ఖమ్మం కాంగ్రెస్‌ కింగ్‌ ప్రసాద్‌ రెడ్డి!

https://epaper.netidhatri.com/

`ఖమ్మం కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల గెలుపులో కీలకపాత్ర.

`అన్న పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి శపథం నెరవేర్చిన నాయకుడు.

`గతంలో జరిగిన ఖమ్మం సభ సక్సెస్‌ వెనుక ప్రసాద్‌ రెడ్డి పాత్ర అమోఘం.

`ఖమ్మంలో కాంగ్రెస్‌ తిరుగులేని శక్తిగా మారడానికి ప్రసాద్‌ రెడ్డి కృషి అమూల్యం.

`తెలంగాణలో పార్లమెంటు సీట్ల గెలుపు బాధ్యత శ్రీనివాస్‌ రెడ్డి దే.

`ఖమ్మం పార్లమెంటు సీటు ప్రసాద్‌ రెడ్డికే.

`కాంగ్రెస్‌ అధిష్టానం వద్ద పెరిగిన పొంగులేటికి ప్రాధాన్యత.

`ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపుకోసం బాధ్యత శ్రీనివాస్‌ రెడ్డికి అప్పగింత.

`శ్రీనివాస్‌ రెడ్డి రంగంలోకి దిగితే వార్‌ వన్‌ సైడే.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాజకీయాలలో కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా జరుగుతుంటాయి. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి ఒక పేరుంది. ఆ కుటుంబం అంటే జిల్లాలో రాజకీయంగా బలమైన స్ధానం వుంది. ఓ వైపు వ్యాపారం సామ్రాజ్యం, మరో వైపు రాజకీయం ఏక కాలంలో రెండిరటిలో విజయాలు సాధించడం అంటే మాటలు కాదు. వ్యాపారంలో సునిశిత దృష్టి అవసరం. రాజకీయాల్లో ప్రజా సేవ ఎంతో ముఖ్యం. ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ములో ప్రజల కోసం ఖర్చు చేయడం అంటే మానవత్వం వుంటే తప్ప సేవ చేయలేరు. వ్యాపార పరంగా ఎదిగిన పొంగులేటి కుటుంబం తన తోటి సమాజానికి ఎంతో కొంత చేయాలని సంకల్పించిన నాటి నుంచి, ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నారు. 2014 వరకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం వరకు మాత్రమే తెలుసు. కాని 2014 ఎన్నికల్లో ఖమ్మం నుంచి వైసిపి పార్టీ నుంచి ఎంపిగా గెలవడంతో తెలంగాణ మొత్తం ఆయన వైపు చూసింది. వైసిపికి తెలంగాణ అధ్యక్షుడిగా బలమైన నాయకుడయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో సమైక్య వాద నినాదం ఎంచుకున్న వైసిపి నుంచి తెలంగాణలో గెలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడుగా అవతరించారు. అప్పటినుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మొత్తం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే పొంగులేటి బలాన్ని బిఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసిఆర్‌ అంచనా వేయడంలో బొక్కబోర్లా పడ్డారు.
రాజకీయ దురంధురుడు, అపర చాణక్యుడు అని పేరున్న కేసిఆర్‌ కూడా శ్రీనివాస్‌ రెడ్డి విషయంలో చేసిన అలక్ష్యం ఏకంగా బిఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయేలా చేసిందని చెప్పడంలో సందేహం లేదు.
ఖమ్మం జిల్లాలో శ్రీనివాస్‌రెడ్డి లాంటి బలమైన నాయకుడిని కాపాడుకోలేకపోవడం కేసిఆర్‌ చేసుకున్న స్వయంకృతాపరాధం. ఏ శ్రీనివాస్‌రెడ్డి రాజీకయం చిదిమేయాలని చూశారో..అదే శ్రీనివాస్‌రెడ్డి తొడగొట్టి సవాలు చేసి, తన సత్తా ఏమిటో చూపించారు. కారుకు ఖమ్మంలో చోటు లేకుండా చేశారు. బిఆర్‌ఎస్‌ను అసెంబ్లీ గేటుకూడా తాకనివ్వనని శపథంచేసి మరీ నిరూపించాడు. కారును ఖమ్మంలో కోలుకోకుండా చేశాడు. అలా ఖమ్మంలో కాంగ్రెస్‌ విజయఢంకా మోగించడంలో తెరముందు శ్రీనివాస్‌రెడ్డి చేసిన రాజకీయంతోపాటు, తెర వెనకు ప్రసాద్‌రెడ్డి కష్టం కూడా అంతే వుంది. అందుకే ఈసారి కాంగ్రెస్‌ టికెట్‌ ప్రసాద్‌రెడ్డికే ఇవ్వాలని కాంగ్రెస్‌ శ్రేణులు కోరుతున్నాయి. ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఖమ్మం కాంగ్రెస్‌ కింగ్‌ ప్రసాద్‌రెడ్డి అన్న మాటే ఎక్కవ విన్నా వినిపిస్తోంది. ఎందుకంటే ప్రసాద్‌ రెడ్డి ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపులో కీలపాత్ర పోషించారు.

