aa ci anthe…maradata…,ఆ సీఐ అంతే…మారదట…!

ఆ సీఐ అంతే…మారదట…!

ధర్మసాగర్‌ సీఐ శ్రీలక్ష్మి పేరు చెపితేనే సర్కిల్‌ పరిధిలోని ప్రజలు అమ్మో…అంటున్నారు. సమస్య ఏదైనా ఉంటే పరిష్కారానికి వెళితే చేయి తడపందే పని పూర్తికాదని, అడిగింది సమర్పించుకుంటే మనవైపు ఎంత న్యాయం ఉన్నా కేసు రివర్స్‌ అయిపోతుందని అంటున్నారు. ధర్మసాగర్‌లో సీఐగా వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతిపనికి రేటు కట్టి దండుకోవడం తప్ప బాధితులకు న్యాయం చేసిన పాపానపోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. స్టేషన్‌ గడప తొక్కితే చాలు ఖర్చు కావాల్సిందేనని పైసలు ముట్టజెప్పనిదే ఏ పనికాదంటున్నారు. ధర్మసాగర్‌, రాంపూర్‌ తదితర ప్రాంతాలలో భూముల ధరలు అధికంగా ఉండడం, భూతగాదాలు, భూకబ్జాలు సైతం అదే స్థాయిలో ఉండడంతో తనకు అవసరం లేకున్నా సీఐ శ్రీలక్ష్మి సివిల్‌ మ్యాటర్‌ అని తెలసి కూడా కలుగజేసుకుంటుందని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల వద్ద గొడవలతో స్టేషన్‌కు వెళితే ఇదే అదనుగా భావించి ఎవరు అసలు హక్కుదారులో, ఎవరు కబ్జాకోరల్లో గుర్తించకుండా డబ్బులు ఎవరు ఎక్కువగా ఇస్తే వారివైపే సీఐ మొగ్గుచూపుతుందని, దీంతో ధర్మసాగర్‌ సర్కిల్‌ పరిధిలో అమాయకులు అనేకమంది చుక్కలు చూస్తున్నారని వారు అంటున్నారు.

పోలీసు ఉన్నతాధికారులకు పట్టదా…?

ధర్మసాగర్‌ సీఐ శ్రీలక్ష్మి ఇంతా చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు మాత్రం తమకేం తెలియనట్లుగానే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. రాంపూర్‌ భూవివాదం విషయంలో బాధితులు 2018 సంవత్సరంలో పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అసలు హక్కుదారులం మేమేనని మొరపెట్టుకున్నారు. అయిన ఎవరు స్పందించలేదు. సమస్య పరిష్కారం చేసేందుకు చొరవ చూపలేదని తెలిసింది. సీఐ శ్రీలక్ష్మి విషయంలో సైతం కమిషనర్‌కు ఫిర్యాదులు బాగానే వెళ్లాయట. కానీ సీఐపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని ధర్మసాగర్‌ సర్కిల్‌ పరిధిలో ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం రాజకీయ ఒత్తిళ్లు అనే అనుమానం సైతం కలుగుతుంది.

సీఐకి బదిలీ ఉండదా…?

ధర్మసాగర్‌లో సీఐ శ్రీలక్ష్మి బాధ్యతలు స్వీకరించి మూడు సంవత్సరాలు అవుతున్నా ఉన్నతాధికారులు బదిలీ చేయడానికి సాహసం చేయడం లేదని తెలిసింది. రెండు సంవత్సరాలకే లాంగ్‌ స్టాండింగ్‌ పేరుతో బదిలీ చేయడం, పోస్టింగ్‌ లేకుంటే అటాచ్‌లో ఉంచడం కమిషనరేట్‌ పరిధిలో జరుగుతుంది. కానీ అందుకు విరుద్ధంగా సీఐ శ్రీలక్ష్మిని 3సంవత్సరాలు గడిచినా అధికారులు బదిలీ చేయడం లేదు. అయితే భూవివాదాలు, ఇతర గొడవల్లో చేతివాటం ప్రదర్శించి బాధితులను ముప్పుతిప్పలు పెట్టే సీఐ శ్రీలక్ష్మి తనకు బదిలీ అయితే తిరిగి స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ పరిధిలోనే ఉండాలని అనుకుంటుందట. నిజానికి ఒక నియోజకవర్గంలోని స్టేషన్‌లో విధులు నిర్వర్తించాక అదే నియోజకవర్గంలోని వేరే పోలీస్‌స్టేషన్‌కు బదిలీ ఉండదని అంటున్నారు. సీఐ శ్రీలక్ష్మి మాత్రం తాను స్టేషన్‌ ఘన్‌పూర్‌ పట్టణ సీఐగా వెళ్తానంటూ ఉత్సాహం ప్రదర్శిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్థానిక ఎమ్మెల్యే అండతో రెండునెలల క్రితమే ఎమ్మెల్యే విల్లింగ్‌ లెటర్‌ సంపాదించినట్లు తెలిసింది. నిజానికి శ్రీలక్ష్మి ఉన్నతాధికారులను సైతం పట్టించుకోకుండా తన ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి స్థానిక ఎమ్మెల్యే కారణమని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

కమిషనర్‌ సాబ్‌ జర దేఖో

భూముల విషయంలో అతిగా వ్యవహరిస్తూ సివిల్‌ మ్యాటర్‌లో వేలు పెడుతున్న ధర్మసాగర్‌ సీఐ శ్రీలక్ష్మి వ్యవహారాన్ని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పరిశీలించాలని రాంపూర్‌ భూబాధితులు కోరుతున్నారు. గతంలోనే తాము కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని గుర్తుచేస్తున్నారు. అసలు హక్కుదారులైన తమను మానసిక వేధింపులకు గురిచేస్తున్న సీఐపై చర్యలు తీసుకోవాలని, తమ సమస్య పరిష్కారం చేయాలని వేడుకుంటున్నారు. కబ్జాదారుల ఆట కట్టించి తమను ఆదుకోవాలంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *