ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
-డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పిస్తున్న వేముల మహేందర్ గౌడ్
జయంతి అంటే పాలతో ఫోటోలు కడగడం కాదు..ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడం…
అణగారిన వర్గాల ఆశాజ్యోతి..పేదల పక్షాన నిలబడిన మహోన్నతమైన నాయకుడు బి.ఆర్ అంబెడ్కర్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మనుషుల్ని మనుషులుగా చూడని ఈ దేశంలో మనుషులంతా సమానమేనని, తాను రచించిన రాజ్యాంగం ద్వారా నిరూపించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఆయన హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేందర్ గౌడ్ మాట్లాడారు. సామాజిక అసమానతలను రూపుమాపేందుకు ఎన్నో అవమానాలు, కుల వివక్షతను ఎదుర్కొని దేశంలో ఎన్నో సంఘసంస్కరణలకు ఆద్యం పోసి వెలి వాడల నుంచి దేశానికే రాజ్యాంగాన్ని అందించిన గొప్ప దార్శనికుడు, బడుగు బలహీన వర్గాల బహుజన బాంధవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. నేటితరం వారి స్ఫూర్తి, త్యాగాలను ఆదర్శంగా తీసుకుని..కుల వివక్షతకు..కుల నిర్మూలనకు..అగ్రవర్ణాల అణచివేతకు..వ్యతిరేకంగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఎతైన విగ్రహాలు నెలకొల్పి..జయంతులు..వర్ధంతుల సందర్భంలో మాత్రమే అంబేద్కర్ ను గుర్తు చేసుకునే ఒరవడిని కాకుండా వారి స్ఫూర్తిని, చరిత్రను భావితరాలకు అందించేందుకు కృషి చేయాలని కోరారు.