
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మీ పల్లిలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విద్యార్థునులు తెలుగుదనం ఉట్టిపడేలా, సంప్రదాయాలను గౌరవిస్తూ, అందమైన ముగ్గులు వేసి వాటిని రంగులతో అలంకరించారు.
తెలుగు సంస్కృతి ఉట్టి పడేలా భోగి మంటలు, గొబ్బెమ్మలు , హరిదాసు చిత్రాలు వంటి అందమైన
రంగవల్లులు తీర్చిదిద్దారు. అందమైన , ఆకర్షణీయంగా, సందేశాత్మకమైన ముగ్గులు వేసి విద్యార్థునులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. వివిధ రకాల ఆకృతులతో అందమైన ముగ్గులు వేయడంలో విద్యార్థినులు ఒకరికొకరు పోటీ పడ్డారు. ఈ ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ వాకిటి అరుణ, ప్రాథమిక పాఠశాల హెచ్ ఎం ఎస్.కల్పన, ఉన్నత పాఠశాల కు చెందిన మహిళా ఉపాధ్యాయులు సుజాత,
ఆస్రఖాద్రి లు వ్యవహరించారు.
అట్టహాసంగా బహుమతుల ప్రదానోత్సవం..
పాఠశాల స్థాయిలో నిలిచిన ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మహబూబ్ నగర్ కు చెందిన మోనిక డిజిటల్ ఆధ్వర్యంలో బహు మతుల ప్రదానోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల లో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన దొబ్బలి చిన్నారి, మాడమోని సింధు లు ప్రథమ స్థానం , అశ్విని కుమారి,వైశాంతిలు ద్వితీయ బహుమతి, బల్సు చందన , లక్ష్మీ లకు తృతీయ బహుమతి లభించగా నవ్య శ్రీ, హిందులకు ప్రోత్సాహక బహుమతులు లభించాయి. మోనికా డిజిటల్ అధినేత లయన్ కె.ప్రతాప్ రెడ్డి సహకారంతో పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు లయన్ అశ్విని చంద్రశేఖర్, ఉన్నత,ప్రాథమిక పాఠశాలల హెచ్ యం లు కె కె శ్రీనివాస్, ఎస్.కల్పనలు విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగేశ్వర్ రెడ్డి, మురళీధర్, శంకర్, కమల్ రాజ్, మదన్ మోహన్, సుజాత, అహ్మద్, వెంకట్రాములు, తదితరులు పాల్గొన్నారు.