ఎవడు అడ్డొస్తాడో చూస్తా…!

– కబ్జా స్థలంలోనే నిర్మాణం చేస్తా

– కార్పోరేటర్‌ను మున్సిపల్‌ అనుమతులు నాకో లెక్కా….

– అధికార పార్టీ నాయకులకే అడ్డొస్తారా…అరగంటలో అనుమతి పత్రాలిస్తా

– ఓ కార్పోరేటర్‌ అతి…కబ్జాతో అధికార పార్టీ పరువు తీస్తున్న వైనం

– మున్సిపల్‌ అధికారులు నోటీసులు ఇచ్చిన లెక్క లేదు

– అధికారంలో ఉన్నాం…మాకెవడు అడ్డు అంటూ ఫోజులు

నేటిధాత్రి బ్యూరో: ఓవైపు ముఖ్యమంత్రి స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తుంటే పార్టీ బలోపేతానికి కేటిఆర్‌ అహర్నిశలు కృషి చేస్తుంటే గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో నాయకులు మాత్రం అతిగా వ్యవహారిస్తూ యథేచ్చగా కబ్జాలు చేస్తూ పార్టీ పరువును గంగలో కలుపుతున్నారు. అధికారం వీరొక్కరి సొత్తు అయినట్లు అహోరాత్రులు శ్రమించి ప్రజల మనసు గెలిచి టిఆర్‌ఎస్‌ను వీరే అధికార పీఠమెక్కించినట్లు ఫోజులు కొడుతున్నారు. గులాబీ హవాలో, కేసిఆర్‌ చరిష్మాతో కార్పోరేటర్‌గా గెలిచి కాలర్‌ ఎగరేస్తూ హన్మకొండ నడిబొడ్డున కబ్జాపర్వం కొనసాగిస్తున్న ఓ కార్పోరేటర్‌ అధికారంలో ఉన్నాం…మేం ఇష్టం వచ్చినట్లు చేయ్యెచ్చు అంటూ గ్రేటర్‌ వరంగల్‌ కార్పోరేషన్‌ అధికారులపై తన జులుం చూపిస్తున్నాడట. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కబ్జాస్థలంలో నిర్మాణాలు చేస్తున్నారని నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన అధికారుల వద్ద నుంచి నోటీసులు తీసుకుని బూతుపురాణం అందుకున్నాడట. ఎవడు అడ్డొస్తాడో చూస్తా.. కబ్జాస్థలంలోనే నిర్మాణం చేస్తా…అనుమతులు నాకో లెక్క కాదు. అరగంటలో తెస్తా అంటూ డిసి స్థాయి అధికారులపై విరుచుకుపడ్డాడట. గ్రేటర్‌ వరంగల్‌లోని ఓ ఎమ్మెల్యే తన వెనుక ఉన్నాడని, ఈ స్థలంలో ఆ ఎమ్మెల్యేకు సంబంధించిన కాంప్లెక్స్‌ నిర్మాణం చేస్తున్నామని చెపుతున్న ఈ కార్పోరేటర్‌తో సహా మరో ఇద్దరు కార్పోరేటర్లు ఎలాంటి జంకు లేకుండా దర్జాగా కబ్జా పర్వాన్ని కొనసాగిస్తున్నారు. హన్మకొండ నగరంలో వీరు చేసిన కబ్జాస్తలం విలువ పదికోట్లపైగానే ఉంటుంది. ఏకంగా 900గజాలకుపైగా స్థలాన్ని కబ్జా చేసిన వీరు. ఎవరు అడ్డు చెప్పిన వినకుండా నిర్మాణాన్ని మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు. అసలు స్థల యజమాని పోలీసులకు, మున్సిపల్‌ కమీషనర్‌కు ఫిర్యాదు చేసిన ఈ ముగ్గురు కార్పోరేటర్లు మాత్రం సేమ్‌ డైలాగ్‌ అందుకుంటున్నారట. అధికారంలో ఉన్నాం…అంటూ విర్రవీగుతున్నారట. ఇలాంటి కబ్జారాయుళ్లపై గులాబీ అధిష్టానం సీనియస్‌గానే ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని వెనకుండి నడిపిస్తున్నాడని అందరూ అంటున్నా గ్రేటర్‌లోని ఆ ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో చూడాలి.

………………………………………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *