ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలపై ఉక్కుపాదం
ఎమ్మెల్యే సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ సంయుక్త తనిఖీలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ సంయుక్తంగా రైస్ మిల్లులపై క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు.
గణపురం బుర్కాయలగూడెంలోని ఓ రైస్ మిల్లును వారు స్వయంగా సందర్శించి, ధాన్యం కొనుగోలు విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే సత్యనారాయణ రావు బాయిల్డ్ రైస్ మిల్లులు రైతుల నుంచి బస్తాకు 41 కేజీల చొప్పున మాత్రమే ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టి, తక్కువ బరువు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అదేవిధంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, నిబంధనలు ఉల్లంఘించే మిల్లులను వెంటనే సీజ్ చేసి, సంబంధిత యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. రైతుల సంక్షేమే ప్రభుత్వ ధ్యేయమని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ తనిఖీలలో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
