అవకతవకలు సరిదిద్దాలంటే రీ సర్వే అవసరమే

 

సంక్షేమం పథకాలకు ఒక పరమితి ఉండాలి

సంక్షేమం అభివృద్ధి సమతుల్యంగా సాగాలి

ఒక వర్గానికి మోదం మరో వర్గానికి ఖేదం కారాదు

రైతుబంధును సంస్కరించాల్సిందే

రైతుభరోసాలో మార్పులు తేవడమే ఉత్తమం

అమలు ఒకరికోసం…లబ్ది మరొకరికి అయితే ఎలా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రైతు భరోసాను అమలు చేయకుండా రీ సర్వే పేరుతో రేవంత్‌ ప్రభుత్వం కాలయాపనకు పాల్పడుతోందని, చిత్తశుద్ధి వుంటే షరతుల్లేకుండా రైతు భరోసాను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర మంత్రి డిమాండ్‌ చేయడం ఆశ్చర్యంగా వుంది. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో అవకవకల కారణంగా రైతులు నానా ఇబ్బందులు ఎ దుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రభుత్వం దగ్గర రైతుకూలీలు, కౌలు రైతులు, భూ యజమానుల జాబితాలు వున్నాయి కనుక దాని ప్రకారం అమలు జరపాలన్నది ఆయన డిమాండ్‌. నిజానికి, రైతుబంధు నిధులు భూయజమానుల ఖాతాల్లో పడ్డాయికాని అసలైన భూమిని దున్నే వారికి అందలేదన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, వీటిని సరిచేయకుండా ముందుకు పో కూడదన్న ఉద్దేశంతో రేవంత్‌ ప్రభుత్వం రీ సర్వే అంటోంది. దీనికి కొంత సమయం పట్టక తప్పదు. ఇప్పటికే ధరణిలో పేర్లు తప్పులు, ఇతరత్రా పొరపాట్ల కారణంగా నానా ఇబ్బందులు పడటమే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులకు తక్షణ పరిష్కారం కింద కాంగ్రెస్‌ ప్రభుత్వ భూభారతిని అమల్లోకి తెస్తోంది. నాలాలు, కొండలు, గుట్టలు కూడా యదేచ్ఛగా ధరణిలో చేర్చడంతో ఏర్పడిన అయోమయాన్ని సరిదిద్దాలన్నా ఇది తప్పదు. భౌతిక రికార్డులకు, ధరణి డిజిటల్‌ రికార్డులకు పొంతన లేకపోవడం రైతుబంధు అమలుకు మరో పెద్ద అడ్డంకి.బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం గంపగుత్తగా రైతుబంధును అమలు చేయడంతో, ధనిక రైతులు, భూమిన సాగు చేయనివారు లబ్దిపొందిన మాట వాస్తవం. అప్పటి ప్రభుత్వం గణాంకాలతో అధికశాతం చిన్న సన్నకారు రైతులు ప్రయోజనం పొందారని ప్రచారం చేసుకున్నా, పెద్ద రైతుల సంఖ్య తక్కువ గావుండటం వల్ల ఆ గణాంకాల్లో వారి సంఖ్య చాలా తక్కువగానే వుంటుంది మరి. ఇప్పుడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేస్తున్న డిమాండ్‌ ప్రకారం, ఇప్పటికే అభాసుపాలైన విధానంలోనే రైతుబంధు/రైతు భరోసా నిధులను జమచేయాలని కోరడంలో రాజకీయం తప్ప మరోటి లేదు. ఆయన వాదన ప్రకారం అన్ని రికార్డులు, వివరాలు సక్రమంగా వుంటే నిధుల జమలో ఇన్ని సమస్యలు వచ్చివుండేవి కావు.

భూముల సమగ్ర సర్వే చేపట్టకుండానే ధరణి పోర్టల్‌లో రెవెన్యూ రికార్డులను డిజిటలైజ్‌ చేస్తూ వచ్చారని, ఫలితంగా చాలామంది భూయజమానులైన రైతుల పేర్లు పోర్టల్‌లో కనిపించడం లేదన్న ఆరోపణలు బలంగా వచ్చాయి. దీనివల్ల రైతుబంధుకు అర్హులైన రైతులకు రైతుబంధు మొత్తం వారి ఖాతాల్లో జమకాలేదు. మరికొంతమంది రైతులు ధరణి రాకముందే తమ భూములనుతనఖాకు పెట్టిన సందర్భాలున్నాయి. వీరు రుణాలు చెల్లించిన తర్వాత ధరణి పోర్టల్‌లోని పొర పాట్ల కారణంగా తమకు పాస్‌పుస్తకాలు రావడంలేదని లబోదిబోమంటున్నారు. ఇన్ని సమస్యల నేపథ్యంలో ప్రస్తుతం రైతులు భూభారతి పోర్టల్‌లోనైనా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుంద అని ఎదురుచూస్తున్నారు.

