ఇళ్లకు కరెంట్ కట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పథకం కార్యక్రమంలో మరుగుదొడ్లను నిర్మాణం పనులు పూర్తిచేయని లబ్ధిదారుల ఇళ్ల విద్యుత్తు కనెక్షన్‌లను గ్రామపంచాయతీ అధికారులు తొలగించారు. ప్రభుత్వం గతం నుండే మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయని వారి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని హెచ్చరించినప్పటికీ కొందరు లబ్ధిదారులు నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించడంతో వారు అన్నంత పని చేశారు. నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయని లబ్ధిదారులను ఇటీవల గుర్తించి స్థానిక ఎంపిడిఓ కొద్ది రోజుల వ్యవధిలోనే నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని తెలిపిన విషయం తెలిసిందే. మంగళవారం చంద్రయ్యపల్లి జూనియర్ పంచాయతీ కార్యదర్శి శతి ఆధ్వర్యంలో మరుగుదొడ్ల తనిఖీలను నిర్వహించారు. లబ్ధిదారులు నిర్మాణ పనులను ఏమాత్రం చేయకపోగా నిర్లక్ష్యంగా మాట్లాడడంతో వారి ఇంటి విద్యుత్తు కనెక్షన్లను సిబ్బంది సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 31లోపు పూర్తిచేసుకోవాలని లేనిపక్షంలో ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బరిగెల లావణ్య కిషోర్, ఉపసర్పంచ్ బాషబోయిన శ్రీనివాస్, రాజేశ్వర్రావుపల్లి సర్పంచ్ యువరాజు, కారోబార్ కొల్లాపురం కోటిలింగం, ఫీల్డ్ అసిస్టెంట్ మాటేటి శ్రీను, సిబ్బంది రజనీకర్, ఎల్లయ్యలు పాల్గొన్నారు.