అసాంఘిక కార్యకలాపాల్ అడ్డా ‘అన్నారం’
ప్రముఖ యాత్రా స్థలం అన్నారం గ్రామంలో యాత్రికులకు ఏర్పరచిన రూములు ప్రేమికులకు అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యం యాత్రికులతో రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో గ్రామంలోని కొంతమంది ప్రైవేటు రూముల యజమానులు చీకటి దందాకు తెర లేపుతున్నారని అంటున్నారు. పర్వతగిరి మండలం అన్నారం గ్రామం తెలంగాణలోని ప్రముఖ యాత్రస్థలాల్లో ఒకటి. ఇక్కడ దర్గాకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారని, జాతరకు వచ్చిన భక్తులకు రూములు కిరాయికి ఇవ్వడం కొరకు వందలసంఖ్యలో ప్రయివేటు రూములు వెలిశాయని, ఇందులో కొంతమంది ప్రయివేటు రూముల వారు యాత్రికుల పేరు చెప్పి కొత్త జంటలకు రాసలీలల కొరకు వారి ఏకాంతానికి అనువుగా రూములు ఏర్పరిచి కిరాయిలకు ఇస్తూ డబ్బులు దండుకుంటున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. వీటి వలన చుట్టూ ప్రక్కల కుటుంబీకులు ఇదేమిటని అడగడంతో వారితో గొడవలకు దిగుతున్నారని అంటున్నారు. నిబంధన ప్రకారం యాత్రాస్థలాల్లో కొత్త జంటలకు రూములు కిరాయికి ఇవ్వకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇలాంటి వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ నాలుగురోజులు మామూలుగానే ఉంటున్నారని, తర్వాత చీకటి బాగోతాలు షరామామూలేనని, తూతూ మంత్రంగా జరుగుతున్నా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలంటే పోలీసులు మరింత పగడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. ప్రముఖ యాత్రా స్థలమైనా అన్నారం గ్రామానికి ఇలాంటి వాటి వలన తలవంపులు రావడం జరుగుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎస్‌కె.షబ్బీర్
మండల కో ఆప్షన్ సభ్యుడు
యాత్రికులకు రూములు కిరాయికి ఇస్తున్నామని చెప్పి ఇలాంటి ప్రేమ జంటలకు కిరాయికి ఇవ్వడం వలన చుట్టుపక్కల కుటుంబాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటిపై పోలీసులు, అధికారులకు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు