collector sir…mudokannu teravali, కలెక్టర్‌సారు… మూడోకన్ను తెరవాలి…

కలెక్టర్‌సారు… మూడోకన్ను తెరవాలి…

వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌ జిల్లా డిఐఈవో కార్యాలయంలో భారీ అవినీతికి పాల్పడిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను వెంటనే సస్పెండ్‌ చేస్తూ, డిఐఈవో, సూపరింటెండెంట్‌ను విధుల్లో నుండి తొలగించాలని అవినీతి వ్యతిరేఖ పోరాట సమితి(ఎవిపిఎస్‌), అంబేద్కర్‌ విద్యార్థి సమాఖ్య(ఎబిఎస్‌ఎఫ్‌), డెమోక్రాటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌(డివైఎఫ్‌), భారతీయ విద్యార్థి మోర్చా(బివిఎమ్‌), బహుజన దళిత్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌(బిడిఎస్‌ఎఫ్‌) సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గత పదిరోజులుగా డిఐఈవో కార్యాలయంలో క్యాంపు పేరిట వచ్చిన డబ్బులను కార్యాలయంలోని కొందరు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితోపాటు డిఐఈవో, సూపరింటెండెంట్‌లు అవినీతికి పాల్పడ్డారని ‘నేటిధాత్రి’ దినపత్రికలో వస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సంబంధిత జిల్లా యంత్రాంగం అధికారుల తీరును విమర్శిస్తున్నారు.

అవినీతి ఉద్యోగులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి

డిఐఈవో కార్యాలయంలో జరిగిన అవినీతిపై విచారణ కమిటీని నియమించి అవినీతికి పాల్పడిన ఉద్యోగులను గుర్తించి వెంటనే సస్పెండ్‌ చేయాలి. స్టేషనరీ పేరుతో ముక్కున వేలేసుకునే విధంగా లెక్కలు రాశారని, క్యాంపులో పనిచేయని వారి పేర్లను రాసి దొంగపేర్లతో, దొంగల అకౌంట్లలో డబ్బులు వేసుకుని అందినకాడికి దండుకున్నారని, కొన్ని బిల్లులపైన తీసుకున్న వారి సంతకాలు లేకున్నా వారికి చెల్లించినట్టుగా బిల్లులు తయారుచేసి అసలు పనిచేసిన వారికి తెలియకుండా ఎక్కువ మొత్తంలో నొక్కేశారు. పేపర్‌ వాల్యుయేషన్‌ చేసే లెక్చరర్‌ల విషయంలో కూడా ఒక్కో టేబులో ఉన్న వారికంటే ఎక్కువ మంది ఉన్నట్టు బిల్లులు డ్రా చేశారు. వీటిని కమిటీ చేత విచారణ జరిపించి బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి.

డిఐఈవో, సూపరింటెండెంట్‌లను ఉద్యోగాల నుండి తొలగించాలి

క్యాంపునకు చెందిన డబ్బులను డ్రా చేయడంలో వీరిద్దరి పాత్ర కీలకమైనదని, వీరు సంతకాలు చేస్తేనే బిల్లులు డ్రా చేసే అవకాశం వుంటుంది. ఫిఫ్టీ-ఫిఫ్టీ దండుకునేందుకు పన్నిన ప్రణాళికలో భాగమే ఈ అవినీతి జరిగిందని చాలా స్పష్టంగా తెలుస్తున్నది. క్యాంపు రిజిష్టర్‌లలో సంతకాలు లేని వారికి బిల్లులు, డబ్బులు డ్రా ఎలా చేస్తారని సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ అవినీతి భాగోతానికి సూత్రధారి డిఐఈవో, పాత్రధారి సూపరింటెండెంట్‌లేనని సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌, ఇంటర్మీడియట్‌ ఆర్జేడీ వెంటనే స్పందించి విచారణ చేయించి బాధ్యులను ఉద్యోగాల నుండి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై ఇంటర్‌ బోర్డు కమీషనర్‌, హైదరాబాద్‌, తెలంగాణ విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర గవర్నర్‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలసి వినతిపత్రాలు ఇస్తామని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!