పలిమెల మండలంలో కనిపించని పాఠశాల ప్రారంభ సందడి.
మండలంలో పలుచోట్ల ప్రారంభానికి నోచుకోని పాఠశాలలు.?
అనేక పాఠశాలల్లో కొనసాగుతున్న మరమ్మత్తు పనులు.
ఉమ్మడి మండలంలో నామమాత్రంగా బడిబాట, కొత్త అడ్మిషన్లది ఊసెలెదు.
పాఠశాల ప్రారంభం ఆనందపడాల్సిన రోజు నిర్వీర్యంగా పాఠశాలలు.
స్వయం సేవక సంఘాల పని శభాష్, సమయానికి ముందే యూనిఫామ్ లు రెడీ, 15 పాఠశాలలకు యూనిఫాంలో పంపి.
బదిలీల ప్రక్రియ ప్రారంభం కావడంతో మరిన్ని తిప్పలు.
ప్రభుత్వ పాఠశాలలు దీనస్థితికి కారణం అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే, నేటి పరిస్థితులే సాక్ష్యం.
మహాదేవపూర్- నేటి ధాత్రి:
ప్రభుత్వ పాఠశాల తోపాటు ప్రైవేట్ పాఠశాల ప్రారంభానికి బడిగంట మోగింది, కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం పాఠశాలల పరిస్థితులు ఇక్కడ వేసిన గొంగడి అక్కడే, మహదేవ్పూర్ మండలంలో 41 ప్రభుత్వ ప్రైమరీ ఉన్నత పాఠశాలలు ఉండగా ప్రారంభ దినోత్సవం రోజు మాత్రం ఇక్కడ కూడా విద్యార్థులతో పాఠశాల విద్య పండుగ వాతావరణాన్ని కనపరచలేకపోయింది. పాలిమేల మండల విషయానికి వస్తే అటవీ ప్రాంతం కావడంతో పలు పాఠశాలలు విద్యార్థులు లేక మూగబోవడమే కాకుండా మహాదేవపూర్ పలిమెల మండలాల్లోని పలు పాఠశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా దుమ్మా కొట్టడం జరిగిందని సమాచారం. మండలంలో ప్రైవేటు పాఠశాలలు మాత్రం విద్యార్థుల పట్ల అనేక శ్రద్ధ వహిస్తూ సుమారు గత నెల నుండి ఇంటింటా ప్రచారాలు నిర్వహించి కొత్త విద్యార్థుల సేకరణలో నిమగ్నం కావడం జరిగింది. కానీ బడిబాట కార్యక్రమం విషయానికొస్తే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు నామమాత్రంగా బడిబాట నిర్వహించి సమయాన్ని పాటిస్తూ కేవలం పని దినంలోనే బడిబాటకు ప్రాధాన్యత ఇస్తూ అక్కడక్కడ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
ఉమ్మడి మండలంలోని పలిమెల అటవీ ప్రాంతం కావడంతో బడిబాటకు సంబంధించిన కార్యక్రమం చేపట్టడం జరిగిందా అనేది ఇప్పటివరకు గ్రామాల్లో ప్రజల వద్ద అయితే ఇలాంటి సమాధానం లేదు, బడిబాట అని అడుగుతే అదేమిటి అని ప్రశ్నించే పరిస్థితి పలిమెల మండల ప్రజల్లో రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విద్యాధికారులు మారుమూల ప్రాంతాల పాఠశాలలకు సంబంధించి విద్యార్థులకు విద్య అందించే విషయం, పాఠశాలల్లో మౌలిక వసతులకు సంబంధించి దృష్టి సాధించకపోవడం, ప్రత్యేకంగా ఉపాధ్యాయులు స్థానికంగా ఉండకుండా, పట్టణాల నుండి రాకపోకలు నిర్వహించడం లాంటి అనేక వ్యవహారాలు మారుమూల ప్రాంతాల పేద విద్యార్థులకు విద్య నుండి దూరం చేయడం జరుగుతుందని స్పష్టంగా కనబడుతుంది.
పాఠశాల ప్రారంభం అంటే సరస్వతీ తల్లికి స్వాగతం పలకడం అని అనేక ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు స్వాగతం సరస్వతీ తల్లి ఆశీర్వాదం లాంటి కార్యక్రమాలను ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు కూడా చేపట్టడం జరుగుతుంది. కానీ మహదేవ్పూర్ ఉమ్మడి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు సరస్వతీ తల్లి విద్యపై ఇలాంటి శ్రద్ధ లేనట్టుగా కనపడుతుంది అని చెప్పడానికి అనేక సాక్షాలు నేడు తెరపైకి రావడం జరిగింది. ఈ పాఠశాలలో చూసిన ఐదు నుండి 10 విద్యార్థులు పాఠశాల ప్రారంభం రోజు హాజరు కావడం, ఉపాధ్యాయులు కొత్త విద్యార్థుల వేటకు సంబంధించి ప్రణాళిక చేయడం లాంటివి కాకుండా, తమ ఇండ్లకు ఎలా చేరుతాము అని శ్రద్ధ ఎక్కువగా కనబడడం ఉపాధ్యాయులంతా తమ సెల్ ఫోన్లలో బిజీగా ఉండి ఒకరికొకరు పాఠశాల ప్రారంభ దినోత్సవం ఎలా ఉంది అని చెప్పుకోవడంలో నిమగ్నం కావడం గమనార్ధం.
పాఠశాల ప్రారంభం అంటే విద్యార్థులతో కలకలలాడి పాఠశాలలు ముస్తాబై ఉపాధ్యాయులు నూతన వస్త్రాలు ధరించి సరస్వతీ తల్లికి స్వాగతం పలికే రోజు పాఠశాలలు ఎంతో ఆనంద ఉత్సాహాలతో సందడి వాతావరణాన్ని నెలకొల్పే రోజు, కానీ ఉమ్మడి మండలంలో ఏ పాఠశాల చూసిన కనీసం పాఠశాలను శుభ్రపరచి ఉన్న పరిస్థితులు కూడా లేకపోవడం, పాఠశాల ప్రారంభం రోజు మోగిన బడిగంట గ్రామాల్లో ఆ గంట చప్పుడు ఒక ఆనందాన్ని కలిగించిందే, తప్ప విద్యార్థుల జీవితాలకు పురుడు పోసే ఆ పాఠశాల నిర్వీర్యంగా దర్శనం ఇవ్వడంతో అనేక అనుమానాలు దారి తీయగా తప్పలేదు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే పాఠశాలలు దీనస్థితికి వెళ్లిపోవడానికి కారణం అని చెప్పడానికి నేడు ఉమ్మడి మండలంలో పాఠశాలల ప్రారంభ దినోత్సవమే సాక్ష్యం అని చెప్పడానికి సందేహం లేదు.
మండలంలోని అనేక పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల మరమ్మత్తు పనులకు సంబంధించి అమ్మ ఆదర్శ పాఠశాలల్లో భాగంగా చేపట్టిన పనులు నేటికీ అసంపూర్తిగా ఉండి విద్యార్థులు పాఠశాలలకు వచ్చినప్పటికీ కూడా మరమ్మత్తు పనుల దృశ్య పలు పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బందులు కూడా కలగక తప్పలేదు. మరమ్మత్తు పనులు చేపడుతున్న పాఠశాలలో విద్యార్థులకు మంచినీరు, విద్యుత్ ,మరుగుదొడ్ల, విషయంలో ఇబ్బందులు పడక తప్పలేదు. ప్రభుత్వం విద్యార్థులకు సాధ్యమైనంత త్వరగా పాఠశాలలు ప్రారంభానికి ముందే మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆదేశించినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం, మరమ్మత్తు పనులు నేటికీ పూర్తి కాకపోవడం మరికొన్ని రోజులు కూడా మరమ్మత్తు పనులు కొనసాగే పరిస్థితి ఉండడంతో, పాఠశాలల్లో విద్యార్థుల రాక సంతోషానికి బదులు నిరాశను కలిగించింది అని అనక తప్పడం లేదు.
