ప్లీజ్‌ …ప్లీజ్‌…అంటే ఓట్లు పడతాయా!

`అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నరో చెప్పరా!

`అధికారంలోకి వస్తామని మీకు మీరు ప్రచారం చేసుకుంటే సరిపోతుందా?

`రైతులకు ఇప్పటికన్నా మెరుగైన పథకాలు ఏమిస్తారు?

`పెన్షన్లు ఎంతకు పెంచుతారు?

`అనేక సంక్షేమ పథకాలు అమలౌతున్నాయి….వాటిని కొనసాగిస్తారా? కోత పెడతారా?

`ఆంద్రప్రదేశ్‌ లో జగన్మోహన్‌ రెడ్డి కూడా ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అన్నాడు.

`నవరత్నాలు ప్రకటించి విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, ఒక్క ఛాన్సివ్వండి అని వేడుకున్నాడు.

`ఆఖరుకు కాంగ్రెస్‌ వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రకటించింది.

`బిజేపి ప్లీజ్‌…ప్లీజ్‌ తప్ప మరేం చెప్పింది?

`పేదల దేవుడు మోడీ అని చెప్పగానే సరిపోతుందా? ధరలు తగ్గిస్తామని చెప్పగలరా?

`గ్యాస్‌ ధర తగ్గుతుందని చెప్పే ధైర్యముందా?

`రాష్ట్రానికి అప్పులెక్కువున్నాయని సంక్షేమాలకు కోతపెడతారా?

`బిజేపిని ఎందుకు గెలిపించాలో చెప్పకపోతే ఎలా?

`కేసిఆర్‌ కుటుంబ పాలన ఆరోపణ ఒక్కటే నమ్ముకుంటే గెలుస్తారా?

`పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమాలను ఉచితాలంటే, వ్యాపారుల రుణాల మాఫీపై సమాధానం చెప్పరా?

రాజకీయ పార్టీ అన్న తర్వాత అధికారం కోరుకోవడం తప్పు కాదు. అధికారంలోకి రావాలనుకోవడం ఆశ కాదు. ప్రజలకు మరింత సేవ చేయాలన్నా అధికారం కావాలి. ఆయా పార్టీలు అనుకున్న తీరిలో సమాజ నిర్మాణం జరగాలన్నా అధికారంలో వుండాలి. ఉన్నతమైన ఆశయాలతో సమాజంలో కొత్త ఒరవడి తీసుకురావాలన్నా అధికారంలోకి రావాలి. ప్రజలకు మేలైన పాలన అందించాలి. వారి సంక్షేమం కోసం నిరంతరం తపన పడాలి. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ రాజ్య నిర్మాణం జరగాలి. ప్రజల గుండెల్లో రాజకీయ పార్టీలు పదిలంగా వుండాలి. కొన్ని దశాబ్ధాలైనా సరే ప్రజలకు మేలు చేసిన నాయకులను మర్చిపోని పాలన అందించాలి. అందుకు పార్టీలు ఎంతో కృషి చేయాలి. ప్రజలకు చేరువ కావాలి. ప్రజల కోరిక మేరకు పని చేయాలి. ప్రజా పోరాటాలు చేయాలి. ప్రజల హక్కుల రక్షణకు పాటు పడాలి. అభివృద్దిలో రాజీలేని పోరాటం చేయాలి. ప్రజల మన్ననలు పొందాలి. ఇవీ సహజంగా రాజకీయ పార్టీలు ఆలోచించేవి. నిర్ణయాత్మక ఆలోచనలతో, నిర్మాణాత్మక విధానాలతో ముందడుగు వేయాలి. అంతే కాని ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌…ప్లీజ్‌…ప్లీజ్‌ అంటే సరిపోతుందా? ప్రజలు ఓట్లేస్తారా? కేంద్రంలో ఎనమిదేళ్లుగా అధికారంలో వున్న బిజేపి, 19 రాష్ట్రాల్లో అధికారంలో వుండి అక్కడ ఎలాంటి పాలన సాగిస్తున్నారన్నది ప్రజలు గమనించరా? తెలంగాణలో అమలౌతున్న సంక్షేమ పధకాలు మరే రాష్ట్రంలోనైనా అమలౌతున్నాయా? 

