ప్రధాని కావాలని లేదు
– వరంగల్ సభలో సీఎం కేసిఆర్ వ్యాఖ్యలు
నేటిధాత్రి బ్యూరో : తనకు ప్రధానమంత్రి కావాలన్న కోరిక అసలే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం వరంగల్‌లోని అజంజాహి మిల్లు గ్రౌండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి పదవిపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అజంజాహి మిల్లు మైదానంలో సమావేశం నిర్వహించిన వారంతా ప్రధానమంత్రులయ్యారని, మంత్రి దయాకర్‌రావు తనతో అన్నారని, తనకు మాత్రం ప్రధానమంత్రి కావాలన్న కోరిక అసలే లేదని కేసిఆర్ అన్నారు. తన ప్రసంగంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలపై విరుచుకుపడ్డ ఆయన కేంద్రంలో చేతకాని వారే పాలిస్తున్నారని, ఈ దేశానికి అంతగా మంచిది కాదని, దేశంలో కాంగ్రెస్, బిజెపి లేని కూటమి రావాలని ఆయన ఆశించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు గోల్‌మాల్ గోవిందంలాగా తయారయ్యాయని ప్రధానమంత్రిపై కేసిఆర్ విమర్శలు చేశారు.
చిన్నచిన్న సమస్యలు సైతం కేంద్రం దగ్గర పరిష్కారం కాకుండా ఉన్నాయని, గడ్డివాము దగ్గర కుక్కలాగా వారు సమస్యలను పరిష్కరించారు..మనవి పరిష్కరించుకోనివ్వరు అని అన్నారు. నరేంద్ర మోడీ, రాహుల్‌గాంధీ అనవసరంగా పెడబొబ్బలు పెడుతున్నారన్నారు. వరంగల్ జిల్లా ఉద్యమంలో అగ్రభాగాన ఉందని, పార్లమెంట్ ఎన్నికల తీర్పులో సైతం అగ్రభాగంలోనే ఉండాలన్నారు. వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని, దేశంలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తయారైందని, అనేక సంస్కరణలను రాష్ట్రంలో అమలు చేశామన్నారు. ఎస్సారెస్పీ కాలువలు పూర్తి దశకు వచ్చాయని, త్వరలోనే కాళేశ్వరం నుంచి సైతం బటన్ నొక్కితే నీళ్లు వచ్చేలా నిర్మాణం పూర్తవుతుందన్నారు.
ప్రధాని మోడీ గుజరాత్ రాష్ట్రంలో సైతం 24గంటల కరెంట్ అమలులో లేదని, తెలంగాణ రాష్ట్రం ఆ ఘనత సాధించిందన్నారు. ఎన్నికలు వస్తే గెలువాల్సింది పార్టీలు కాదని, ప్రజల అభిమతం గెలవాలని కేసిఆర్ అన్నారు. కేంద్రం తెలంగాణకు 35వేల కోట్లు ఇచ్చామని ప్రగాల్బాలు పలుకుతోందని, కేంద్రం మనల్ని సాకడం లేదని, కేంద్రాన్నే మనం సాకుతున్నామన్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పసునూరి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చిన కేసిఆర్ పసునూరి వివాదరహితుడని, నియోజకవర్గానికి కావాల్సిన పనులను చేయించుకునే సత్తా కలవాడన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో దేవాదుల, ఇతర ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తున్నాయని, ఈ ప్రాజెక్టు వల్ల జిల్లా అంతా సస్యశ్యామలం కానుందన్నారు. తెలంగాణ హక్కులు, ప్రాజెక్టులు తదితర అవసరాల కోసం కేంద్రంపై పోరాడాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ సమస్య కేంద్రంలో పరిష్కారం కావాలంటే ప్రాంతీయ పార్టీలు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.