గురిజాల హైలెవల్ బ్రిడ్జి వంతెనకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి
హర్షం ప్రకటించిన గురిజాల ఉద్యోగుల ఐక్యవేదిక
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో పెద్దం చెరువు వద్ద శిథిలావస్థలోనున్న గురిజాల నుండి నర్సంపేట పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారి మార్గంలో లోలెవల్ వంతెన స్థానంలో 3.20 కోట్ల రూపాయలతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం కొరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు.కాగా గురిజాల ఉద్యోగుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు గొలనకొండ వేణు,ప్రధాన కార్యదర్శి చుక్క రాజేందర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
గత కొన్ని సంవత్సరాల నుండి పెద్దం చెరువు లోలెవల్ వంతెన ప్రమాదకర పరిస్థితులలో నీటి ఉధృతితో రాక పోకలు నిలిచిపోయి ఆరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారు గుర్తుచేశారు. ఎమ్మెల్యే దొంతి శంకుస్థాపనతో ఆ కష్టాలు తీరానున్నాయని తెలిపారు. గురిజాల నుండి కోనాపురం వెళ్ళుటకు గ్రామ ప్రజలు, రైతులు రోడ్డు లేక అవస్థలు పడేవారని దీంతో మహేశ్వరం క్రాస్ నుండి గురిజాల, ఎంపీటీసీ రోడ్ మీదుగా కోనాపురం వెళ్ళుటకు 3.10 కోట్లతో బీటీ రోడ్డుకు కూడా శంకుస్థాపన చేయడం వారు సంతోషం వెలిబుచ్చారు. గురిజాల గ్రామంలో సీసీ రోడ్లు కాక మిగిలిపోయిన వీధులన్నీ వర్షా కాలంలో బురదమయం అయ్యి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతూ అందుకు గాను సీసీ రోడ్లు వేయించాలని ఎమ్మెల్యే మాధవరెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు వేణు,రాజేందర్ గౌడ్ పేర్కొన్నారు.