జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్…

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

రాజ్యాంగ విలువలతో సమగ్ర అభివృద్ధే లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

భూపాలపల్లి నేటిధాత్రి

 

సోమవారం జిల్లా కేంద్రంలోని డా బిఆర్ అంబేద్కర్ క్రీడా మైదానంలో నిర్వహించిన
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ముందుగా పోలీసులు, సాయుధ దళాలు, ఎన్ సీసీ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ జిల్లా కలెక్టర్ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950 జనవరి 26న భారతదేశం స్వతంత్ర, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిన సందర్భంగా ఈ రోజును పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.
మన రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ సభ సభ్యుల కృషి అభినందనీయమని, ప్రతి భారతీయుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం కల్పించే గొప్ప రాజ్యాంగం మనదని కలెక్టర్ అన్నారు. స్వాతంత్ర్య సాధనలో ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ, జిల్లా అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళల జీవితాల్లో కీలక మార్పుకు దారితీసిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు కోటి 85 లక్షల 97 వేల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయగా, రూ.97 కోట్ల 43 లక్షలు మహిళలకు ఆదా అయిందన్నారు.

వైద్య ఆరోగ్య సేవలు

పేదలకు భరోసా

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య బీమా పరిమితిని ప్రభుత్వం 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. జిల్లాలో 39,605 మంది ఈ పథకం ద్వారా వైద్య సేవలు పొందగా, రూ.88 కోట్ల 13 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
ఔషధి ద్వారా 1,03,402 మందికి వైద్య సేవలు, 5,690 మంది మహిళలకు ఆరోగ్య మహిళా క్యాంపులు, 65 పల్లె దవాఖానాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మహాదేవపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో డయాలసిస్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

రైతు బరోసా పథకం ద్వారా ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ.6 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 1,24,496 మంది రైతులకు రూ.96 కోట్లు చెల్లించామని చెప్పారు.రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతు బీమా పథకంలో 72,058 మంది నమోదు చేసినట్లు తెలిపారు.

జిల్లాలో వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నామని తెలిపారు. 46,840 ఉచిత వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు, గృహాజ్యోతి పథకం ద్వారా 56,525 కుటుంబాలకు రూ.37 కోట్ల 42 లక్షలు ప్రభుత్వమే సబ్సిడీ చెల్లించినట్లు పేర్కొన్నారు.

నిరుపేదలకు గౌరవ నివాసం ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద జిల్లాలో 3,943 ఇండ్లు మంజూరు, 3,180 ఇండ్లకు మార్క్ అవుట్ ఇచ్చామని, ఇప్పటి వరకు రూ.51 కోట్ల 40 లక్షలు విడుదల చేశామని తెలిపారు.

పేదలకు వరం
మహాలక్ష్మి గ్యాస్ పథకం, ఈ పథకం ద్వారా 68,311 మందికి రూ.500కే గ్యాస్ ఇస్తున్నామని ఇప్పటి వరకు 2,36,243 సిలిండర్లు సరఫరా చేసి రూ.6 కోట్ల 55 లక్షల సబ్సిడీ చెల్లించినట్లు తెలిపారు.

277 రేషన్ దుకాణాల ద్వారా 1,37,950 కార్డుదారులకు బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. వానాకాలం పంట ద్వారా 1,15,853 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.274 కోట్లు చెల్లించామని, సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. సమ్మక్క–సారక్క మహిళా జిల్లా సమాఖ్యలో 87,134 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. బ్యాంకు లింకేజి ద్వారా ఇప్పటి వరకు రూ.240 కోట్లకు పైగా రుణాలు, 1,17,220 ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసినట్లు చెప్పారు.

భూపాలపల్లి మున్సిపాల్టీలో రూ.113 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, పట్టణ మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి, వ్యక్తిగత రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు.
మారుమూల గ్రామాలు, నిరుపేదల సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, పార్లమెంట్, శాసన మండలి, శాసన సభ్యులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి, మీడియా మిత్రులకు జిల్లా కలెక్టర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. తదుపరి ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంషా పత్రాలు అందచేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పి సిరిశెట్టి సంకీర్త్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,
అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, ఆర్డిఓ బాలకృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version