ప్రైవేట్ పాఠశాలలు కొత్త అడ్మిషన్ల కొరకు అనేక తిప్పలు పడుతుంటే, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం ఏది ఏమైనా తమకు జీతం వస్తుంది, తమ ఉద్యోగానికి ఢోకాలేదని సమయపాలనను పాటిస్తూ, కేవలం వర్కింగ్ అవర్స్ లోనే బడిబాట అని, నామమాత్రంగా కార్యక్రమాన్ని చేపట్టి రెండు శాతం విద్యార్థులను కూడా నూతన అడ్మిషన్లుగా చేర్చకపోవడం, ఉపాధ్యాయుల పాఠశాలలపై ఎంత శ్రద్ధ ఉంది అనేది దీన్నిబట్టి చూస్తే అర్థమవుతుంది. ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులకు సంబంధించి ప్రైమరీ నుండి మొదలుకొని పదవ తరగతి వరకు, అనేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాల విద్యా బోధన, ఉచిత యూనిఫాం, మధ్యాహ్న భోజనం, లాంటి సదుపాయాలు తల్లిదండ్రుల దృష్టికి తీసుకువచ్చి విద్యార్థులకు పాఠశాలలో చేర్పించే ప్రయత్నాలు చేయకపోవడం, నేడు ప్రభుత్వ పాఠశాలలో నూతన అడ్మిషన్లకు ఊసే లేకుండా పోయింది. పాఠశాల ప్రారంభ రోజు ఉపాధ్యాయుల బదిలీ గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు వేరే చోట్ల బదిలీ కావడం కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో రావడం, బడిబాట కొత్త అడ్మిషన్లకు బదిలీల ప్రక్రియ తో ఇబ్బందులు తీసుకురావడం జరిగింది.
ఉమ్మడి మండలంలో ప్రభుత్వ పాఠశాలల పురోగతికి సంబంధించి అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలు రోజురోజుకు విద్యార్థులు లేక మూసివేసి పరిస్థితికి తీసుకురావడానికి ప్రధాన కారణం ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడం, పాఠశాలకు నియమించబడిన ఉపాధ్యాయులు స్థానికంగా ఉండకుండా అటెండర్ లతో పాఠశాలలు కొనసాగించడం కనీస మౌలిక వసతులకు పాఠశాలలు నోచుకోకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలకు ప్రజల్లో నమ్మకం లేకపోవడం, కనీస విద్యార్థుల సంఖ్య కూడా పాఠశాలలో లేకపోవడం ప్రధాన కారణం. మరోవైపు విద్య అధికారులు పాఠశాల వ్యవహారాలకు సంబంధించి అధికారుల పర్యవేక్షణ ఉపాధ్యాయుల విధులపై శ్రద్ధ కనబరచకపోవడం కూడా ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకు గల ప్రధాన కారణాలను కూడా చెప్పవచ్చు.
పాఠశాలల ప్రారంభం రోజు విద్యార్థులకు పాఠశాలల నుండి ఆనందం కలగకుండా తమకు యూనిఫామ్ మాత్రం వచ్చిందని ఆనందపడే సందర్భాన్ని స్వయం సహాయక సంఘాలు విద్యార్థుల కళ్ళల్లో ఆనందాన్ని నింపాయని చెప్పవచ్చు. ప్రారంభానికి ముందే మండల స్వయంసేవక సంఘం ఆధ్వర్యంలో 15 పాఠశాల విద్యార్థులకు సరిపడే యూనిఫాములను నాణ్యత లోపాలు లేకుండా తయారుచేసి అందించి శభాష్ అనిపించుకున్నారు .
ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులకు పాఠశాల ప్రారంభానికి ముందే ఉచిత యూనిఫామ్ ప్రభుత్వం అందిస్తున్న క్రమంలో, అధికారులు మొదటి దశ యూనిఫామ్ ప్రతి విద్యార్థికి రెండు యూనిఫామ్ లు ఇవ్వాల్సినప్పటికీ ఒకే యూనిఫామ్ కు సరిపడే బట్టలు ఇవ్వడంతో 2379 యూనిఫామ్ లను తయారుచేసి స్వయంసేవక సంఘాలు అందించడం జరిగింది. పాఠశాల ప్రారంభం రోజు ఉమ్మడి మండలమంతా సరస్వతీ తల్లికి స్వాగతం పలకడంలో విఫలం కావడం జరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కానీ, పేద విద్యార్థులకు సరస్వతీ తల్లి ఆశీర్వాదం అందించడంలో పాఠశాలలు రాబోయే రోజుల్లో ఎంతవరకు సఫలీకృతులు అవుతారు అనేది చూడాల్సిందే.