chairmenga mahilaku avakasham kalipinchali, చైర్మన్‌గా మహిళకు అవకాశం కల్పించాలి..

చైర్మన్‌గా మహిళకు అవకాశం కల్పించాలి..

వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా పద్మావతికి అవకాశం కల్పించాలని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాజు అన్నారు. సోమవారం పర్వతగిరి మండలకేంద్రంలో తెలంగాణ వికలాంగుల ఫోరం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జన్ను రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌ ఏర్పాటు నుండి ఎప్పుడూ కూడా మహిళలకు అవకాశం కల్పించలేదని, ఈసారి 100శాతం దివ్యాంగురాలైన పొట్టబత్తిని పద్మావతికి అవకాశం కల్పించాలని తెలిపారు. రెండుసార్లు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అదేవిధంగా దేశవిదేశాల్లో 500పైగా వికలాంగ రంగస్థల ప్రదర్శనలు, 200పైగా కచేరీలు చేశారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో వికలాంగులను సంఘటితం చేసిన ఘనత, ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకుని, రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న దివ్యాంగురాలు పద్మావతికే ఈసారి వికలాంగుల కార్పోరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వాలని కోరారు. త్వరలో ముఖ్యమంత్రిని, టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ని, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్‌ని కలిసి అన్ని సంఘాల నాయకులు కోరుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పినింటి రవీందర్‌రావు, రావుల వెంకట్‌, మదర్‌పాషా, ఆలీ, మంజురి ఇలాహి, రాజయ్య, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *