సీఐ శ్రీలక్ష్మి తీరుపై దళితసంఘాల మండిపాటు…
ధర్మసాగర్ సీఐ శ్రీలక్ష్మీ తీరుపై దళిత సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. తాతలకాలం నుండి దళితులు తమ భూమిని సాగు చేసుకుంటూంటే అన్ని హక్కుపత్రాలు కలిగి ఉన్నా కూడా సివిల్ వివాదంలో తలదూర్చి దళిత కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయడాన్ని వారు ఖండించారు. భూమి అసలు హక్కుదారులైనా దళితులను పోలీస్‌స్టేషన్‌లో అర్థరాత్రి వరకు నిర్భందించి భూకబ్జాదారులకు కొమ్ముకాస్తున్న సీఐని సస్పెండ్ చేయాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ఏ కారణం లేకుండా దళితులను తరుచుగా వేధిస్తున్న సీఐపై విచారణ జరిపి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. భూమి విషయంలో తలదూర్చవద్దని స్వయంగా పోలీస్ కమిషనరే చెప్పినా సీఐ శ్రీలక్ష్మి కమిషనర్ ఆదేశాలను బేఖాతర్ చేయడంలో అంతర్యమేమిటని వారు ప్రశ్నించారు.
సీఐని సస్పెండ్ చేయాలి..
-ఆరూరి కుమార్, కులవివక్షత వ్యతిరేఖ పోరాట సమితి, జిల్లా కార్యదర్శి
దళితులను, భూ హక్కుదారులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌లో నిర్భందించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.పోలీస్‌శాఖ ఒక వైపు పోలీసులు ఫ్రెండ్లీగా వ్యవహరించాలని డిజిపి సైతం చెప్పుతున్నా వారి మాటలను పెడచెవిన పెట్టి ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం ఉన్నతాధికారుల ఆదేశాలను దిక్కరించడమే. సివిల్ తగాదాలో సీఐ తలదూర్చి కబ్జాదారులకు వంతపాడటాన్ని ఎవరు సహించరు.ఆడ,మగ తేడా లేకుండా పోలీస్‌స్టేషన్‌లో నిర్భందించి, నానా బూతులు తిట్టినందుకు, వారిని కొట్టినందుకు సీఐ శ్రీలక్ష్మిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. దళితులకు జరిగిన అన్యాయంపై ఏసిపి, డిసిపి, వరంగల్ పోలీస్‌కమీషనర్‌ను కలిసి వినతిపత్రాలు అందజేసి వారికి అండగా నిలుస్తామన్నారు.
భూ బాదితులకు అండగా నిలుస్తాము
-గురుమిళ్ల రాజు, దళిత ప్రజాసంఘాల ఐక్య వేదిక,రాష్ట్ర కన్వీనర్
కాజీపేట మండలం రాంపూర్‌కు చెందిన సండ్ర మోజెస్ దళిత కుటుంబానికి అండగా ఉంటామని, వారికి చెందిన భూమిని కొందరు కభ్జారాయుళ్లు కబ్జా చేస్తే బాధితులకు అండగా వుండాల్సిన ధర్మసాగర్ సీఐ శ్రీలక్ష్మి కబ్జాదారుకు వత్తాసు పలకడమే కాకుండా భూ హక్కుదారులైన సండ్ర మోజెస్ కుటుంబాన్ని పోలీస్‌స్టేషన్‌లో నిర్భందించడం ఇది ముమ్మాటికి చట్టాన్ని సీఐ తమ చేతుల్లోకి తీసుకోవడమే అవుతుంది. సీఐ అత్యుత్సాహాన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో దళితులకు, దళితుల భూములకు రక్షణ దొరకదేమోనన్న అనుమానం వస్తున్నది. పోలీస్ కమీషనర్ వెంటనే విచారణ చేపట్టి సీఐ శ్రీలక్ష్మిని సస్పెండ్ చేయాలి. భూ హక్కుదారుకు రక్షణ కల్పించాలి.
ఫ్రెండ్లీ పోలీస్‌కు అర్ధం లేకుండా చేస్తున్నారు
-దళిత యువజన సంఘం ఐక్యవేదిక
-కన్నం సునీల్, జిల్లా అధ్యక్షుడు
సివిల్ తగాదాలో తలదూర్చొద్దని పోలీస్ ఉన్నతాధికారులు చెప్పినా వినకుండా కొందరు సీఐలు భూతగాదాలలో తలదూర్చి కబ్జాదారుకు వంతపాడుతున్నారు. కబ్జాదారులకు సహకరించి భూబాధితులను వేదిస్తే కఠిన చర్యలు ఉంటాయని కమీషనర్ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా వినకుండా వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందే కబ్జాదారులకు సహరించిన విషయంలో కేయూ పోలీస్‌స్టేషన్ సీఐ రాఘవేందర్‌రావు,ఎస్సై విఠల్‌ను సస్పెండ్ చేసిన విషయం ప్రజలకు తెలుసునన్నారు. అలాంటి నర్ణయమే వరంగల్ పోలీస్ కమీషనర్ తీసుకొని ఫ్రెండ్లీ పోలీస్ అన్న పదానికి అర్ధం లేకుండా చేసిన సీఐ శ్రీలక్ష్మిని వెంటనే సస్పెండ్ చేయాలి.
ఎంతటి వారినైనా వదిలిపెట్టద్దు
– అర్షం అశోక్, ఎంఆర్‌పిఎస్ టీఎస్ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు
భూకబ్జాదారులతో అంటకాగుతూ దళితులను చిత్రహింసలకు గురి చేసిన ధర్మసాగర్ సీఐని వెంటనే విధుల్లోంచి తొలగించాలి. సివిల్ తగాదాను తన చేతిలోకి తీసుకొని దళితులను రాత్రి వరకు పోలీస్‌స్టేషన్‌లొ నిర్భందించినందుకు వెంటనే సస్పెండ్ చేయాలి.
దళితులంటే చిన్న చూపెందుకు
-మంద నరేష్, అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్, వరంగల్‌జిల్లా అధ్యక్షుడు
తెలంగాణ రాష్ట్రంలో దళితులంటే ఇంకా చిన్నచూపు కొనసాగుతున్నదని, దళితుల భూమాలకు రక్షణ లేకుండా పోతున్నదని, రక్షించాల్సిన పోలీసులు కబ్జాదారులకు అండగా నిలుస్తుండటంతో బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతున్నది. దళితులను చిత్ర హింసలకు గురిచేసి, నానా భూతులు తిట్టిన సీఐ శ్రీలక్ష్మిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. విచారణ చేపట్టి వెంటనే సస్పెండ్ చేయాలి.