hanuman junction gudisela kahani…, హనుమాన్‌ జంక్షన్‌ గుడిసెల కహానీ…!

హనుమాన్‌ జంక్షన్‌ గుడిసెల కహానీ…!

ఓ కమ్యూనిస్టు పార్టీ పోరాటం ప్రారంభిస్తుంది. గుడిసెల పోరాటం చేస్తుంది అంటే కమిటీతో చర్చించి, సాధ్య, అసాధ్యాలను పరిశీలించి ముందుకు కదులుతారు. అదే భూపోరాటం చేయాలంటే, పేదప్రజలకు ఇంటిస్థలాలు ఇప్పించాలంటే ఆ భూమి సర్వే నెంబర్‌ ప్రభుత్వ భూమా…? ప్రైవేట్‌ భూమా…? కబ్జాలో ఎవరైనా ఉన్నారా…లేదా…తదితర వివరాలను పరిశీలించి భూమిపైకి వెళ్తారు. కానీ వరంగల్‌ నగరంలో భూపోరాటాలకు సీపీఐ నేతలు చెప్తున్న కొన్ని పోరాటాలు వాటి వెనుక నడిచిన తతంగాలను చూస్తే నవ్వొస్తుంది. గుడిసెల పోరాటంలో పావులుగా మిగిలిపోయి మోసపోయిన పేదప్రజలను చూస్తే ఆవేదన కలుగుతుంది. ఎంతో కొంత ప్రతిఫలం అందుకుని మూట, ముల్లే సర్థుకుని శల్యసారథ్యం వహించిన సీపీఐ నాయకులు నగరంలో అనేక పోరాటాలకు పుల్‌స్టాప్‌ పెట్టారు. అందినకాడికి దండుకుని బయటపడ్డారు. నిజానికి చెప్పాలంటే లక్షల్లో వెనకేసుకున్నారు. చెప్పేది శ్రీరంగ నీతులు…చేసేది ఏదో పని అన్నట్లు కామ్రేడ్‌లు కనికరం లేకుండా పేదప్రజల నిలువ నీడ అనే సెంటిమెంట్‌తో ఇల్లు అనే ఆశతో ఓ ఆట ఆడుకున్నారు.

ఇదీ హనుమాన్‌ జంక్షన్‌ కథ

సరిగ్గా 18సంవత్సరాల క్రితం వరంగల్‌ ములుగురోడ్డు సమీపంలో కాకతీయ కెనాల్‌ దాటాక ప్రస్తుతం హనుమాన్‌ జంక్షన్‌గా పిలుస్తున్న ప్రాంతం కాకతీయుల కట్ట 701, సర్వే నెంబర్‌ 45/బి. ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిలో అప్పటి సీపీఐ నాయకులు పాటూరి సుగుణమ్మ, సదాలక్ష్మి, జ్యోతి, మోతె లింగారెడ్డి, సిరిబోయిన కరుణాకర్‌లు, కేఎల్‌ మహేంద్రనగర్‌ వాసులు ఈ భూమిలో జెండాలు పాతి తుమ్మకంపలు కొట్టి గుడిసెలు వేశారు. ఇల్లును సాధించుకోవాలనే పట్టుదలతో ఎన్ని కష్టాలు వచ్చిన పేదలు ధైర్యం కోల్పోలేదదు. పోలీసు, రెవెన్యూ అధికారులు పలుమార్లు గుడిసెలు తొలగించాలని బెదిరించిన పోరాటాన్ని కొనసాగించారు.

పోరాటం ఎందుకు ముగిసింది…?

నెలరోజులపాటు గుడిసెలు వేసి ఇళ్ల స్థలాల కోసం పోరాటం ఉద్ధృతంగా నడిచిన అది రాజీమార్గం పట్టింది. కారణం డబ్బులతో సీపీఐ నాయకులను ఓ భూమి కొనేయడమే కారణమని ఆరోపణ ఉంది. 4లక్షల రూపాయలకు 2వందల మంది గుడిసెవాసుల ఆశలను తాకట్టు పెట్టినట్లు తెలిసింది. సీపీఐకి చెందిన ప్రధాన నాయకులు భూస్వామితో కుమ్మక్కు కాగానే అతని అనుచరులు ఇతర నాయకులను బెదిరించారు. గుడిసెలు తీసేయాలి..మీ నాయకులతో మాట్లాడమని హుకుం జారీ చేశారు. దీంతో పార్టీలో గొడవ ముదిరిపోయిందట. గుడిసెలు ఎలా తీస్తారని కొందరు ప్రశ్నిస్తే పార్టీ ఫండ్‌ ఇస్తారట అని సమాధానం లభించిందట. ఇక్కడ అర్థంకానీ విషయం ఏంటంటే గుడిసెలు వేసేటప్పుడు ప్రభుత్వభూమి రికార్డుల్లో చూశాం అని వాదించిన సీపీఐ నాయకులు, అప్పటి కార్యదర్శితోసహా వెంటనే మాటమార్చి అది ప్రైవేట్‌భూమిని వారికి వారే నిర్థారణకు ఎలా వచ్చారో తెలియదు. కాకతీయుల కోట కట్ట అని ఊదరగొట్టిన నాయకులు పార్టీలోనే ఇతరులు ఈ విషయాన్ని ప్రస్తావిస్తే వెళ్లి ఆ భూస్వామినే అడగండి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చేవారని తెలిసింది. ఈ విషయం సీపీఐకి రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. పైగా అతన్నే జిల్లా కార్యదర్శిగా కొనసాగించారు. ఆ తరువాత ఆ భూమి నాది పట్టాదారు అంటూ సీపీఐ నాయకులకు కావాల్సింది ముట్టజెప్పిన భూస్వామి పోలీసులతో తన అనుచరులను పంపి అక్కడ ఉన్న పేదప్రజలను తరిమివేసి గుడిసెలు దగ్ధం చేశారు. సీపీఐ నాయకులు మాత్రం ఆ సీన్‌లోకి ఎంటర్‌ కాకుండా ఇంట్లోనే హాయిగా ఉండిపోయారు. దీంతో హనుమాన్‌ జంక్షన్‌ గుడిసెల కథ ముగిసిపోయింది. ఇంటిస్థలం ఆశతో జనం లాఠీ దెబ్బలు తిన్నారు. ఖర్చుల పాలయ్యారు. సీపీఐ నాయకులు మాత్రం కావల్సింది అందుకుని జేబులు నింపుకున్నారు. చివరకు ఓడింది మాత్రం పేదప్రజలే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!