డా బి ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
ముఖ్య అతిథిగా హాజరైన పరకాల శాసనసభ్యులు రేవూరి
కాశిబుగ్గ నేటిధాత్రి
భారత రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా ఆదివారం గీసుగొండ మండల కేంద్రంలో కీర్తిశేషులు తుప్పరి సూర్యనారాయణ జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుమారుడు తుప్పరి వికాస్ ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం గీసుగొండ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దౌడు అనిల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని అన్నారు. అటువంటి మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన దాతలకు, కష్టపడ్డ ప్రతి వ్యక్తికి పేరు పేరునా అభినందిస్తున్నట్లు తెలిపారు.రాజ్యాంగ స్ఫూర్తిని అంబేడ్కర్ ఆశయాలను దెబ్బతీసేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని వారి కుట్రను తిప్పికొట్టేందుకే జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నదని అన్నారు. అణగారిన వర్గాలకి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశాకిరణం అని బడుగు బలహీనుల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.