అమాయకుల భూముల కొల్లగొడుతున్న ఆ నలుగురు కార్పోరేటర్లు
మీ సొంత స్థలంలో మీరు ప్రహారీగోడ కట్టుకున్న కూల్చేస్తారు…సెటిల్మెంట్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తారు…మా డివిజన్ కార్పోరేటర్ అయితే బెటర్ అని సలహా ఇస్తారు…తీరా కార్పోరేటర్ దగ్గరకు వెళ్తే ప్రహారీగోడ కూల్చిన గ్యాంగ్, కార్పోరేటర్ ఒక్కటేనని బాధితులకు బోధపడుతుంది. ల్యాండ్ కావాలంటే ఫిప్టీ..ఫిఫ్టీ మంత్రం ఉత్తమమని బెదిరిస్తారు. వినకుంటే ఏమవుతుందో అర్థమయ్యేలా విడమరచి చెప్తారు. ఉత్తపుణ్యానికి సగం భూమిని మింగేసి స్థల యజమానులకు చుక్కలు చూపిస్తారు. వరంగల్ తూర్పు 8,18,21,23వ డివిజన్లలో నలుగురు కార్పోరేటర్లు ఆడుతున్న భూసెటిల్మెంట్ ఆట ఇది. ఇలాగే ఉత్తపుణ్యానికి భూమిని కోల్పోయిన ఓ బాధితుడు ‘నేటిధాత్రి’ ని సంప్రదిస్తే ఈ కార్పోరేటర్ల తతంగం అంతా బయటపడింది.