మద్ది మేడారాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద.
#అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో జాతరను దిగ్విజయం చేయాలి.
#ప్లాస్టిక్ రహిత జాతరగా మద్ది మేడారాన్ని నిలపాలి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
ప్లాస్టిక్ రహితంగా మద్ది మేడారం జాతరను అధికారులు, ఆలయ కమిటీ సమన్వయంతో ముందుకు సాగి జాతరను దిగ్విజయం చేసే విధంగా కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. బుధవారం మండలంలోని నాగరాజు పల్లి గ్రామ శివారులో ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఆలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ జాతర సమయంలో భక్తులకు తాగునీరు, రవాణా సౌకర్యం, వైద్యం అందుబాటులో ఉండే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పోలీస్ బందోబస్తు నిర్వహిస్తూ భక్తులను అప్రమత్తంగా ఉండే విధంగా చూడాలని పోలీస్ శాఖకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గాదె సుదర్శన్ జాతరలో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం తరఫున మరిన్ని నిధులు ఇప్పిస్తే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జాతరను సజావుగా సాగే విధంగా ఆలయ కమిటీ కృషి చేస్తుందని కలెక్టర్కు విన్నవించగా స్పందించిన కలెక్టర్ సంబంధిత మంత్రిత్వ శాఖతో మాట్లాడి జాతరకు నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీడీవో శుభ నివాస్, నాగరాజు పల్లి సర్పంచ్ ఎరుకల లలిత, మామిండ్ల వీరేపల్లి సర్పంచ్ ఏడాకుల సరోజన, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ , విద్యుత్ శాఖ అధికారులు, గ్రామ కార్యదర్శులు, పోలీస్ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
