bandedu baram…private chaduvu, బండెడు భారం…ప్రైవేటు చదువు

బండెడు భారం…ప్రైవేటు చదువు

వరంగల్‌ నగరంలోని ప్రైవేట్‌ పాఠశాలల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అధికంగా ఫీజులు వసూలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, టై, బెల్ట్‌, విద్యార్థులకు అవసరమైన సామాగ్రి పాఠశాలలో, పాఠశాల యాజమాన్యం చెప్పిన చోటే విక్రయించాలి లేదంటే అంతే సంగతులు. ఇంత జరుగుతున్న పట్టించుకోవాల్సిన అధికారులు పత్తాలేకుండా పోతున్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా మొత్తంగా కొన్ని వందలకుపైగా ప్రైవేట్‌ పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఫీజులు వేలల్లో వసూలు చేస్తున్నా, నాణ్యమైన విద్యను అందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

పత్తా లేని విద్యాశాఖ అధికారులు

నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ పాఠశాలలు కొనసాగుతున్న విద్యాశాఖ మామూళ్ల మత్తులో ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కొత్తకొత్త పేర్లతో పాఠశాలలను ఏర్పాటు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేస్తున్నారు. విచ్చలవిడిగా ఫీజులు గుంజుతున్న కానీ విద్యాశాఖ అధికారులకు పట్టింపే లేకుండా పోతుంది. జిల్లావ్యాప్తంగా వందల ప్రైవేట్‌ పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఫీజులు మాత్రం వేలల్లో వసూలు చేస్తున్న నాణ్యమైన విద్యను అందించడం లేదన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లలకు నాణ్యమైన విద్య చెప్పించాలని పడుతున్న ఆరాటాన్ని ఆసరా చేసుకొని ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. పెరిగిపోతున్న పోటీ ప్రపంచంలో ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివించేందుకు తల్లిదండ్రులు పోటీపడడమే దీనంతటికీ కారణమని తెలుస్తుంది. కాని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు వసూలు చేస్తున్న ఫీజుల ధరలను చూసి తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు.

పాఠశాలల్లోనే విక్రయాలు

దాదాపు నగరంలో పాఠశాలలోనే పాఠ్యపుస్తకాలతోపాటు విద్యార్థికి అవసరమైన సామాగ్రి విక్రయిస్తున్నారు. మరికొన్ని పాఠశాలలో పాఠశాల యాజమాన్యం చెప్పిన చోటే విద్యార్థికి కావాల్సిన సామాగ్రి, పుస్తకాలు కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టడం జరుగుతున్నా కానీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. విద్యాశాఖ అధికారుల నియంత్రణ లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికభారం పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రతి పాఠశాలలో నోటీసు బోర్టుపై తరగతుల వారిగా ఫీజుల వివరాలను నమోదు చేయాల్సి ఉన్నా అది ఎక్కడ కూడా నమోదు చేయడం లేదు. జీవో నం1 ప్రకారం తల్లిదండ్రుల కమిటీ నిర్ణయించిన ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి. కానీ ఆ పరిస్ధితులు ఎక్కడ కనిపించడం లేదు. విద్యాశాఖ అధికారులు కార్యాలయాలకే పరిమితం కావడం అధికారుల కొరతతో ప్రైవేట్‌ యాజమాన్యం ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండానే పోతుంది. ప్రైవేట్‌ పాఠశాలలో ఏర్పాటుచేసిన కమిటీల సిఫార్సు ప్రకారమే ఫీజుల ధరలను నిర్ణయించాలి. దీనికోసం 2010లో ప్రభుత్వం జీవో నెం42ను తీసుకొచ్చింది. జీవో నెం42ను వ్యతిరేకిస్తూ 2014లో పాఠశాల యాజమాన్యం కోర్టుకు వెళ్లడంతో అర్థాంతరంగా నిలిచిపోయింది. జీవో నెం42 రద్దు చేయాలని ప్రైవేట్‌ పాఠశాలల యజమాన్యాలు డిమాండ్‌ చేస్తూ వస్తున్నాయి. అప్పటినుంచి యాజమాన్యాలు అడ్డుఅదుపు లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాల యాజమన్యాలు యూనియన్లుగా ఏర్పడి అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు.

అమలుకు నోచుకోని విద్యాహక్కు చట్టం

విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే ప్రజల్లో అవగాహన లేకపోవడంతో అధికారులు అమలుచేయడం లేదు. చట్టప్రకారం ప్రతి ప్రైవేట్‌ పాఠశాలలో 25శాతం సీట్లను దారిద్రరేఖకు దిగువన ఉన్న విద్యార్థులకు అందించాలి. కాని ఇప్పటివరకు ఏ ఒక్క పాఠశాల ఉచితంగా సీటును వదులుకోవడం లేదు. అలాగే చట్టప్రకారం అవసరం మేరకు పాఠ్యపుస్తకాలు పిల్లలకు అందించాలి. ప్రజలకు పాలన సమీపంలో ఉన్న నేపథ్యంలోనైనా కలెక్టర్‌ దష్టి సారిస్తే కొంతమేరకైనా ఫీజుల భారం తగ్గుతుందని పలువురు అంటున్నారు.

కనీస వసతులు ప్రమాణాలు లేక పాఠశాల నిర్మాణాలు

పాఠ్యపుస్తకాల విక్రయదారులతో పాఠశాల యాజమాన్యాలు అనుసంధానంగా పుస్తకాల వ్యాపారం నడుస్తుంది. వరంగల్‌ నగరంలో ప్రధానంగా కొన్ని పుస్తక ఏజెన్సీలు ఉన్నాయి. ఆ ఏజెన్సీలు కొన్ని పాఠశాలలను ఎంచుకొని వారికి కొంత నగదు ముందే సమర్పించుకుంటారు. పాఠశాల విద్యార్ధులని బట్టి ముందే డబ్బులు అందచేస్తారు. అక్కడ నుండి మొదలవుతుంది వ్యాపారం. వ్యాపారంలో 40శాతం వరకు పాఠశాల యాజమాన్యాలకు అందచేస్తున్నట్టు సమాచారం. వీరి స్వలాభం కొరకు విద్యార్థుల తల్లితండ్రులపై విపరీతమైన భారం పడుతుందని చెప్పొచ్చు. ఇలా ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసినా కానీ నాణ్యమైన విద్యని అందిస్తారని నమ్మకం కూడా తల్లితండ్రులు కోల్పోతున్నారు అని చెప్పొచ్చు. కొన్ని పాఠశాలల విద్యార్థులకు ఆటస్థలాలు లేకుండా బహుళ అంతస్తులో తరగతులు నడుపుతున్నా కానీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా ఉండటంలో మతలబు ఏంటని తల్లితండ్రులు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఏదైనా అనుకోకుండా అగ్నిప్రమాదం జరిగితే బహుళ అంతస్తులో ఉన్న విద్యార్థులు ఏదైనా ప్రమాదానికి గురైతే భాద్యులు ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనీసం అగ్నిమాపక వాహనం పాఠశాల చుట్టూ తిరగలేని పరిస్థితుల్లో పాఠశాల నిర్మాణానికి అనుమతులు ఎలా ఇస్తున్నారు అని విద్యాశాఖ అధికారులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అడ్డగోలు దోపిడీ….!

ఒకటవ తరగతి పుస్తకాల ఖరీదు 4,800రూపాయలు

కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకొని అడ్డగోలుగా వసూళ్లకు తెగబడుతున్నారు. ఫీజుల భారంతోపాటు పాఠ్యపుస్తకాల కొనుగోలు భారాన్ని మోపుతున్నారు. దీంతో తల్లితండ్రులు లబోదిబోమంటున్నారు. వరంగల్‌ నగరంలోని ఓయాస్సిస్‌ అనే పాఠశాల ఉమ బుక్‌స్టాల్‌తో ఒప్పందం కుదుర్చుకుని, కమిషన్‌లు దండుకుంటూ తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నారు. వీరు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న ధరను చూస్తే గుండెలు గుభేలుమంటాయి. ఒకటవ తరగతికి వీరు అక్షరాల నాలుగువేల ఎనిమిదివందల రూపాయలను వసూలు చేస్తున్నారు. ఇదేంటని తల్లితండ్రులు నిలదీస్తే ఇది ఇంతే. మా దగ్గర తప్ప ఈ పుస్తకాలు ఎక్కడ దొరకవు అంటూ నిర్లక్షపు సమాధానం ఇస్తున్నారట. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసిన ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారట.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *