అధికారులపై గవర్నర్‌ ఆగ్రహం

అధికారులపై గవర్నర్‌ ఆగ్రహం

పదో తరగతి పాసైన విద్యార్థులు..ఇంటర్మీడియట్‌లో ఎందుకు ఫెయిల్‌ అవుతున్నారని, వారికి సున్నా మార్కులు రావడం ఏంటి’ అని గవర్నర్‌ నరసింహన్‌ అధికారులను ప్రశ్నించారు. ‘ఎన్నడూ లేనట్టు ఇంటర్‌ ఫలితాలపై వివాదం ఎందుకు జరుగుతోందని, ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేంటి’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్‌ విద్యార్థుల ఆందోళనలతో తాజా పరిస్థితిపై నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దాంతో బుధవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.జోషి, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. దాదాపు 40నిమిషాల పాటు ఆయన అధికారుల నుంచి వివరాలు సేకరించారు. విద్యార్థులకు పలు సబ్జెక్టుల్లో సున్నా మార్కులు రావడానికి కారణమేంటని అడిగారు. ఇటువంటి పరిస్థితి పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ అధికారులను ఆదేశించారు. జాతీయస్థాయి పరీక్షలను పరిగణనలోకి తీసుకొని, పకడ్బందీగా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, ఇంటర్‌ బోర్డు విశ్వసనీయత పెంచేలా చర్యలు ఉండాలని ఆదేశించారు. 3.2లక్షల మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారని, వీరి జవాబు పత్రాల రీ-వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ ఉచితంగా చేయాలని సీఎం ఆదేశించారని అధికారులు తెలిపారు. తొలుత సెకండియర్‌ విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్ణీత వ్యవధిలో వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ ప్రక్రియలు పూర్తిచేయాలని సూచించారు. ఏ ఒక్క విద్యార్థి మానవ తప్పిదంతో నష్టపోకుండా చూడాలని గవర్నర్‌ స్పష్టం చేశారు. నాలుగురోజులుగా విద్యార్థుల ఆత్మహత్యలు, ఆందోళనలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *