దిల్లీ, నేటిధాత్రి: కక్ష్యలోని ఉపగ్రహాన్ని క్షిపణితో కూల్చివేసే ఏ శాట్ పరీక్ష విజయంపై దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై ఎన్నికల కమిషన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ విషయంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘన జరగలేదని ఈసీ స్పష్టం చేసింది. ప్రధాని ప్రసంగించే సమయంలో పార్టీ పేరును ప్రస్తావించడం, ఓట్లు అభ్యర్థించడం వంటివి చేయలేదని ఎన్నికల సంఘం పేర్కొంది.
ఉపగ్రహ నిరోధక పరీక్ష విజయంపై గత బుధవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. అత్యంత కఠినమైన మిషన్ శక్తి ప్రయోగం విజయవంతమైందని, ఏశాట్ ద్వారా తక్కువ ఎత్తులోని కక్ష్యలో తిరుగుతున్న ఓ సజీవ ఉపగ్రహాన్ని కూల్చివేశామని మోదీ చెప్పారు. దేశ ప్రజలకు ఈ ప్రయోగం గర్వకారణమని తెలిపారు. మిషన్ శక్తితో అంతరిక్షంలోనూ మన రక్షణ వ్యవస్థను మెరుగుపరుచుకున్నామని అన్నారు.
అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మోదీ ఈ ప్రసంగం చేయడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రధాని ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో స్పందించిన ఈసీ.. మోదీ ప్రసంగం అంశాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ.. ప్రధాని ప్రసంగానికి సంబంధించిన వివరాలను దూరదర్శన్, ఆల్ఇండియా రేడియోల నుంచి సేకరించింది. వీటిని పరిశీలించిన అనంతరం మోదీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది.