బిడ్డా.. నేనూ వస్తా.. గర్భశోకం తట్టుకోలేక తల్లి మృతి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: నవమాసాలు మోసి, ప్రేమగా
పెంచుకున్న బిడ్డ మరణాన్ని తట్టుకోలేక, “బిడ్డా నువ్వు లేని ఈ జీవితాన్ని నేను భరించలేను జీవించలేను..” అంటూ విలపిస్తూ తీవ్ర మనోవేదనకు గురైన తల్లి, చివరికి ఆ వేదనను తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్న హృదయ విదారక సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎల్లోయ్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన బోయిని వెంకట్-లావణ్యలకు వైష్ణవి (6) అనే ఒకే పాప ఉంది. అయితే ఆ పాప అనారోగ్యంతో బాధపడుతుండగా మొదట జహీరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలించకపోవడంతో మెరుగైన వైద్యం కోసం రెండు రోజుల క్రితం హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు నిమోనియా నిర్ధారించారు. ఇక పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చిన్నారి వైష్ణవి శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు మృతిని భరించలేక తల్లి లావణ్య తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చివరకు ఆ దుఃఖాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఒకేరోజు తల్లి-బిడ్డ మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు వర్ణించలేని రీతిలో విలపిస్తున్నారు. కాగా గత రాత్రి ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఝరాసంగం ఎస్సె క్రాంతి కుమార్ తెలిపారు.
