‘కబ్జా’ కథలు ఎందుకోసం…?
భూమితో మనిషిది విడదీయరాని సంబంధం. భూమి లేనిది మనిషి జీవించడం అసంభవం. నాలుగుముద్దలు నోట్లోకి వెళ్లాలన్న నాలుగు పైసలు సంపాదించాలన్న భూమి అనేది ముఖ్యపాత్రను పోషిస్తుంది. ఈ ప్రపంచానంతటిని తిండిగింజలు అందిస్తూ పోషిస్తున్నది భూమి. భూమి, భుక్తి, విముక్తి అంటూ, దున్నేవాడిదే భూమి అంటూ అనేక ఉద్యమాలు సైతం కొనసాగాయి. ఈ ఉద్యమాలకు భూమే ప్రధాన భూమికగా మారింది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అలాంటి భూమి ఈ రోజుల్లో వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకోవడం కోసం కొంతమంది కబ్జాదారులు అమాయకులు, బలహీనుల భూములను బలవంతంగా అక్రమిస్తున్నారు. జీవనాధారం అనుకున్న భూమి నిలువ నీడ కోసం ఇంత గూడు వేసుకోవడానికి ఉపయోగపడే భూమి కొంతమంది బలవంతుల కబంధహస్తలలో చిక్కుకొనడంలో ‘ఏ ఆసరా లేని అమాయకులు భూముల అసలు హక్కుదారులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి సహయం చేసి వారు ఎదుర్కొంటున్న కష్టాలను, కబ్జారూపంలో వారికి జరుగుతున్న అన్యాయాన్ని అధికారులకు, సర్కార్ దృష్టికి తేవడానికి ‘నేటిధాత్రి’ దినపత్రిక ‘కబ్జా’కథలు శీర్షికను కొనసాగిస్తుంది. కబ్జా అయిన భూముల వివరాలు, కబ్జారాయుళ్ల ఆగడాలతో నిత్యం వేధింపులకు గురిఅవుతున్నావారి వేదనను బహిర్గతం చేసేందుకు మేము సర్వదా సిద్ధంగా ఉన్నాం. దేశంలోని భూసమస్యలు పరిష్కారం అయితే మెజార్టీశాతం ప్రజలు హాయిగా జీవిస్తారనే సత్యాన్ని ‘నేటిధాత్రి’ బలంగా విశ్వసిస్తుంది. అందుకు కొంతమంది బలవంతులు మా ప్రయత్నాన్ని ఆపడానికి బెదిరింపులకు దిగినా, బాధితులపక్షాన వకాల్తా పుచ్చుకుంటే లేనిపోని ఆరోపణలు చేసిన ఏ మాత్రం ఖాతరు చేయకుండా పేదప్రజలపక్షాన ముందుకు వెళుతూ నిఖార్సయిన వార్తలు అందించేందుకే నిత్యం కృషి చేస్తుంది. భూఅక్రమాలు, భూకబ్జాలను వెలికితీసి బాధితులపక్షాన తన గొంతును ‘నేటిధాత్రి’ వినిపించబోతుంది. మీ సమస్యలు ఏం ఉన్నా మాకు తెలియచేయాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వాటి పరిష్కారానికి ‘నేటిధాత్రి’ దినపత్రిక వేదికగా మేము మావంతు కృషి చేస్తామని చెపుతున్నాం. ‘కబ్జా’ కథలు శీర్షికన కబ్జాకోరుల ఆగడాలను ఇక ఆటకట్టిస్తాం.