భూ భారతి, సాధాబైనామా దరఖాస్తుల పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
భూ భారతి, సాధాబైనామా దరఖాస్తుల పరిశీలనలో వేగం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మహదేవపూర్ తహసీల్దార్ ను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం మహదేవపూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ భారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిశీలనను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ పాల్గొన్నారు.
సమీక్ష సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి, సాదా బైనామా దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించాలని సూచించారు. ప్రతి దరఖాస్తుపై స్పష్టమైన పరిశీలన నివేదిక ఉండాలని
తిరస్కరణ జరిగితే, సవివరమైన కారణాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు.
పౌరులకు ఇబ్బందులు లేకుండా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, భూ సంబంధిత ప్రజా సేవలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామారావు, నాయబ్ తహశీల్దార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
