atm chorulunnaru, ఏటీఎమ్‌ చోరులున్నారు..

ఏటీఎమ్‌ చోరులున్నారు..

సైబరాబాద్‌ డీసీపీ క్రైమ్స్‌ రోహిణీ ప్రియదర్శిని

బ్యాంకు ఖాతాల నుంచి నగదు కొల్లగొట్టడానికి సైబర్‌ నేరగాళ్లు నయా దారులు వెతుకుతున్నారని సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. సాంకేతికతను వినియోగించుకొని పంజా విసురుతున్నారని, ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఖాతాల్లోంచి వేలాది రూపాయలు ఎగిరిపోతున్నాయని తెలిపారు. ఈ ఘరానా మోసం పేరే ‘స్కిమ్మింగ్‌’ అంటారని చెప్పారు. గతంలో కస్టమర్లకు ఫోన్‌ చేసి బ్యాంక్‌ అధికారులమని నమ్మబలుకుతూ వారి నుంచి ఏటీఎం కార్డు నంబర్‌, పిన్‌ నంబర్‌ తదితర సమాచారాన్ని తెలుసుకొని ఖాతాల నుంచి నగదు కొల్లగొట్టేవారని, బ్యాంకులు ఇలాంటి సైబర్‌ క్రైమ్‌ల పట్ల ఖాతాదారులను అప్రమత్తం చేయడం, వినియోగదారుల్లో అవగాహన కలిగించడంతో మోసగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారని అన్నారు.

ఏమిటీ స్కిమ్మింగ్‌…?

ప్రత్యేక పరికరాలను అమర్చి క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల సమాచారాన్ని తస్కరించడాన్ని ‘స్కిమ్మింగ్‌’ అంటారని, ఇలా కార్డుల సమాచారాన్ని చౌర్యం చేయడానికి ఉపయోగించే పరికరాలను స్కిమ్మర్‌ పరికరాలు అంటారని తెలిపారు. ఎంపిక చేసుకున్న ఏటీఎంలలో మోసగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా వీటిని అమరుస్తారని, కస్టమర్లు ఏటీఎం ద్వారా నగదు తీసుకునేందుకు కార్డును స్వైప్‌ చేసినప్పుడు, కార్డు మ్యాగ్నటిక్‌ స్ట్రిప్‌లోని సమాచారం, పిన్‌ నంబర్‌ స్కిమ్మర్‌ సంగ్రహిస్తుందని తెలిపారు. సేకరించిన సమాచారంతో మోసగాళ్లు ఆ తర్వాత నగదు ఉపసంహరిస్తున్నారని అన్నారు. దీని కోసం కూడా పలు దారులు ఎంచుకుంటున్నారని, ప్రధానంగా నకిలీ కార్డులను తయారుచేసి సుదూర ప్రాంతాల్లోని ఏటీఎంల ద్వారా నగదు తస్కరిస్తున్నారని పేర్కొన్నారు.

మనమేం చేయాలి..

ఏటీఎంలో కార్డు రీడర్‌పై స్కిమ్మర్లను అమరుస్తారని, దీంతోపాటు ఏటీఎం పిన్‌ తెలుసుకోడానికి కీప్యాడ్‌కు వ్యతిరేకంగా పైభాగంలో చిన్న కెమెరాతో కూడిన స్కానర్‌ను కూడా ఉంచుతారని, ఏటీఎంలకు వెళ్లినప్పుడు ఇలాంటి పరికరాలు ఏవైనా ఉన్నాయో పరిశీలించడం ఉత్తమని తెలిపారు. నగర శివార్లలో ఉండే, జనసంచారం ఎక్కువగా లేని, సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలకు వెళ్లకపోవడం మంచిదని సూచించారు. పిన్‌ టైప్‌ చేసేటప్పుడు అరచెయ్యి అడ్డుపెట్టుకోవడం సురక్షితమని, నగదు విత్‌డ్రా చేయగానే మొబైల్‌కు మెసేజ్‌లు వచ్చేలా ఎస్‌ఎమ్‌ఎస్‌ అలర్ట్‌లు పెట్టుకోవాలని వివరించారు. చాలా మంది కస్టమర్లు ఫోన్‌ నంబర్లను మార్చేసినా..ఆ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలిపే విషయంలో నిర్లక్ష్యం వహిస్తారని, ఫోన్‌ నంబరు మార్చితే తక్షణమే బ్యాంకు ఖాతాకు కొత్త నెంబరును అనుసంధానం చేసుకోవడం మరచిపోవద్దుని తెలిపారు. మన ఖాతా నుంచి మన ప్రమేయం లేకుండానే నగదు ఉపసంహరణ జరిగినట్లు గుర్తిస్తే వెంటనే కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి ఏటీఎం సేవలను స్తంభింప చేసుకోవాలని చెప్పారు. వెంటనే సంబంధిత సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!