బౌతికంగా వున్న రికార్డులకు, డిజిటల్‌ రూపంలో ధరణిలో పేర్కొన్న రికార్డులకు అసలు పొంతనే లేదు. కొన్ని దశాబ్దాలుగా రైతులు దున్నుకుంటున్న భూములను నిషేధిత జాబితాలో చేర్చారు దీంతో ఆ భూ యజమానులు అయోమయంలో పడటమే కాదు, తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితికి లోనయ్యారు. నిషేధిత జాబితాలో చేర్చడంతో అత్యవసర పరిస్థితుల్లో తమ భూములను అమ్ముకోవడానికి వీల్లేకుండా పోయింది. సమస్యను నియమిత కా లావధిలో పరిష్కరించే యంత్రాంగం లేకపోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసిందిఫలితంగా రెవెన్యూ అధికారి స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు ధరణి పుణ్యమాని కోర్టుల్లో మూలుగుతున్నాయి. నిరుపేద రైతులు తమ సమస్యలను వినిపించుకునే అవకాశమే లేకుండా పో యింది. ఈ నేపథ్యంలోనే ధరణి కారణంగా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారంగా కొత్త ప్రభుత్వం భూభారతి పేరుతో కొత్తచట్టాన్ని రూపొందించింది. వ్యవసాయేతర భూములను కూడా ఈ చట్ట పరిధిలోకి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకురావడమే కాదు, సమస్యలు ఉత్పన్నమైతే దాన్ని పరిష్కరించేందుకు ఒక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసింది.

ఈ నేపథ్యంలోనే రేవంత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం, ప్రస్తుతం అమల్లో ఉన్న రైతుబంధుస్థానంలో రైతుభరోసాను అమల్లోకి తేవాలన్న యత్నాల్లో వుంది. గతంలో రైతుబంధుపై పలు ఆరోపణలు వచ్చాయి. నిజంగా భూమిని దున్నే వారికి రైతుబంధు సహాయం అందడంలేదనేని ప్రధాన ఆరోపణ. ఇందుకు ప్రధాన కారణం పట్టేదారు కాలంలో ఎవరి పేరుంటే వారిపేర్న రైతు బంధు నిధులను గత ప్రభుత్వం జమచేస్తూ వచ్చింది. విచిత్రమేంటంటే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో పొలాల కొనుగోళ్లు సాదా బైనామాలపై చేయడంవల్ల పట్టేదారు కాలంలో పాత యజమానుల పేర్లే వుండటం కూడా ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం వీటిని సరిదిద్దేందుకు ‘ధరణి’ పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్‌ ద్వారా అసలు భూయజమానులకు పాస్‌పుస్తకాలు ఇవ్వడం, మొత్తం రికార్డులను డిజిటలైజ్‌ చేసినట్లయితే సమస్య పరిష్కారమవుతుందని ప్రభుత్వం భావించింది. కానీ ప్రభుత్వం అనుకున్నదొకటి, క్షేత్రస్థాయిలో జరిగింది మరొకటి. సిబ్బంది చేసిన పొరపాట్లు చాలామంది రైతులకు గ్రహపాటుగా మారడంతోపాటు, అవినీతి పేట్రేగిపోవడంతో ప్రభుత్వ భూములు, అటవీ భూములు కూడా పట్టాభూములుగా మారిపోయాయి. ఏతావాతా తేలిందేమంటే, అసలు భౌతిక రికార్డులకు, ధరణిలో నమోదైన డిజిటల్‌ రి కార్డులకు పొంతన లేకపోవడంతో ఈ మొత్తం పెద్ద ప్రహసనంగా మారింది. ఇందులో బాగా నష్టపోయింది సన్న, చిన్నకారు రైతులు, మరోవైపు ప్రభుత్వం. అట్లాగని ధరణి పోర్టల్‌వల్ల అంతా నష్టమే జరిగిందనుకోవడం కూడా పొరపాటే. భౌతిక, డిజిటల్‌ రికార్డుల్లో తేడాలు ఇతరత్రా సమస్యల కారణంగా ప్రస్తుత ప్రభుత్వం రైతుబంధు కింద జమ చేసామని చెబుతున్నా కొంతమంది అసలైన రైతులకు ఈ మొత్తం జమ కాకపోవడం కూడా జరిగివుండవచ్చు. ధరణిలో నమోదు చేసినవారు తెలిసో తెలియకో లేక పొరపాటునో కొంతమంది రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చడం కూడా సమస్యలను తెచ్చిపెట్టింది. ధరణి పుణ్యమాని గ్రామాల్లో రైతులు తమ వ్యవసాయ పనులు మానేసి కలెక్టర్‌ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. మరి ఈ తప్పుల తడకలన్నీ ఎట్లా సరిదిద్దాలి? ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం రీసర్వే చేసి కరెక్టు రికార్డులను తయారు చేయాలనుకోవడంలో తప్పులేదు. కానీ దీనికి పట్టే కాలమెంత? ఇదికూడా సక్రమంగా జరుగుతుందని గ్యారంటీ ఏమిటి? అనే సందేహాలు వ్యక్తం కావడం సహజం. ఇది ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయడంపై ఆధారపడివుంటుంది. ఇదిలావుండగా ప్రస్తుత ప్రభుత్వం రైతుభరోసాకుఅందించే సహాయంపై కొన్ని నిబంధనలను విధించాలని యోచిస్తోంది. ముఖ్యంగా రైతుభరోసా పంపిణీ 5`10 ఎకరాల వరకు పరిమితి విధించే అవకాశాలున్నాయి. ఇది సరైన చర్యే. ఎందు కంటే నిజంగా పెట్టుబడి సహాయం కావలసింది ఇటువంటి చిన్న రైతులకు మాత్రమే! అయాచి తంగా కేవలం భూయజమానులైనంత మాత్రంచేత రైతుబంధు సహాయం అందుకున్న పెద్ద రైతులకు ఇది శారాఘాతమే అవుతుంది!