తెలంగాణ కంటే మరింత మెరుగైన పథకాలు మరెక్కడైనా వున్నాయా? అందులోనూ బిజేపి పాలిత రాష్ట్రాల్లో అమలౌతున్నాయా? కనీసం గుజారాత్‌లోనైనా అమలౌతున్నాయా. గుజరాత్‌లో తెలంగాణలో ఇస్తున్న రూ.2116 పెన్షన్‌ ఇస్తున్నారా? అక్కడ కేవలం రూ.500 ఇస్తున్నారు. ఉత్తరాధి రాష్ట్రాల్లో ఎక్కడా తెలంగాణలో ఇచ్చినంత పెన్షన్‌ ఇవ్వడం లేదు. అక్కడెక్కడా ప్రాజెఉ్టలు కట్టింది లేదు. రిజర్వాయర్ల నిర్మాణం లేదు. కళ్యాణ లక్ష్మి వంటి వినూత్నమైన పధకం లేదు. అలాంటి పధకాలు అమలు చేయాలన్న ఆలోచన లేదు. రైతు బంధు వంటి కార్యాక్రమాలు లేనే లేవు. అయినా మేం గెలుస్తాం…గెలుస్తున్నాం…టిఆర్‌ఎస్‌ను ఓడిస్తాం…డబుల్‌ ఇంజన్‌ తెస్తాం…తెచ్చి ఏం చేస్తారు? గెలిచి ఏం చేస్తారో ఇప్పటికి కూడా చెప్పకపోతే ఎలా? అధికారంలోకి వస్తే తెలంగాణలోనూ అమలు చేస్తామనే ప్రత్యేకమైన పధకాలు బిజేపి వద్ద వున్నాయా? వుంటే అవి కదా? బిజేపి చెప్పాల్సింది. ఒక్క ఛాన్సు ప్లీజ్‌..అంటూ ప్రతి సభలోనూ చెప్పుకుంటూ పోతే ప్రజలు ఆదరిస్తారా? యూపిఏ 2 హయాంలో పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతోపాటు, నాడు నరేంద్రమోడీ గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధిని దేశమంతా అమలు చేస్తాడని ప్రజలు ఎంతో నమ్మారు. అప్పటికి గుజరాత్‌ అన్ని రంగాల్లో పెద్దఎత్తున ప్రగతిలో దూసుకుపోతోందన్న ప్రచారం విసృతంగా వుంది. పైగా బిజేపి ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీని పార్టీ గుర్తించి ప్రకటించిన తర్వాత నరేంద్రమోడీ ప్రజలకు చేసిన వాగ్ధానాలు ప్రజలను పెద్ద ఎత్తున కదించించాయి. అప్పటికే పడిపోతున్న రూపాయి విలువను మళ్లీ నిలబెడతానమన్నారు. ద్రవ్యోల్భనం తగ్గిస్తామన్నారు. ధరలు అదుపు చేస్తామన్నారు. పేద ప్రజలకు అందుబాటులో వుండేలా అన్ని రకాల ధరలు నియంత్రిస్తామన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పెట్రోల్‌ ధరలు తగ్గిస్తామన్నారు. గ్యాస్‌ ధరలు దించుతామన్నారు. పెద్దఎత్తున పారిశ్రామిక రంగాన్ని విసృతం చేస్తామన్నారు. యువతకు ఉపాది కల్పిస్తామన్నారు. పారిశ్రామిక రంగంలో పరుగులు తీయిస్తామన్నారు. వ్యవసాయం పండగ చేస్తామన్నారు. సరిగ్గా ఎన్నికల ముందు మహిళళపై దాడులు జరక్కుంగా కఠినమైన చట్టాలు తెస్తామన్నారు. విదేశాల్లో వున్న నల్ల డబ్బును తెస్తామన్నారు. ప్రతి అకౌంట్లో 15లక్షలు వేస్తామన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ రద్దు చేస్తామన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు చేస్తామన్నారు. బిజేపి తొలి నినాదమైన రామమందిర నిర్మాణం చేస్తామన్నారు. దేశమంతా ఒకే పన్ను విధానం అమలు చేస్తామన్నారు. ఇలా అనేక రకాల వాగ్ధానాలు చేశారు. దాంతో బిజేపి దేశ ప్రజలు నమ్మారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని విశ్వసించారు. దేశమంతా బిజేపి ప్రభజంనంలా గెలిపించారు. మరి అదే బిజేపి తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏం చెబుతారు? 

