asathya pracharalu cheste kesule, అసత్య ప్రచారాలు చేస్తే కేసులే

అసత్య ప్రచారాలు చేస్తే కేసులే

– రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌

సోషల్‌ మీడియాలో ఇవిఎంల గురించి అసత్య ప్రచారాలు చేస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ హెచ్చరించారు. గత కొద్దికాలంగా ఇవిఎంలపై సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న విషయాలను ఆయన ఖండించారు. ప్రజాస్వామిక స్ఫూర్తికి విఘాతం కలిగేలా కొందరు సోషల్‌ మీడియాలో ఈసీపై దుష్ప్రచారం చేస్తున్నారని రజత్‌కుమార్‌ మండిపడ్డారు. పోలింగ్‌ శాతాలతోపాటు పలుచోట్ల ఇవిఎంల తరలింపు తదితర అంశాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నట్టు స్పష్టం చేశారు. పోలింగ్‌ పూర్తయిన వెంటనే సాయంత్రం 5గంటలకు అంచనా వివరాలు ఇస్తామని.. తర్వాతి రోజు మాత్రమే పోలింగ్‌ శాతాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వగలమని పేర్కొన్నారు. పోలింగ్‌ ముగిసే ముందు ఫారం 17సీ కాపీలు పోలింగ్‌ ఏజెంట్లకు అందిస్తామని..దానిపై వాళ్ల సంతకాలు సైతం ఉంటాయని అన్నారు. ఫారం 17ఏ, ఫారం 17సీని సరిచూసుకున్న తర్వాత కూడా అనవసర రాద్ధాంతం చేయడం తగదని అన్నారు. జగిత్యాలలో ఆటోలో తరలించిన ఇవిఎంలు శిక్షణ కోసం వినియోగించినవేనని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కల్పిత కథనాల వల్ల ప్రతిఒక్కరికీ అనుమానాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఇవిఎంలు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌లో ఫొటోలు తీసుకున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఆ వ్యక్తిపై న్యాయ విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *