మక్కల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం..

మక్కల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం

కొనుగోలు కేంద్రాలను వెంటనే పెంచాలని డిమాండ్

రైతులకు న్యాయం చేయకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరిక

రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట, నేటిధాత్రి:

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల మక్కలు పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ రోడ్లపైకి వస్తున్నారని రాష్ట్ర సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్,బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపురం మండలంలో ఆయన మీడియాతో మాట్లాడారు.నియోజకవర్గ పరిధిలో ఈ యాసంగి సీజన్‌లో 70 వేల ఎకరాలకు పైగా రైతులు మక్కజొన్న సాగు చేసినప్పటికీ, దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. వ్యవసాయ అధికారుల వద్ద ఖచ్చితమైన గణాంకాలు ఉన్నప్పటికీ రైతులకు సరైన సదుపాయాలు కల్పించడం లేదన్నారు.పాకాల సరస్సులో గోదావరి నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, సాగునీటిని అందించడంలో స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలను నామమాత్రంగా ప్రారంభించిందని, ఇప్పటి వరకు రైతులకు చెల్లింపులు కూడా చేయలేదని తెలిపారు.ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌పై ఎలాంటి స్పష్టత లేదని, రూ. 2400 మద్దతు ధర ఉన్న మొక్కజొన్నను రైతులు ప్రైవేట్ వ్యాపారులకు రూ. 1700–1800కే విక్రయించాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో సాగునీరు, రైతుబంధు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు భరోసా కల్పించారని గుర్తు చేశారు.వాతావరణ శాఖ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే గ్రామాల వారీగా మక్కల కొనుగోలు కేంద్రాలను పెంచి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులకు మద్దతుగా నిరసనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ తక్కల్లపల్లి రవీందర్ రావు,మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మాజీ జడ్పీటీసీ,మండల పార్టీ అధ్యక్షుడు,సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, సర్పంచులు, క్లస్టర్ బాధ్యులు, మండల పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version