ముందు మర్యాద..వెనుక మంత్రాంగం

ముందు మర్యాద..వెనుక మంత్రాంగం

 

ఎప్పుడూ తనదైన మార్కు డైలాగులతో ‘దూకుడు’ ప్రదర్శించే మల్లన్న.. ఇప్పుడు ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ చెంత వాలి తెలంగాణ పాలిటిక్స్‌లో అసలైన ‘మాస్’ మలుపు ఇచ్చారు. మల్లారెడ్డి మోదీతో భేటీ కావడం అటు తెలంగాణ.. ఇటు దేశ రాజధాని ఢిల్లీలోనూ పెను చర్చకు దారితీసింది. మల్లారెడ్డి వంటి సీనియర్ నేత.. అదీ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి చెందిన ఎమ్మెల్యే, నేరుగా ప్రధానిని కలవడం వెనుక ఉన్న రాజకీయ గూఢార్థాలు ఇప్పుడు విశ్లేషణలకు పని పెడుతున్నాయి.

ఈ భేటీలో అందరినీ ఆకర్షించిన ప్రధానాంశం మల్లారెడ్డి తన కోడలు ప్రీతిరెడ్డిని వెంట తీసుకెళ్లడం.. సాధారణంగా రాజకీయ నాయకులు తమ వారసులను జాతీయ స్థాయి నేతలకు పరిచయం చేస్తున్నారంటే.. అది భవిష్యత్తు ప్రాతినిధ్యానికి పునాది అని అర్థం. గత కొంతకాలంగా ప్రీతిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనే తన కోరికను ఆమె గతంలోనే బహిరంగ పరిచారు. ఇప్పుడు ప్రధాని మోదీతో భేటీ ద్వారా.. ఆమెను బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపే దిశగా మల్లారెడ్డి పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది.

తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన తర్వాత బీఆర్ఎస్ లో ఒక విధమైన సందిగ్ధత నెలకొంది. పార్టీలోని కీలక నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. మల్లారెడ్డికి మేడ్చల్, మల్కాజిగిరి పరిసర ప్రాంతాల్లో బలమైన ఆర్థిక, సామాజిక పట్టు ఉంది. ఆయన వంటి నేత పార్టీని వీడితే అది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బ అవుతుంది. అయితే బీఆర్ఎస్ శ్రేణులు దీనిని “మర్యాదపూర్వక భేటీ”గా అభివర్ణిస్తున్నప్పటికీ రాజకీయాల్లో ‘అకస్మాత్తు మర్యాదలు’ ఉండవనేది జగమెరిగిన సత్యం.

మరోవైపు తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీకి మల్లారెడ్డి వంటి ‘మాస్’ ఇమేజ్ ఉన్న నేతలు అవసరం. ఆర్థిక వనరులు, విద్యాసంస్థల నెట్‌వర్క్ ఉన్న మల్లారెడ్డి కుటుంబం బీజేపీలోకి వస్తే, అది పార్టీకి అదనపు బలాన్ని ఇస్తుంది. బండి సంజయ్‌తో ప్రీతిరెడ్డి గతంలో జరిపిన భేటీని, ఇప్పటి మోదీ భేటీని కలిపి చూస్తే.. మల్లారెడ్డి కుటుంబం కమల తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం ఖరారైనట్లే కనిపిస్తోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version