‘ఫ్యాన్’ గాలికి ‘సైకిల్’ కుదేలు
ఆంధ్రప్రదేశ్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఫ్యాన్ గాలికి సైకిల్ కుదేలయిపోయింది. రెండోసారి తప్పక అధికారంలోకి వస్తానని పూర్తి విశ్వాసంతో ఉన్న చంద్రబాబు అంచనాలను వైఎస్సార్సీపీ పటాపంచలు చేసింది. అత్యధిక స్థానాలలో మెజార్టీని కనబరుస్తూ అధికారం దిశగా కదిలింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి వైఎస్సార్సీపీ తన అధిక్యాన్ని ప్రదర్శించింది. ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలకుగాను వైఎస్సార్సీపీ 152 స్థానాల్లో విజయం సాధించగా, టిడిపి కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఖాతా తెరవని జనసేన
ఆంధ్ర ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసేన పార్టీని ఆంధ్రప్రజలు ఎంతమాత్రం ఆదరించలేదు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లో ఓటమిపాలు కావాల్సి వచ్చింది. గాజువాకలో మొదట్లో పవన్ లీడ్లో ఉన్నా విజయం దక్కలేదు. మరోవైపు భీమవరంలో పవన్ మూడోస్థానంలో నిలవాల్సి వచ్చింది.
వెనుకంజలో మంత్రులు, మంత్రుల కుమారులు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మంత్రులు వెనుకంజలో కొనసాగుతున్నారు. వైఎస్సార్సీపీ సునామీలో ఓటమి బాట పట్టారు. వీరితోపాటు కొంతమంది మంత్రుల కుమారులు సైతం ఓటమి పాలయ్యారు.
పార్లమెంట్ ఫలితాల్లో వైఎస్సార్సీపీ హవా
ఆంధ్రప్రదేశ్లోని పార్లమెంట్ స్థానాల్లో సైతం వైఎస్సార్సీపీ హవా కొనసాగింది. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఫ్యాన్ మెరుపు వేగంతో దూసుకుపోయింది. టిడిపి, జనసేన పార్టీలు పార్లమెంట్ ఖాతా కూడా తెరవలేకపోయాయి. 25స్థానాల్లో వైఎస్సార్సీపీ లీడ్ ఇలాగే కొనసాగితే దేశంలో అతిపెద్ద మూడోపార్టీగా వైఎస్సార్సీపీ అంతరించి రికార్డు సృష్టించబోతుంది.