ఇక్కడ మరొక విషయం గుర్తించాలి. సంక్షేమం పేరుతో విచ్చలవిడిగా పన్ను చెల్లింపుదార్ల ధనా న్ని ఖర్చు చేయడం ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం కిందికే వస్తుంది. తాము అధికారంలో వుండా లన్న స్వార్థంతో ప్రజాధనాన్ని హద్దూపద్దూ లేకుండా ఇచ్చిన సంక్షేమ హామీలకు అదీ కొన్ని వ ర్గాలకు మాత్రమే ప్రయోజనం కలిగించేలా ప్రకటించడం తగనిపని. సంక్షేమం అభివృద్ధి సమతు ల్యంగా సాగాలి తప్ప ఒక వర్గానికి ఖేదం, మరొక వర్గానికి మోదం అన్న రీతిలో వుండకూడదు. అటువంటి సంక్షేమ పథకాల్లో రైతుబంధు కూడా ఒకటి. కానీ ఇది అందాల్సింది ఒకరికి, అందింది మరొకరికి అన్న చందంగా తయారైంది. సంక్షేమానికి ఒక పరిమితి వుండాలి. తలకుమించిన భారం కాకూడదు. ఉదాహరణకు కర్ణాటక ప్రభుత్వాన్ని తీసుకుంటే మహిళలకు ఉచితబస్సు ప్రయాణం పథకం ఇప్పుడు పెద్ద గుదిబండగా మారింది. ఏకంగా అక్కడి ఆర్టీసీకి వెయ్యికోట్లు నష్టం వచ్చి, నిర్వహణ, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. చివరకు మహిళలు కూడా తాము టిక్కెట్లు తీసుకునే ప్రయాణిస్తామన్నా, ప్రభుత్వం మాత్రం రివ్యూ సమావేశం నిర్వహించి, ఏకంగా బస్సు టిక్కెట్‌ చార్జీలను పదిహేనుశాతం పెంచింది. ఇప్పుడు బస్సుల్లో టిక్కె ట్లు కొని ప్రయాణించేవారు లబోదిబో మంటున్నారు. ఇదెక్కడి న్యాయం? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న మన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి రాకూడదనేంలేదు. మితిమీరిన సంక్షేమం తెచ్చిన తిప్పలుకు ఇదొక ఉదాహరణ. సరిదిద్దకుండా రైతుబంధును కూడా విచ్చలవిడిగా అమలు చేస్తే ప్రభుత్వం దివాలా తీయడం ఖాయం. అధికారంలోని పార్టీలు తమ రాజకీయ స్వార్థం కోసం పన్నుచెల్లింపుదార్ల ధనాన్ని ఓట్లుసంపాదించి పెడుతుందని భావించిన ప్రతిదానికి సంక్షేమం పేరుతో ప్రకటిస్తూ పోతే, మిగిలిన వర్గాల పరిస్థితేంటి? అందువల్ల రైతుభరోసా అమలులో పరిమితులు విధించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావించడం సహేతుకమే! దీనిపై విపక్షాలు ఎంత రాజకీయం చేయాలనుకున్నా, ప్రజలు గతంలో మాదిరిగాలేరన్న సత్యాన్నిగుర్తుంచుకోవాలి. వారికి ఏది మంచో, ఏది చెడో బాగా తెలుసు. ఓట్ల రూపంలో కీలెరిగి వాతపెట్టక మానరు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!