పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తక్షణమే పేదలకు ఇవ్వాలి
అసంపూర్తి ఇండ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి
దూపకుంట డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించిన ఎంసిపిఐ(యు) బృందం
నేటిధాత్రి ఖిలా వరంగల్ :-
వరంగల్ నగరం, దూపకుంట పరిధిలో కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తిచేసి కూడా అర్హులైన పేదలకు ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. తక్షణమే పూర్తయిన ఇండ్లను పంపిణీ చేయకపోతే అర్హులైన పేదలను సమీకరించి ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామని హెచ్చరించారు.
శుక్రవారం ఎంసిపిఐ(యు) వరంగల్ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా–నగర నాయకత్వ ప్రతినిధి బృందం దూపకుంటలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించి నిర్మాణ స్థితిగతులను పరిశీలించింది.
ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ…
వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిరాశ్రయ పేదలకు అన్ని సౌకర్యాలతో రెండు పడకల ఇండ్లు ఇస్తామని ప్రచార ఆర్భాటం చేసిన గత ప్రభుత్వం, కాలయాపన చేసి పేదలకు ఇండ్లు ఇవ్వకుండానే అధికారాన్ని కోల్పోయింది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీమతి కొండ సురేఖ ప్రస్తుత మంత్రిగా ఉన్నా కూడా దూపకుంటలో పూర్తయిన ఇండ్లను ఇప్పటికీ పంపిణీ చేయకపోవడం విడ్డూరం” అని విమర్శించారు.వరంగల్ నగర పరిధిలో దూపకుంటలో సుమారు 2400 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి పూనుకోగా, సగం మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన ఇండ్లు అసంపూర్తిగా ఉండటంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. పలు మార్లు అధికార యంత్రాంగానికి విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు.
అలాగే లక్ష్మీ టౌన్షిప్‌లో 210, తిమ్మాపూర్‌లో 456 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఉన్నప్పటికీ నేటికీ పంపిణీ చేయకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే పంపిణీ చేయకపోతే ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇండ్ల నిర్మాణంలో జరిగిన నాసిరకం పనులు, అసంపూర్తిగా నిలిపివేసిన పనులపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.
ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా
పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించనున్నట్లు ఎంసిపిఐ(యు) నగర కార్యదర్శి మాలోత్ సాగర్ ప్రకటించారు.ఈ కార్యక్రమంలోజిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర సహాయ కార్యదర్శి సుంచు జగదీశ్వర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముక్కెర రామస్వామి, నగర నాయకులు ఎగ్గని మల్లికార్జున్, మాలోత్ ప్రత్యూష, మాలి ప్రభాకర్, అప్పనపురి నర్సయ్య, మహమ్మద్ మెహబూబ్ పాషా, పరిమళ గోవర్ధన్ రాజు, తాటికాయల రత్నం, చుక్క ప్రశాంత్, నలివెల రవి, రామస్వామి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
