మేడారం మహాజాతరకు వరంగల్ నుంచి 290 ప్రత్యేక బస్సులు

మేడారం మహాజాతరకు వరంగల్ నుంచి 290 ప్రత్యేక బస్సులు

వరంగల్ బస్ స్టేషన్ తాత్కాలిక బస్ పాయింట్ నుంచి ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులు.

వరంగల్ నుంచి మేడారంకు పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.150గా టికెట్ ధరలు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళలు, ట్రాన్స్‌జెండర్లు సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించి మహాలక్ష్మి పథకం ద్వారా ఎక్స్‌ప్రెస్ బస్సుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు.

ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతాం.

… డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్.

వరంగల్, నేటిధాత్రి.

 

మేడారం మహాజాతరకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వరంగల్ బస్ స్టేషన్ తాత్కాలిక బస్ పాయింట్ నుంచి ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ నుంచి మేడారం జాతరకు సుమారు లక్షకు పైగా ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తుండగా, అందుకు అనుగుణంగా 290 బస్సులను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. పరిస్థితిని బట్టి మరిన్ని బస్సులను కూడా వినియోగంలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు వరంగల్ ఓసిటి గ్రౌండ్ సమీపంలో బస్సులను పార్కింగ్ చేసి, అవసరాన్ని బట్టి అక్కడి నుంచి బస్సులను బస్ పాయింట్‌కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ నుంచి మేడారంకు పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.150గా టికెట్ ధరలను నిర్ణయించారు. అలాగే తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళలు, ట్రాన్స్‌జెండర్లు సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించి మహాలక్ష్మి పథకం ద్వారా ఎక్స్‌ప్రెస్ బస్సుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు. భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేలా నాలుగు ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయగా, వీటి ద్వారా 24 గంటల పాటు సేవలు అందించనున్నారు. టికెట్ తీసుకున్న అనంతరం క్యూలైన్ల ద్వారా నేరుగా బస్సుల్లో ఎక్కేలా ఏర్పాట్లు చేశారు. జాతర నిర్వహణలో భాగంగా సుమారు 800 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం చలువ పందిళ్లు, త్రాగునీరు, పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన సమాచారం, సూచనలు అందించేందుకు హెల్ప్‌డెస్క్, ప్రత్యేక మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హన్మకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ మాట్లాడుతూ, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామని, మేడారం మహాజాతరతో పాటు అగ్రహంపాడు జాతరకు కూడా వరంగల్ కూరగాయల మార్కెట్ సమీపం నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version