క్యాతనపల్లి లో హింసను ప్రోత్సహించిన వారిపైనే కేసులు…
డిసిసి అధ్యక్షులు పి రఘునాథ్ రెడ్డి
అక్రమ కేసులు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు..
పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయి కమిటీల ఏర్పాటు..
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వోడ్నాల శ్రీనివాస్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల సమయంలో మంత్రి వాహనాన్ని అడ్డుకొని దాడులకు పాల్పడింది మీరు కాదా..? అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్, కాంగ్రెస్ కార్యకర్తపై ట్రాఫిక్ కోన్‌తో దాడి చేసింది నిజం కాదా..?” అంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు పి రఘునాథ్ రెడ్డి రామకృష్ణాపూర్, పట్టణ అధ్యక్షులు వోడ్నాల శ్రీనివాస్ లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.సోమవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి ఆదివారం సంతకం చేసేందుకు వస్తున్న బాల్క సుమన్ మీడియా ముందు అక్రమ కేసులు అంటూ మాట్లాడడం సరికాదన్నారు.
హింసను ప్రోత్సహించి, ఉద్రిక్త పరిస్థితులకు కారణమైనందుకే పోలీసులు కేసులు నమోదు చేశారని, అవి అక్రమ కేసులు కావని స్పష్టం చేశారు.వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి చివరి గింజ వరకు నేరుగా కొనుగోలు చేస్తున్న ఘనత మంత్రి వివేక్ వెంకటస్వామిదేనని కొనియాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మిల్లర్ల నుంచి లంచాలు తీసుకొని రైతులకు కనీస నష్టపరిహారం కూడా అందించలేదని ఆరోపించారు. చెన్నూరు నియోజకవర్గ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన సమాధానం ఇస్తారని పేర్కొన్నారు.అనంతరం పార్టీ బలోపేతమే లక్ష్యంగా పట్టణ కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో కమిటీల ఏర్పాటు చేపడుతున్నట్లు వోడ్నాల శ్రీనివాస్ తెలిపారు.
రాబోయే ఎన్నికల దృష్ట్యా ప్రతి కార్యకర్త పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత పట్టణ కాంగ్రెస్ పార్టీలో అన్ని విభాగాలకు పూర్తి స్థాయి కమిటీలను వేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పలువురి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, మరో రెండు మూడు రోజుల్లో అధికారికంగా కమిటీల జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రజా పాలనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు పాల్గొన్నారు.
