భార్యను నరికి చంపిన భర్త
కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను అతి కిరాతరంగా నరికి చంపిన ఘటన మండలంలోని కట్రియాల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…కట్రియాల గ్రామానికి చెందిన చెవ్వల్ల యాదగిరికి గత 24 సంవత్సరాల క్రితం రాయపర్తి మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన మల్లికాంబతో వివాహం జరిగింది. వీరి వైవాహిక జీవితంలో ఇరువురు కుమారులు జన్మించారు. ఈ క్రమంలో భార్యభర్తలిద్దరికి తరచూ కలహాలు రావడంతో మల్లికాంబ తన స్వగ్రామమైన కొత్తూరుకు వెళ్లిపోయి అక్కడే జీవనం సాగిస్తున్నది. ఈ నేపథ్యంలో యాదగిరి మల్లికాంబలకు కలిగిన ఇరువురు కుమారులు పెరిగి పెద్దవారు కావడంతో తల్లిదండ్రులు వివాదాలు పక్కనపెట్టి కలిసి ఉండాలని ఇరు గ్రామాలకు చెందిన పెద్దమనుషులు పంచాయితిలో నిర్ణయించారు. వీరి నిర్ణయం మేరకు గత 8సంవత్సరాలుగా తల్లిగారి ఇంటి వద్దే ఉన్న మల్లికాంబ తిరిగి అత్తగారి గ్రామమైన కట్రియాలకు ఈనెల 16న వచ్చి తన కుటుంబంతో కలిసి ఉంటుంది. అయితే వచ్చిన తర్వాత ఇద్దరు బాగానే ఉన్నప్పటికీ శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3గంటల సమయంలో భర్త యాదగిరి మల్లికాంబ నిద్రిస్తున్న సమయంలో పదునైన ఆయుధంతో ఆమెపై విచక్షణారహితంగా నరకడంతో ఆమే నిద్రిస్తున్న మంచంపైనే మరణించినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలికి ప్రవీన్, ప్రశాంత్ కుమారులు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు స్థానిక ఎసిపి మధుసూధన్, సిఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సంపత్‌లు ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు.