ఈటెల పేషిలో…అవినీతి ‘ప్రసాద’ం-1
ఆరోగ్యశాఖలో…నకిలీ ఓఎస్డీ ‘ప్రసాద’ం
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల పేషిలో అవినీతి, నకిలీ ప్రసాదం హల్‌చల్ చేస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి మంత్రి ఈటెలకు ఇద్దరు ఓఎస్డీలను కేటాయించినా ఈ అనధికార, నకిలీ ఓఎస్డీ వైద్య, ఆరోగ్య శాఖలో తిష్టవేసి కూర్చున్నాడు. అసలు కంటే కొసరే ముద్దు అన్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ సైతం ఈ అనధికార ఓఎస్డీకే అత్యధిక ప్రాముఖ్యతనిస్తూ సీఎం తనకు కేటాయించిన ఓఎస్డీలను పక్కన పెడుతున్నట్లు కనబడుతోంది. గురుకులాల్లో సీట్లు కావాలని, ప్రైవేట్ పాఠశాలల్లో సీట్లు కావాలని, వైద్యం చేయించాలని, సింగరేణిలో క్వార్టర్ కేటాయించాలని ఇలా ఒకటి కాదు, రెండు కాదు వందలాది ఉత్తరాలు ఓఎస్డీనంటూ సంతకం చేస్తూ మరి పంపాడు. అంతేకాదు అనధికార, నకిలీ ఓఎస్డీనని ఏ మాత్రం సోయి లేకుండా సాధారణ పరిపాలన శాఖ (ఓఎస్డీ)కి సైతం లెటర్‌లు పంపడం కావల్సిన ప్రపోజల్స్, అలవెన్సులు, వేతనం తదితర అంశాలన్నింటిని తెలుపుతూ ఓఎస్డీ హోదాలో లెటర్లు పంపాడంటే ఇతగాడి ధైర్యాన్ని, ఆరోగ్య మంత్రి ఇస్తున్న ప్రోత్సాహాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇతగాడు ఎవరో కాదు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయంలో సరసాదేవి కుంభకోణంలో ఎ2గా ఉన్న జక్కని ప్రసాద్. సమైక్య రాష్ట్రంలో కోట్ల కుంభకోణానికి కారకుడైన ప్రసాద్‌ను ఆహ్వానించి, ఆదరించి అనధికార ఓఎస్డీగా ఈటెల పేషిలో కొనసాగిస్తున్నారంటే దీనివెనకాల ఉన్న బలమైన కారణాలేంటో ఇప్పటికీ బేతాళ ప్రశ్నగానే మిగిలిపోతున్నాయి. ఈటెల రాజేందర్ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి పేషిలో తన పెత్తనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థికశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న ఈ నకిలీ ఓఎస్డీ ప్రసాద్ చేతివాటం చూపడంలో సిద్ధహస్తుడనే ఆరోపణలు ఉన్నాయి. ఈటెల పేషిలో సైతం ఇదే చేతివాటాన్ని చూపుతూ కన్సల్టెంట్‌గా చేరి ఓఎస్డీగా చెలామణి విడ్డూరంగా కనపడుతోంది.
ఆర్టీసీని తప్పుదారి పట్టించాడు..
టిఎస్ ఆర్టీసిలో ఉచితంగా ప్రయాణం చేయడానికి నకిలీ ఓఎస్డీ జక్కన ప్రసాద్ ఏకంగా బస్‌భవన్‌కు ఓ లేఖ పంపాడు. లేఖ పంపడం బాగానే ఉన్న తాను ఓఎస్డీనని ఆర్థికశాఖ మంత్రి ఈటెల వద్ద పనిచేస్తున్నానని కాంప్లీమెంటరీ పాస్ సంపాదించాడు. నిజానికి ఇతను ఓఎస్డీ కాదు ఈటెల ఆర్థిక మంత్రి కాదు. కానీ ఆర్టీసి అధికారులు సైతం చూసిచూడనట్లే చూసి ఓఎస్డీ ఆర్థికశాఖ అంటూ కాంప్లీమెంటరీ పాస్ జారీ చేశారు. అంతేకాదు ఈ నకిలీ ఓఎస్డీ పిఎలు కానివారికి సైతం ఈటెల వద్ద పనిచేసే డ్రైవర్లకు, ఇతరులకు అసెంబ్లీ పాస్‌లు ఇతర రాయితీలను ఓఎస్డీనంటూ లెటర్‌లు పంపి సాధించిపెడతాడు. ఇవన్నీ చూస్తుంటే ఇతగాడు ఎంతటి అసాద్యుడో ఈటెల పేషిలో ఏ మేరకు తన పెత్తనాన్ని కొనసాగిస్తున్నాడో అర్థమైపోతుంది.
మంత్రి ఈటెలకు తెలిసే జరుగుతుందా…?
రోజు వందలకొద్ది లెటర్లు, వివిధ శాఖలకు రిఫరెన్స్‌లు పెడుతూ జక్కని ప్రసాద్ అనధికార ఓఎస్డీగా ఎలా కొనసాగుతున్నాడు. మధ్యాహ్నం 12గంటలకు పేషిలోకి వచ్చి 4గంటలకు వెళ్లిపోయే నకిలీ ఓఎస్డీ లక్షల్లో వేతనం దండుకుంటుండడం సాధారణ పరిపాలన శాఖనే తప్పుదారి పట్టిస్తూ తాను ఓఎస్డీనంటూ ఫోజులు కొడుతుండటం తెలంగాణ సచివాలయంలో చర్చకు దారితీస్తోంది. అయితే ఇదంతా మంత్రి ఈటెల రాజేందర్‌కు తెలియకుండానే జరుగుతుందా…? అనుకుంటే అలా కానే కాదు…తన నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి, ప్రసాద్ జీతభత్యాల విషయంలో ఇతరత్రా సమస్యలపరంగా ఓఎస్డీనంటూ ఇప్పటివరకు వందలకొద్ది లేఖలు పంపాడు. ఈ నకిలీ ఓఎస్డీ ఇంత జరుగుతున్న ఈటెలకు తెలియకుండా ఎలా ఉంటుంది. ఏకంగా మంత్రి పేషిలోనే కన్సల్టెంట్‌గా చేరి ఓ వ్యక్తి ఓఎస్డీనంటూ అనుమతి లేకుండా ఎలా విధులు నిర్వహిస్తాడు అలా సాధ్యం కానే కాదు. అయితే ప్రభుత్వం నియమించకుండా, ఎలాంటి ఉత్తర్వులు లేకుండా జక్కన ప్రసాద్ అనధికార ఓఎస్డీగా కొనసాగుతున్నడంటే మంత్రి చొరవతోనే అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ సీఎం ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ప్రభుత్వం కేటాయించిన ఇద్దరు ఓఎస్డీలు ఉండగా జక్కని ప్రసాద్‌ను ఈటెల అనధికార ఓఎస్డీగా ఎందుకు కొనసాగిస్తున్నాడనేదే ప్రశ్న. కొద్ది నెలలుగా ఈ ప్రశ్న మంత్రి పేషిలోని ఉద్యోగులందరినీ వేదిస్తున్నా సమాధానం మాత్రం దొరకడం లేదు. ఓఎస్డీ కాకున్న ఓఎస్డీనంటూ విధులు నిర్వహిస్తున్న జక్కని ప్రసాద్‌ను ఇదేంటని సాధారణ పరిపాలన శాఖ (జిఎడి), అధికారులు సైతం ప్రశ్నించలేదంటే ప్రసాద్ మహత్యం అలాంటిదన్న మాట.
కథనాలు నన్నేం చేస్తాయి…?
నకిలీ ఓఎస్డీగా చెలామణి అవుతూ మంత్రి ఈటెల పేషిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జక్కని ప్రసాద్ ఇంకా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. నకిలీ ఓఎస్డీ బండారం బయటపడబోతుందని తెలియగానే ‘నేటిధాత్రి’ కథనం తననేం చేయదని కోట్ల కుంభకోణంలోనే తనను ఏం చేయలేకపోయారని…ఇదేంత…? అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడట. తన అనుభవంలో ఎన్నో చేశానని ఈ కథనాలు తనకో లెక్క కాదని అంటున్నాడట.
ప్రసాదాన్ని కాపాడుతున్నదెవరూ…?
ఈటెల పేషిలో ఎలా పాతుకుపోయాడు…?
సీఎం ఆదేశాలు ఎందుకు బేఖాతరు అవుతున్నాయి…?
(రేపటి సంచికలో…)