Petrol Bunk Service Issues in Parakala
పెట్రోల్ బంకుల్లో సేవల లోపం
అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేల చూసుకోవాలని వాహనదారుల డిమాండ్
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని పలువురు పెట్రోల్ బంకుల్లో వాహనదారులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు సక్రమంగా అందుబాటులో లేకపోవడం గమనార్హం.ముఖ్యంగా టైర్లలో గాలి నింపేందుకు ఏర్పాటు చేసిన ఎయిర్ కంప్రెసర్లు పనిచేయకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కొన్ని బంకుల్లో ఎయిర్ కంప్రెసర్లు పాడైపోయి ఉండగా,మరికొన్ని చోట్ల నిర్వహణ లోపంతో పనిచేయడం లేదు.దీంతో వాహనదారులు ఇతర ప్రాంతాలకు వెళ్లి గాలి నింపించుకోవాల్సి వస్తోంది.అత్యవసర పరిస్థితుల్లో ఈ లోపం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.కొన్ని బంకుల్లో పనిచేసే సిబ్బంది వాహనదారుల ప్రశ్నలకు నిర్లక్ష్యపు సమాధానాలు ఇవ్వడం,సరైన సహకారం అందించకపోవడం వంటి అంశాలు వినియోగదారులను అసంతృప్తికి గురిచేస్తున్నాయి.ఈ నేపథ్యంలో పెట్రోల్ బంక్ యాజమాన్యాలు సిబ్బందికి సరైన మార్గదర్శకాలు ఇవ్వడంతో పాటు వినియోగదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.పెట్రోల్ బంక్ యాజమాన్యాలు వెంటనే స్పందించి,ఎయిర్ కంప్రెసర్లతో పాటు ఇతర అవసరమైన సేవలను కూడా సక్రమంగా అందుబాటులో ఉంచాలని వాహనదారులు కోరుతున్నారు.అన్ని బంకుల్లో అవసరమైన సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