అన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శపథం నెరవేర్చి తానేమీ రాజకీయ చాణక్యంతో తానేమీ తక్కువ కాదని ప్రసాద్‌రెడ్డి నిరూపించారు.
పొంగులేటి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా జరిగిన కాంగ్రెస్‌ సభను నభూతో నభిష్యతి అన్నట్లు నిర్వహించడంతో ప్రసాధ్‌ రెడ్డి పోషించిన పాత్ర ఎంతో గొప్పది. ఖమ్మంలో కాంగ్రెస్‌ తిరుగులేని శక్తిగా మారడానికి కారణం శ్రీనివాస్‌రెడ్డి అయినా చక్రం తిప్పిందంతా ప్రసాద్‌రెడ్డే అన్నది అందరికీ తెలిసిన విషయమే. అంతే కాదు రానున్న పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్‌కు ఎంతో ముఖ్యం. రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు సవాలుగా మారనున్నాయి. కేంద్రంలో పదేళ్లపాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు జీవర్మరణ సమస్య అని చెప్పకతప్పదు. ఇప్పుడున్న పరిస్దితుల్లో కాంగ్రెస్‌ తెలంగాలో మెజార్టీ సీట్లు సాధించాల్సిన అవసరం వుంది. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హమీలు పూర్తి స్ధాయిలో అమలు జరగాలంటే , కేంద్రంలో కాంగ్రెస్‌ వస్తే తెలంగాణ ప్రగతి పట్టాలెక్కుతుంది. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పధకాలు అమలౌతాయి. తెలంగాణ అన్ని రంగాల్లో మళ్లీ దూసుకుపోతోంది.
మరో పదేళ్లుపాటు తెలంగాణలో కాంగ్రెస్‌ తిరుగులేని శక్తిగా మారుతుంది.
ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌పార్టీ ఆచి తూచి అడుగులేయాల్సిన అవసరం వుంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాల్సిన అవసరం వుంది. ఎలాంటి శషబిషలకు పోయినా సీట్లు గల్లంతౌతాయి. అందువల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోను తన స్ధానానాన్ని కాంగ్రెస్‌ పదిలం చేసుకోవాలంటే పొంగులేటి ప్రసాద్‌రెడ్డికి టికెట్‌ ఇస్తేనే అది సాధ్యమౌతుందని కాంగ్రెస్‌ శ్రేణులు అంటున్నాయి. తెలంగాణలో మెజార్టీ పార్లమెంటు సీట్లు గెలిపించేబాధ్యత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిదే. అందుకే ఖమ్మం పార్లమెంటు సీటు ప్రసాద్‌రెడ్డికే అన్నది స్పష్టమౌతోంది. కాంగ్రెస్‌ అధిష్టానం వద్ద పొంగులేటికి ప్రాదాన్యత మరింత పెరిగింది. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు బాధ్యత పొంగులేటిపై కూడా అధిష్టానం పెట్టింది. ఎందుకంటే శ్రీనివాస్‌రెడ్డి రంగంలోకి దిగితే వార్‌ వన్‌ సైడే అవుతుందన్నది అందరికీ తెలిసిందే. గత అనుభవం చెబుతున్నదదే.
అయితే ఖమ్మం జిల్లా రాజకీయాలలో ఇటీవల వరుసగా జరుగుతున్న కొన్ని సంగటనలు కూడా పొంగులేటికి అనుకూలంగానే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు.

