కేసీఆర్ బస్సు యాత్రపై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రపై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు స్పందించారు. గురువారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్లు కేసీఆర్ బస్సు యాత్ర విమర్శించారు. పదేళ్ల పాపాలకు ప్రాయశ్చిత్తంగా కేసీఆర్ ఇప్పుడు ప్రజల దగ్గరకు వస్తున్నాడని ఎద్దేవా చేశారు. ముందు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి బస్సు ఎక్కాలని ఆయన కేసీఆర్ కు సలహానిచ్చారు. అధికారం మదంతో ప్రగతి భవన్, ఫామ్ హౌస్ గేట్లు దాటనందుకు చేతులు జోడించి తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, సబ్బండ వర్గాలను మోసం చేసినందుకు ముందు వారి పాదాల మీద పడాలని కోరారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు తప్ప పదేళ్లలో ఏనాడు జిల్లా పర్యటనలకు వెళ్ళని కేసీఆర్ కు ఇప్పుడు జనం గుర్తుకు వచ్చారా అంటూ నిలదీశారు. ఓట్లతో జనం వాతలు పెడితే తప్ప తెలంగాణ ప్రజలు యాదికి రాలేదని విమర్శించారు. ఓడించి ఇంట్లో కూర్చోబెడితే తప్ప సమస్యలు కళ్లకు కనిపించలేదా అని అడిగారు. ప్రజా పాలన చూసి ఓర్వలేక జనాన్ని రెచ్చగొట్టడానికి చేతి కర్ర పట్టుకుని మరీ బస్సు ఎక్కుతున్నావా కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. అమలవుతున్న గ్యారంటీలు, నిమిషం కూడా పోనీ కరెంటు, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న తెలంగాణ ఆడబిడ్డలను నీ కళ్ళతో చూడు కేసీఆర్ అంటూ సలహానిచ్చారు. రూ.500 లకు గ్యాస్ సిలిండర్, 200 ల యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, కళకళలాడుతున్న స్వయం సహాయక మహిళలను పలకరించాలని కోరారు. నీ పదేళ్ల కాలంలో రుణమాఫీ కానీ రైతులతో మాట్లాడాలన్నారు. పదేళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఎదురుచూసిన జనాన్ని కలువాలన్నారు. దళిత బంధు పేరుతో దగా చేసిన దళిత బిడ్డలను పలుకరించాలని, బీసీ బందు అంటూ పచ్చి మోసం చేసిన బడుగు, బలహీన వర్గాలతో మాట్లాడాలని, గొర్రెల పేరుతో మోసం చేసిన యాదవ సోదరులను, చేపల పేరుతో దగా చేసిన బెస్త, ముదిరాజ్ బిడ్డలను పలుకరించాలన్నారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ రాని విద్యార్థులు, ఉద్యోగాలు రాని నిరుద్యోగులను కలువాలని, కూలిన మేడిగడ్డను చూడాలని, అవినీతి కంపు కొడుతున్న మిషన్ భగీరథ నీళ్లు తాగాలని, తెలంగాణ ప్రజలకు కూతురు లిక్కర్ స్టోరీ చెప్పాలని, కొడుకు ట్యాపింగ్ కథలు వినిపించాలని, అలాగే అల్లుడు ఫామ్ హౌస్, సంతోష్ కబ్జా వ్యవహారాలు మీ గులాబీ పార్టీ నాయకుల అక్రమాలను బస్సు యాత్రలో వివరించాలన్నారు. తెలంగాణలో ఉనికి కాపాడుకోవడానికి కపట బుద్ధితో యాత్ర అంటూ బయలుదేరుతావా అంటూ నిలదీశారు. సచ్చిన పార్టీని బతికించుకోవడానికే ఈ ఆరాటం అంటూ వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఒకటో, అరో సీట్లు గెలుచుకోవడానికే ఈ బస్సు బయలుదేరిందని తెలంగాణ జనానికి తెలుసన్నారు. కేసీఆర్ బస్సులో మాత్రం కాషాయం, పైకి మాత్రం గులాబీ రంగని, ఆయనవి ఊసరవెల్లి రాజకీయాలని దుయ్యబట్టారు. బిజెపితో కుమ్మక్కై కాంగ్రెస్ ను ఓడించాలన్నదే కేసీఆర్ ఆరాటమని, కేసీఆర్, మోదీ తెరచాటు రాజకీయాలు తెలంగాణ ప్రజలకు బాగా తెలుసన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి..వాత పెట్టిన సిగ్గు రాలేదన్నారు. కేసీఆర్ బస్సు టైర్లకు జనం పంక్చర్ చేసి పంపిస్తారు జాగ్రత్త అని హెచ్చరించారు. నీ కారును అసెంబ్లీ ఎన్నికల్లో జనం షెడ్డుకు పంపించింది మర్చిపోవద్దన్నారు. గులాబీ, కమలం బస్సు యాత్ర పైన జనం రాళ్లు వేయకుండా చూసుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంందించారు. ఎంపీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ గేట్ కూడా దాటడన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు కాంగ్రెస్ కుటుంబ సైనికులు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు.
వంద ఎలుకలు తిన్న పిల్లి..తీర్థయాత్రలకు వెళ్లినట్లుంది