ఏదీ చెప్పకుండా ఎలా అధికారంలోకి వస్తారు? రాష్ట్రంలో బిజేపి ఒంటరిగా పోటీ చేసే శక్తిని పెంపొందించుకోవడం నిజంగా శుభపరిణామమే…తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుతో 5 సీట్లు గెలిచిన బిజేపి, 2018 ఎన్నికల్లో ఒంటరి పోరుతో ఒక్కసీటుకు పరిమితమైంది. కాకపోతే మధ్యలో వచ్చిన దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు కలిసొచ్చాయి.ఊపు ను తెచ్చిపెట్టాయి. అయితే ఆ రెండు సీట్లు కూడా బిజేపి బలంతో గెలిచాయని చెప్పడం కన్నా, ఆయా అభ్యర్ధుల మీద ప్రజల్లో వున్న నమ్మకం గెలిపించిందని చెప్పకతప్పదు. కాకపోతే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో మాత్రం బిజేపి మానియా పనిచేసింది. ఆ ఎన్నికల్లో కూడా చేయరాని వాగ్ధానాలు చేస్తే తప్ప, ప్రజలు ఓట్లేయలేదు. మరి మర్చిపోయినట్లున్నారు. ప్రజా సంగ్రామయాత్రతో బిజేపి రాష్ట్ర ఛీఫ్‌ బండి సంజయ్‌ పాదయాత్ర వరకు బాగానే వుంది. కాని ఒక్క ఛాన్స్‌ అనే మాటనే జనం వింతగా తీసుకుంటున్నారు. ఈ ఒక్క ప్లీజ్‌ అన్న పదం తప్ప మరేం లేదా? అన్న ప్రశ్న కూడా జనం నుంచే వస్తోంది. ఆ మధ్య బీజేపీ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ ముందు రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్‌ పేదల దేవుడు అన్నా…మన మోడీ అంటూ చెప్పుకొచ్చారు. 

మరి పేదల దేవుడైతే పెరుగుతున్న ధరలేంది? అన్న ప్రశ్న ప్రజలు వేసుకుంటారని, సమయం వచ్చినప్పుడు ప్రశ్నిస్తారని, నిలదీస్తారని బండి సంజయ్‌కు తెలియందా? ఆ మధ్య ప్రజా సంగ్రామ యాత్రలో ఓసారి ఈ ధరలేంది? అని మహిళలు నిలదీసిన సంఘటన మర్చిపోయారా? ఎంత సేపు ముఖ్యమంత్రి కేసిఆర్‌ కుటుంబ పాలన…అవినీతి పాలన అంటూ చెప్పడం బాగానే వుంది. ఆ పాలనకు ప్రజలు చరమగీతం పాడితే… తెలంగాణ ప్రజలకు బిజేపి ఏం చేయాలనుకుంటుంది? అన్నది చెప్పరా? చెప్పాల్సిన అవసరం లేదా? టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలే బిజేపికి వరాలా? సరే…బిజేపిని ప్రజలు నమ్మి గెలిపిస్తే దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షేమ పధకాల అమలౌతున్న ఆ పధకాలు అమలు చేస్తారా? లేక వదిలేస్తారా? ప్రజలకు వచ్చే ప్రధానమైన అనుమానల్లో ఇవి కూడా వున్నాయి. అసలే రాష్ట్ర్రం అప్పుల్లో వుందంటున్నారు. అప్పులు చేస్తే తప్ప రాష్ట్రానికి పూట గడవడదంటున్నారు. ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్ధితి వుందంటున్నారు. అప్పులు తేకుండా, ఉద్యోగస్తుల జీతాలు ఆపకుండా వుండాలంటే సంక్షేమ పథకాలకు కోత పెడతారా? పెన్షన్లు దేశంలో ఇతర రాష్ట్రాలలో ఇచ్చిన వాటికి సమానం చేస్తారా? వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం లేదా? గత ఎన్నికల్లో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా పాదయాత్ర చేశారు. పనిలో పనిగా నవరత్నాలే తమ మ్యానిఫెస్టో అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. వివిధ రకాల పెన్షన్లు సంఖ్య పెంచుతామన్నారు. ఇచ్చే నగదు కూడా పెంచుతామన్నారు. ఇలా కొత్త కొత్త పథకాలకు శ్రీకారంచుట్టారు. అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కన్నా మెరుగైన పథకాలు అమలు చేస్తామన్నారు. మరి తెలంగాణలో బీజేసీ ఏం చెప్పదల్చుకుంది?

పొరుగున వున్న కర్నాటకలో రైతులకు ఇరవై నాలుగు గంటల కరంటు లేదు. రూ.2116 పెన్షన్‌ లేదు. తెలంగాణలో అమలౌతున్న ఏ ఒక్క పధకం అమలులో లేదు. గురుకులాలు లేవు. ఫీజు రీఎంబర్స్‌ మెంటు లేదు. ఆరోగ్యశ్రీ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో సంక్షేమ పధకాలకు లెక్కే లేదు. మరి వాటన్నింటినీ ఆపకుండా అమలు చేస్తామని, ఇంకా మెరుగైన పధకాలు సృష్టిస్తామని, అమలు చేస్తామని బ్లూ ప్రింట్‌ ఏదైనా ప్రకటిస్తారా? ఎన్నికల నాడు ఏదో తూతూ మంత్రంగా మ్యానిఫెస్టో అని ఏవో నాలుగు ప్రకటించి, గెలిచి తూచ్‌ అంటారా? ఇది కూడా ప్రజల నమ్మకం మీద ఆధారపడి వుంటుంది? ప్లీజ్‌…ప్లీజ్‌ మీద ఆధారపడి సాగేది కాదు…ఆలోచించుకోండి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!