గతంలో ఖమ్మం నుంచి సోనియాగాంధీ పోటీ చేస్తే బాగుంటుందని అనుకున్నారు. తర్వాత ప్రియాంకగాంధీనైనా పోటీ చేయించేందుకు ఒత్తిడి తేవాలని అనుకున్నారు. కాని సోనియాగాంధీ ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. సోనియాగాంధీ ఇప్పటి వరకు రాజ్యసభకు ఎన్నిక కాలేదు. ఇందిరాగాంధీ తర్వాత ఆ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికైనది సోనియాగాంధీయే. అంటే ఆమె వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోఎక్కడినుంచి పోటీ చేసే అవకాశం లేదు. తాను పోటీచేసే నియోజకవర్గానికి పరిమితమైతే దేశమంతా ప్రచారం చేయడం కష్టమౌతుంది. అందుకే ఈసారి పూర్తి స్ధాయిలో ప్రచారంపై దృష్టిపెట్టాలన్న ఆలోచనతో రాజస్ధాన్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక ఖమ్మం సీటు నాదే అంటూ చాలా కాలంగా చెబుతూ, అనేక త్యాగాలు చేస్తూ వచ్చిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని రాజ్యసభకు పంపించారు. దాంతో ఖమ్మంలో శ్రీనివాస్‌రెడ్డికి ఎదరులేకుండాపోయింది. అయితే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా పోటీ చేస్తానంటూ చెప్పడం జరిగింది. ఇది కాంగ్రెస్‌లో తుఫాను రేపుతుందని అనుకున్నారు. కాని ఆ సమస్య కూడా టీ కఫ్పులో తుఫాను లాంటిదే అని కాంగ్రెస్‌ శ్రేణులంటున్నాయి. పార్టీ అధిష్టానం ఖమ్మం సీటు విషయంలో శ్రీనివాస్‌రెడ్డికి మాట ఇచ్చినట్లు కూడా సమాచారం. అందుకే ఇటీవల కొంత కాలంగా ప్రసాద్‌రెడ్డి క్షేత్రస్దాయిలో అనేక పర్యటనలు చేస్తున్నారు. ప్రజలు చేరువౌతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రచారం మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే తిరుగులేని శకాన్ని నిర్మించిన శ్రీనివాస్‌రెడ్డి తన తమ్ముడిని గెలిపించుకోడం నల్లేరు మీద నడకే అంటున్నారు.
ఖమ్మం పార్లమెంటు సీటు ఈసారి పొంగులేటి ప్రసాద్‌రెడ్డిదే అంటున్నారు.
పొంగులేటి ప్రసాద్‌రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు. ఇంత కాలం ఆయన రాజకీయంగా ముందు వరసులోకి రాలేదు. అన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కోసం క్షేత్ర స్ధాయి రాజకీయమంతా చూస్తున్నది ప్రసాద్‌రెడ్డే. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాపారంలో ఒక భాగమైన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ వ్యవహార బాద్యతలన్నీ చూసుకునేది ప్రసాద్‌రెడ్డే. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిది ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబానికి సుమారు 9 రకాల వ్యాపార సంస్థలున్నాయి. వాటన్నింటికీ ప్రసాద్‌రెడ్డి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. నిజానికి ప్రసాద్‌రెడ్డి వ్యాపారాలు చూసుకోవడం, మంత్రి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయాలు చూసుకునేవారు. ఎప్పుడైతే పొంగులేటి ఎంపిగా ఎన్నికయ్యారో అప్పటినుంచి ప్రసాద్‌రెడ్డి అటు వ్యాపారం, ఇటు అన్న రాజకీయాన్ని కూడా చూసుకుంటూ వస్తున్నారు. క్షేత్రస్ధాయిలో ఎవరికి ఏ అవసరం వచ్చినా చూసుకునేది మొత్తం ప్రసాద్‌రెడ్డే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *