలో ఎక్కడ చూసినా మద్యం ఏరులైపారే పరిస్థితి నెలకొన్నది.
వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల లక్ష్మినరసింహస్వామి జాతర గత ఐదు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నది.వివిధ రాజకీయ పార్టీలు,ఇతర ప్రభ బండ్లతో మొదలైన జాతర మంగళవారం ఐదవరోజు రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది.దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ ఆలయ ప్రాంగణంలో మద్యం దుకాణాలు,బెల్టు షాపుల జోరు కొనసాగుతూనే ఉన్నది.దైవ దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు కొందరు ఉద్యోగులు,రైతులు రాత్రివేళలో వస్తున్నారు.ఐతే జాతరలో ఎక్కడ చూసినా బెల్టు షాపులు,అక్కడే మద్యం సేవించి మత్తులో తిరగటం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు.ఐతే దేవాలయం వద్ద పోలీస్ కంట్రోల్ రూం వద్దనే బెల్టు షాపులు ఏర్పాట్లు చేసి విచ్చలవిడిగా అమ్మకాలు చేపట్టడం పలు అనుమానాలకు దారితీస్తున్నది.పవిత్రమైన దేవాలయం వద్ద జాతరలో ఫెస్టివల్ ఈవెంట్ అనుమతులు అంటూ ఎక్సైజ్ శాఖ అనుమతులు ఇవ్వడం ఒకెత్తు అయితే అక్కడ మద్యం దుకాణాలకు ఈవెంట్ కు దేవాలయం అధికారులు పర్మిషన్ లెటర్ ఇస్తారు.. వారు ఇస్తేనే మూడు రోజులకు పర్మిషన్ ఇచ్చాము అని గీసుకొండ పరిధిలో ఎక్సైజ్ శాఖ సీఐ తాతాజీ పేర్కొనడం కొసమెరుపు.
ఐనప్పటికీ తాత్కాలిక మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చిన గడువు ఈ నెల 16 తో ముగిసినప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం అని భక్తులు వాపోతున్నారు.ఇప్పటికైనా పవిత్రమైన దేవాలయం వద్ద మద్యం అమ్మకాలు ఆపివేసి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజలు,భక్తులు కోరుతున్నారు.
బెల్టు షాపుల నిర్వహికులపై చర్యలు తీసుకుంటాం.
ఎక్సైజ్ శాఖ సీఐ తాతాజీ.
పవిత్రమైన శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై చర్యలు తీసుకొని వాటిని నిలుపదల చేస్తామని గీసుకొండ మండల పరిధి ఎక్సైజ్ శాఖ సీఐ తాతాజీ నేటిధాత్రికి వివరణ ఇచ్చారు.
మద్యం బెల్టు షాపులకు అనుమతులు ఇవ్వలేదు..

దేవాలయ ఈ.ఓ నాగేశ్వర్ రావు..
కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని విధాల జాగ్రత్తగా తీసుకున్నామని దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు తెలిపారు. దేవాలయము పరిసర ప్రాంతాలకు 200 మీటర్ల లోపు మద్యం బెల్టు షాపులకు ఎలాంటి అనుమతులు లేవని ఈ.ఓ తెలిపారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆటంకం కల్పిస్తున్న బెల్టు షాపులపై చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని కొమ్మాల దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు తెలిపారు.