రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత

రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత

మహారాష్ట్ర నుంచి తెలంగాణకు అక్రమ రవాణా

నలుగురిపై కేసు నమోదు – లారీతో పాటు 30.7 టన్నుల విత్తనాలు స్వాధీనం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించి మోసం చేసేందుకు యత్నిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను కోటపల్లి పోలీసులు బట్టబయలు చేశారు.సరైన అనుమతులు,బిల్లులు లేకుండా మహారాష్ట్ర నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న సుమారు 30,700 కిలోల (30.7 టన్నులు) వరి విత్తనాలను రాపన్‌పల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ సుమారు రూ.21,49,000 ఉంటుందని జైపూర్ ఏసీపీ తెలిపారు.మంగళవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోటపల్లి మండల వ్యవసాయ అధికారి (ఏఓ) సాయి కృష్ణ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు కోటపల్లి ఎస్సై ఆధ్వర్యంలో రాపన్‌పల్లి చెక్‌పోస్ట్ వద్ద విస్తృత తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా మహారాష్ట్రలోని సిరోంచా ప్రాంతం నుంచి తెలంగాణలోని మానకొండూర్ వైపు వెళ్తున్న TS-29 TB-6555 నంబర్ గల లారీని ఆపి తనిఖీ చేయగా,అందులో ఉన్న వరి విత్తనాలకు ప్రభుత్వ అనుమతులు,అధికారిక లేబుల్స్,ధృవీకరణ పత్రాలు (సర్టిఫికెట్లు),బిల్లులు లేవని గుర్తించారు.విత్తనాల ప్యాకింగ్ కూడా చట్టబద్ధంగా లేకపోవడంతో వాటిని సీడ్స్ యాక్ట్-1966 మరియు సీడ్ కంట్రోల్ ఆర్డర్-1983 నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నట్లు నిర్ధారించి సీజ్ చేసినట్లు తెలిపారు.విత్తనాల నాణ్యతను పరీక్షించేందుకు నమూనాలను హైదరాబాద్‌ లోని ప్రభుత్వ అనుమతి పొందిన డీఎన్‌ఏ ఎఫ్‌పీ & టీసీఎం ల్యాబ్‌కు పంపినట్లు ఏసీపీ వివరించారు.కేసు నమోదు చేసిన నలుగురు
ఈ ఘటనలో క్రింది నలుగురిపై కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు:కట్ల భద్రయ్య – లారీ డ్రైవర్
నిమ్మటి సతీష్ – సీడ్ ఆర్గనైజర్
జీఎన్‌వీ రామకృష్ణ – మేనేజింగ్ డైరెక్టర్,సోనం సీడ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
పోలవేని రాజేష్ – లారీ యజమాని

రైతులారా మోసపోకండి: ఏసీపీ
లాభార్జనే ధ్యేయంగా నకిలీ, అనుమతులు లేని విత్తనాలను విక్రయించి రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవు. ఇలాంటి విత్తనాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు.కాబట్టి రైతులు కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్ల వద్ద నుంచే ధృవీకరించబడిన (సర్టిఫైడ్) విత్తనాలను కొనుగోలు చేసి తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి అని ఏసీపీ వెంకటేశ్వర్లు రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో చెన్నూర్ రూరల్ సీఐ ఆర్.కృష్ణ, కోటపల్లి ఎస్సై రాజశేఖర్, మండల వ్యవసాయ అధికారి సాయి కృష్ణ రెడ్డి ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version